GHMC Elections Results 2020: TRS Leading | కాంగ్రెస్ ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్‌ డిజిట్‌ - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్‌ డిజిట్‌

Published Fri, Dec 4 2020 12:33 PM | Last Updated on Fri, Dec 4 2020 6:43 PM

GHMC Elections Results 2020 : TRS Leading - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీని హైదరాబాద్‌ ఓటర్లు మరోసారి తిరస్కరించారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. హస్తం పార్టీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. కేవలం ఒక్క డివిజన్‌లో విజయం సాధించి.. మరో రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం గ్రేటర్‌లో మరోసారి సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ రేవంత్‌ రెడ్డి నగరంలో విసృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఓటర్లను ఆకట్టుకుకోలేకపోయారు. అయితే పలు డివిజన్‌లో మాత్రం టీఆర్‌ఎస్‌, బీజేపీకి గట్టిపోటీనిస్తోంది. ఇక దుబ్బాక విజయంతో ఒక్కసారే రేసులోకి వచ్చిన బీజేపీ.. కాంగ్రెస్‌ ఓట్లకు భారీగా గండికొట్టినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాషాయదళం భారీగా ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆ పార్టీ అభ్యర్థులు 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పలుచోట్ల అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీనిచ్చింది. మరోవైపు హైదరాబాద్‌పై మజ్లీస్‌ మరోసారి పట్టునిలుపుకుంది. 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇప్పటికే నాలుగు స్థానాల్లో విజయం నమోదు చేసింది. (మెజార్టీ డివిజన్లలో బీజేపీ ఆధిక్యం)

రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డ అధికార టీఆర్‌ఎస్‌... బ్యాలెట్‌ ఓట్లలో జోరుపెంచింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. టీఆర్‌ఎస్‌ 40 డివిజన్‌లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 20, ఎంఐఎం అభ్యర్థులు 16 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. మెహదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించిన.. గ్రేటర్‌లో తొలి గెలుపును నమోదు చేసింది. అక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి, మాజీ డిప్యూటీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. యూసఫ్‌గూడ (రాజ్‌కుమార్‌ పటేల్‌), మెట్టుగూడ (రాసూరి సునీత) డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి గ్రేటర్‌ పీఠంపై గులాబీ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది.

ఏఎస్‌రావు నగర్‌లో కాంగ్రెస్‌ (శిరీషారెడ్డి) గెలుపొంది.. గ్రేటర్‌లో ఖాతా తెరిచింది. పలుచోట్ల టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. మరికొన్ని డివిజన్‌లలో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు మజ్లీస్‌ సైతం మరోసారి తన పట్టునిలుపుకుంది. సిట్టింగ్‌ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీ ఆధిక్యం కనబర్చడం విశేషం. ఇక గ్రేటర్‌ ఫలితాల్లో గులాబీ పార్టీకి అనుకూలంగా తీర్పు వెలువడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపార్టీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement