
సాక్షి, హైదరాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశంపై కాంగ్రెస్ నటించనందుకు సంతోషమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. అయోధ్య అంశంపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి సంకేతంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం చేసిన ట్వీట్‌పై ఒవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ హిందూత్వ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటే ఫర్వాలేదని, కానీ, జాతీయ ఐక్యత, సాంస్కృతిక సమ్మేళనం, సోదరభావం లాంటి వ్యాఖ్యలెందుకని దుయ్యబట్టారు. చరిత్రాత్మక బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ చేసిన కృషికి సిగ్గుపడవద్దు....గర్వపడమని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే అయోధ్య రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవడంపై ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణంచేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న ఓ క్రిమినల్స్ గుంపు ధ్వంసం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లౌకికత్వం రాజ్యాంగంలో ముఖ్యభాగమని, దానిని అందరూ తప్పనిసరిగా గౌరవించాలని హితవు పలికారు.