జవహర్‌నగర్ బహిరంగ సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
జవహర్‌నగర్/కరీంనగర్ టౌన్: హత్యలకు, అత్యాచారాలకు కేరాఫ్‌గా టీఆర్‌ఎస్, ఎంఐఎం పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల సేవ, సుపరిపాలనను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో సోమవారం సాయంత్రం బహిరంగసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం, 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు, 3 కోట్ల మందికి ఇళ్లు కట్టించిందన్నారు.
‘కేసీఆర్ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. తెలంగాణలో ఆర్టీసీని అమ్ముకోవడానికి కుట్రపన్నుతున్నారు. తెలంగాణను మరో శ్రీలంకగా కేసీఆర్ మారుస్తారు. కుటుంబ పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం బిచ్చమెత్తుకునే దుస్థితికి వస్తుంది’ అని సంజయ్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ నిందితులకు స్టార్ హోటల్‌లో విందులు చేయడంపై ధ్వజమెత్తారు. బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఏనాడు రాష్ట్ర సరిహద్దులు కూడా చూడలేదని, మేడ్చల్ నియోజకవర్గానికే పరిమితమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
గౌరవెల్లి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం
గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో పోలీసులు అర్ధరాత్రి పేదలపై దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని సంజయ్ ఒక ప్రకటనలో ఖండించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని మండిపడ్డారు.
అర్ధరాత్రి దాడులు చేయడం ఆటవికమని, రజాకార్ల పాలనలో, బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి అరాచకాలు చేయలేదేమోనన్నారు. మహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమని, అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment