నర్సంపేటలో ఓట్ల లెక్కింపు అనంతరం విజయ సంకేతం చూపుతున్న టీఆర్‌ఎస్ నాయకులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉద్యమాల ఖిల్లా.. పోరాటాల జిల్లాలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. తొమ్మిది మున్సిపాలిటీలకు గాను ఎనిమిది చోట్ల భారీ ఆధిక్యతను సాధించింది. ఇక మరిపెడ మున్సిపాలిటీలోనైతే 15 వార్డులకు మొత్తం టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుచుకున్నారు. పరకాల, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట, భూపాలపల్లిలో ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులు దారిదా పుల్లో లేకుండా పోయారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 19 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ 10, సీపీఐ, సీపీఎం రెండేసి వార్డులను, స్వతంత్రులు మూడు వార్డులను గెలుచుకున్నారు.
గులాబీ బ్రహ్మరథం
ఓరుగల్లు ఇలాకాలో మరోసారి గులాబీ ప్రభంజనం వీచింది. ఓటెత్తిన జనం మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 9 మున్సిపాలిటీలోŠల్ ఆ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు పట్టం కట్టారు. జనగామ మున్సిపాలిటీ మినహా కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయంది. మొత్తం 200 వార్డులకు 134 వార్డులు టీఆర్‌ఎస్ గెలుచుకుంటే.. 33 వార్డులకే కాంగ్రెస్ పరిమితమైంది. ఇక బీజేపీ 10 గెలుచుకోగా, ఏఐఎఫ్‌బీ 4, సీపీఐ 4, సీపీఎం 2 వార్డులు గెలవగా.. 13 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.
రోజురోజుకు జిల్లాలో పతనమవుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ 19 వార్డుల నుంచి అభ్యర్థులను దింపగా, ఒక్కరు కూడా గెలుపొందలేదు. జనగామలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థులను దింపిన డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గట్టి పోటీ ఇవ్వగా, మహబూబాబాద్‌లోను 10 వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. నర్సంపేటలో ఆరు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్, మిగతా మున్సిపాలిటీల్లో ప్రభావం చూపలేకపోయంది. కాంగ్రెస్ దిగ్గజాలకు ఓటర్లు ఈ ఎన్నికల్లోనూ షాక్ ఇచ్చారు. 135 వరకు వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 10 వార్డుల్లో గెలిచింది.
లెక్క తప్పిన జనగామ
జనగామ మున్సిపాలిటీ విషయానికొస్తే టీఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపు నుంచి వివాదాలే చోటు చేసుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులపై రెబల్స్ ఇక్కడి నుంచే పోటీ చేశారు. దీంతో ఇక్కడ 30 వార్డులకు టీఆర్‌ఎస్ 13 మాత్రమే గెలుచుకోగా, 10 కాంగ్రెస్, 4 బీజేపీలు గెలుచుకున్నాయి. మరో మూడు వార్డుల్లో టీఆర్‌ఎస్ టికెట్ రాని వారు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లకు గాలం వేయగా, టీఆర్‌ఎస్ సైతం ఇతర పార్టీల కౌన్సిలర్లను లాగడంతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది.
వరుస విజయాలు : అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలను సాధించిన టీఆర్‌ఎస్... మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే హవా కొనసాగించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసింది. కాగా, ఈనెల 27వ తేదీ సోమవారం న జరిగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగుర వేయనుంది.
క్యాంపులకు కౌన్సిలర్లు
తొమ్మిది మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం నుంచే కౌంటింగ్ మొదలైంది. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ఆయా మున్సిపాలిటీల్లో ఆధిక్యత పెరిగి విజయావకాశాలు ఉన్న కౌన్సిలర్లను ఒక చోటకు చేర్చేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇన్‌చారి్జలను నియమించారు. ఫలితాల వెల్లడయ్యాక ఒక్కో మున్సిపాలిటీకి చెందిన క్యాంపు ఇన్‌చార్జీలు వారిని నిర్దేశించిన ప్రాంతాలకు తరలించారు. మొత్తం 9 మున్సిపాలిటీల్లో 200 వార్డులకు 18 ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని సైతం కౌంటింగ్ కేంద్రాలకు రప్పించిన పార్టీల నేతలు.. ఫలితాలు వెల్లడి తర్వాత పార్టీల వారీగా క్యాంపులకు తరలించారు. మొత్తం మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయడం లక్ష్యంగా టీఆర్‌ఎస్ క్యాంపులు నిర్వహిస్తుండగా.. మిగతా పార్టీల కౌన్సిలర్లు చెదిరిపోకుండా ఆయా పార్టీల నేతలు కూడా క్యాంపులకు కౌన్సిలర్లను తరలించారు. ఈనెల 27వ తేదీ సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ఉండడం.. మధ్యలో ఒక రోజే సమయం ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉండేలా క్యాంపులు ఏర్పాటు చేశారు.
కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 9 మున్సిపాలిటీల టీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల పర్యవేక్షణలో హైదరాబాద్, వరంగల్‌ల్లో రిసార్టులు, ఫంక్షన్ హాల్‌లు, హోటళ్లలో బస ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక నర్సంపేటకు చెందిన కౌన్సిలర్లు హన్మకొండ అశోక్ హోటల్‌లోనే ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment