ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం
పాతబస్తీని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం
మోసాల్లో కేసీఆర్‌ను మించిన కాంగ్రెస్ ప్రభుత్వం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
నయీంనగర్ (హనుమకొండ): ‘మా టార్గెట్ పాతబస్తీ. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చాలని పోరాడుతున్నాం... ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం. పాతబస్తీని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సంఘ విద్రోహులకు అడ్డాగా మారిన పాతబస్తీని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని మైనారిటీ మోర్చా నాయకులంతా ముస్లింలకు వివరించాలని సూచించారు.
హనుమకొండలో శనివారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు, మోసాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను మించిపోయిందన్నారు. ‘వెయ్యి ఎకరాల్లో జూ ఏర్పాటు చేస్తారట. మరో వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తారట. వేలాది ఎకరాల్లో ఫోర్త్ సిటీని నిర్మిస్తారట. అసలు ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్ముకున్నడు... మరి ఈ ప్రభుత్వం యాడ నుండి తీసుకొస్తది.?’అని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పాలనలో బీజేపీ కార్యకర్తలపై చేసిన అరాచకాలను మర్చిపోలేమని, బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసే వాళ్లమని చెప్పారు. రాక్షస పార్టీ బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారమన్నారు. కాంగ్రెస్‌లోనే బీఆర్‌ఎస్ విలీనం ఖాయమని, మాట ముచ్చట కూడా పూర్తయ్యిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment