సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజవకర్గంలో కారు స్పీడుకు బ్రేక్ పడింది. అడిక్‌మెట్ డివిజన్‌లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థిని మార్చకపోవడం, ఇన్‌చార్జిగా వ్యవహరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడే తిష్టవేసి అహర్నిషలూ శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముషీరాబాద్ డివిజన్‌లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిని మార్చకపోవడం, రూ.10వేల వదర సాయం, కార్పొరేటర్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అధికార పార్టీ ఓటమికి దారి తీసింది. రాంనగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అధిష్టానం సిట్టింగ్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన 5వేల ఓటు బ్యాంకున్న పలు బస్తీలు ముషీరాబాద్ డివిజన్‌లో కలవడం, అసమ్మతి నేతలను బుజ్జగించడంలో ఆలస్యం చేయడంతో బీజేపీ అభ్యర్థి వి.రవిచారికి విజయానికి దోహదం చేశాయి.
భోలక్‌పూర్ డివిజన్‌లో ఎంఐఎం నాయకత్వం కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో మరోసారి ఎంఐఎం తన పట్టును నిలుపుకొంది. గాంధీనగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ హ్యాట్రిక్ సాధిస్తారనుకున్నా.. టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత, బీజేపీ పాజిటివ్ ఓట్లు కొంపముంచాయి. కవాడిగూడ డివిజన్ టికెట్‌ను టీఆర్‌ఎస్ సిట్టింగ్ అభ్యర్థి లాస్యనందితకే మళ్లీ ఇచ్చారు. ఆమె తండ్రి ఎమ్మెల్యేగా ఉండటం, డివిజన్‌లో ఆమె పట్ల ఉన్న వ్యతిరేకత, బీజేపీ గాలి తోడవడం, బీజేపీ అభ్యర్థి ఒక టెంట్ హౌస్ నడుపుకునే సామాన్య నాయకుడి కుమార్తె కావడంతో టీఆర్‌ఎస్ ఓటమికి కారణంగా కనిపిస్తోంది.
చీలిన ఓట్లు.. సంక్షేమ పథకాలు
జూబ్లీహిల్స్: ఆరు సిట్టింగ్ స్థానాలకుగాను టీఆర్‌ఎస్ నాలుగు డివిజన్లను నిలబెట్టుకుంది. బోరబండ, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, రహమత్‌నగర్‌లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. చీలిన ఓట్లు, ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీకి కలిసొచ్చాయని చెబుతున్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్లలో మైనార్టీలు పెద్దసంఖ్యలో ఉండడంతో ఎంఐఎం సులభంగా విజయం సాధించింది.
ఎల్‌బీనగర్‌లో వరద సాయం, ఎల్‌ఆర్‌ఎస్ ప్రభావం
ఎల్‌బీనగర్: ఎల్‌బీనగర్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరదలు ముంచెత్తడంతో చాలా కాలనీలు నీట మునిగి కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం అందించిన వరద సాయం అసలైన బాధితులకు అందలేదనే కారణంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. దీంతో ఆ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నీట మునిగిన కాలనీలకు చెందిన వరద బాధితులకు సహాయ అందిచండంలో అధికార పార్టీ కార్పొరేటర్లు తమ బంధువర్గాలకు, సన్నిహితులకు, కార్యకర్తలకు ఇచ్చారని కారణంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు ఉన్నవారు ఎల్‌ఆర్‌ఎస్‌ను వ్యతిరేకించారు.
పట్టు నిలుపుకొన్న ఎంఐఎం
నాంపల్లి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం విజయ ఢంకా మోగించింది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్‌కు ఉన్న ఒక్క స్థానాన్ని చేజార్చుకుంది. గుడిమల్కాపూర్ నుంచి బీజేపీ ఖాతా తెరుచుకుంది.
బీజేపీ అగ్రనేతల ప్రచారం‘కమల’ వికాసం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు చేసిన ప్రచారం బీజేపీ అభ్యర్థుల ‘స్టార్’ మార్చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర అగ్రనేతలు చేసిన ప్రచారం గ్రేటర్‌లో ఆ పార్టీ పుంజుకునేందుకు దోహదపడింది. 150 డివిజన్లలో పోటీ చేసిన ఆ పార్టీ ఎవరి ఊహలకు అందని విధంగా ఏకంగా 48 సీట్లు సొంతం చేసుకొని గ్రేటర్‌లో అత్యధిక సీట్లు సాధించిన రెండో పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, అనంతరం ప్రచార తీరుతెన్నులు, బావోద్వేగ ప్రసంగాలతో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకొనేలా బీజేపీ నేతల వ్యవహరించిన తీరు కమలం వికాసానికి తోడ్పడింది. గ్రేటర్ ఎన్నికలతో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ బలంగా చెప్పగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఉన్న అతి తక్కువ సమయంలో బీజేపీ అభ్యర్థులు పెద్దగా ప్రజలకు పరిచయం లేకున్నా అగ్రనేతల ప్రచారశైలి వారికి ఓట్లు తెచ్చిపెట్టింది.
ఎక్కడెక్కడ ఫలితాలు ఎలా..
- కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వారాసిగూడ నుంచి సీతాఫల్‌మండి వరకు చేసిన రోడ్డు షో ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మిగతా డివిజన్లలో గెలుపుపై ప్రభావాన్ని చూపింది. అడిక్‌మేట్, కవాడిగూడ, రాంనగర్ ప్రాంతాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది.
- బీజేపీ కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డా నాగోల్ నుంచి చైతన్యపురి వరకు రోడ్డు షో మాత్రం అనూహ్య ఫలితాన్ని రాబట్టింది. ఆయా ప్రాంతాల్లో వరదలు వచ్చిన సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నేతలు వ్యవహరించిన తీరును కూడా ప్రసంగాల్లో ఎండగడుతూ చేసిన ప్రచారం కమలం పార్టీకి ఓట్లు కురిపించింది. ఏకంగా ఎల్‌బీ నియోజకవర్గంలోని 13 సీట్లను క్లీన్‌స్వీప్ చేసింది. ఆర్‌కేపురం, సరూర్‌నగర్, బీఎన్ రెడ్డి, హస్తినాపురం, చంపాపేట, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురిలలో కాషాయ జెండా రెపరెపలాడింది.
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన జీడిమెట్ల ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి చెరకుపల్లి తారాచంద్రరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వినిసూర్య కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు.
- ఎన్నికల పరిశీలకుడు బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ వ్యూహాలను రాష్ట్ర పార్టీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అమలు చేసి ప్రచారంలో ఓటర్లను ఆకర్షించి విజయం వైపు తీసుకెళ్లారు.
మోండాలో విలక్షణ తీర్పు
కంటోన్మెంట్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రాంతాలతో కూడుకున్న మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన ప్రజలకు అధిక సంఖ్యలో ఉన్నారు. డివిజన్ పరిధిలోనే ఉండే మారేడుపల్లిలో అధిక ఆదాయ వర్గాలు, ఉన్నత విద్యావంతుల శాతం ఎక్కువగా ఉంది. బస్తీలు పరిమిత సంఖ్యలోనే ఉండే ఈ ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉండటంతో ప్రతీ ఎన్నికల్లోనూ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విలక్షణ తీర్పునిస్తూ ఉంటారు. ఈ నేపపథ్యంలోనే తాజా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో బీజేపీకి మద్దతుగా నిలిచారు. కంటోన్మెంట్‌కు చెందిన కీలక నేతలు రామకృష్ణ, మల్లికార్జున్‌లు ఇటీవలే బీజేపీలో చేరడంతో మోండా పరిధిలోని వారి అనుచరగణం పెద్ద సంఖ్యలో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా బరిలోని నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో చాలా వరకు నెరవేర్చకపోవడంతో కొంత వ్యతిరేకత నెలకొంది.అంబేడ్కర్‌నగర్, లోహియా నగర్ వంటి బస్తీల్లోనూ ఆంధ్రా సెటిలర్లు బీజేపీకి అనుకూలంగా వేసినట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ సిట్టింగ్‌లపై వ్యతిరేకత..
టీఆర్‌ఎస్‌ను సిట్టింగ్ అభ్యర్థులే కొంపముంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్లపై జనంలో వ్యతిరేకత ఉందనేందుకు ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. ఈసారి 72 మంది సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్ సీట్లు ఇవ్వగా.. ఇందులో 28 మంది మాత్రమే గెలుపొందారు. అంటే దాదాపు 44 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు చుక్కెదురైంది.
స్వయంకృతాపరాధంతో..
ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు టీఆర్‌ఎస్ సీట్లలో ఒకదాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భార్య భేతి స్వప్న హబ్సిగూడ డివిజన్ నుంచి బరిలో దిగారు. దీంతో ఆయన ఇతర డివిజన్లలో ప్రచారం చేయకపోవడం, వరదతో హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్‌లోని కాలనీలు ముంపునకు గురికావడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెరసి ఉప్పల్ సర్కిల్‌లో టీఆర్‌ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. కాప్రా సర్కిల్‌లో ఏఎస్‌రావునగర్ స్థానం మినహా అన్ని సీట్లు టీఆర్‌ఎస్ దక్కించుకుంది. కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి, కేసీఆర్ పథకాలు శ్రీరామరక్షగా నిలిచాయి.
కొంపముంచిన అతివిశ్వాసం.. ఆరోపణలు
మల్కాజిగిరి: సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో సిట్టింగ్ కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అతివిశ్వాసం, వరద సహాయం అందని బాధితుల అసంతృప్తితో పాటు కార్పొరేటర్లపై ఆరోపణలు, ఉద్యమకారులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ఓటమికి కారణాలుగా
భావిస్తున్నారు.
ఓల్డ్‌సిటీలో బీజేపీ పాగా
ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఓల్డ్‌సిటీలో బీజేపీ పాగా వేసింది. మూడు డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ 10 డివిజన్లకు విస్తరించింది. ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యాల ఏరివేత ప్రధాన అస్త్రాలుగా బీజేపీ ప్రచారం చేసి పాగా వేసింది. 7 టీఆర్‌ఎస్, ఒక ఎంఐఎం సిట్టింగ్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.
సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అయిదు డివిజన్లనూ టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. నగరం అంతా బీజేపీ పవనాలు వీచినా ఇక్కడ మాత్రం అధికార పార్టీ తన స్థానాలను పదిలపర్చుకుంది. సీఎం సహాయనిధి, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న ఇక్కడి ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరందరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి టీఆర్‌ఎస్‌కు బాసటగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలోని అయిదు డివిజన్లలో తెలంగాణ జిల్లాలకు చెందినవారు పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నారు. వీరంతా తెలంగాణ ఉద్యమకాలం నుంచి టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటున్నారు.
ఫలించని మంత్రుల వ్యూహం...
దిల్‌సుఖ్‌నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో నాలుగు స్థానాలను ఎంఐఎం తిరిగి గెలుచుకోగా టీఆర్‌ఎస్ రెండు స్థానాలను కోల్పోయింది. అజంపుర, ఓల్డ్‌మలక్‌పేట్, చావుణి, అక్బర్‌బాగ్ డివిజన్లలో కొంత వ్యతిరేకత ఉన్నా ఎంఐఎంకు గట్టి ప్రత్యర్థులు లేకపోవడంతో వారి విజయం నల్లేరు మీద నడకలా సాగింది.వరదల సమయంలో సరైన సహాయం అందకపోవడంతో మూసారంబాగ్, సైదాబాద్ డివిజన్లలో టీఆర్‌ఎస్ ఓడిపోయింది. దానికితో వరదసాయం అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌లో ప్రభుత్వ వ్యతిరేకత, వరదసాయం అందరికీ అందకపోవడంతో టీఆర్‌ఎస్‌ను ఓడించారు. ఇద్దరు మంత్రుల వ్యూహం ఫలించలేదు. అనూహ్యంగా బీజేపీ 5 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. టీఆర్‌ఎస్‌కు ఒక్కసీటూ దక్కలేదు.
లోకల్ కేడర్ పట్టించుకోకవడం వల్లే..
హుడా కాంప్లెక్స్: లోకల్ కేడర్‌తో కాకుండా డివిజన్లతో సంబంధం లేని నేతల జోక్యమే అధికార పార్టీ పుట్టి ముంచిదా? అంటే అవుననే అంటున్నారు టీఆర్‌ఎస్ నాయకులు.
- ఓటర్లతో ముఖాముఖి పరిచయాలు, క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన, బంధుగణం అధికంగా ఉన్న స్థానిక నేతలను పక్కన పెట్టి.. ఓటర్లతో ఏ మాత్రం పరిచయం లేని ఇతర ప్రాంత నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది.
- ఒక్కో డివిజన్‌కు మంత్రి సహా ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలగా నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న లోకల్ కేడర్‌ను కాకుండా తమ నియోజకవర్గాల పరిధిలోని లీడర్లను రంగంలోకి దింపారు.
- ప్రచార సరళి, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీలో వీరే కీలకంగా వ్యవహరించారు. దీంతో లోకల్ కేడర్ మనస్తాపంతో పోల్ మేనేజ్‌మెంట్‌కు దూరంగా ఉంది.
- సరూర్‌నగర్ సిట్టింగ్ అభ్యర్థిపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినçప్పటికీ ఇతర నేతల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక వారంతా దూరంగా ఉండిపోయారు. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చింది.
- వరద సహాయం పంíపిణీలో చోటు చేసుకున్న అవకతవకలు కూడా బీజేపీ బలం పెంచుకునేందుకు పరోక్షంగా కారణమైంది.
- బీజేపీ సిట్టింగ్ స్థానం ఆర్‌కేపురంపై ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పార్టీ భావించింది. ఆ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. అయినా ఇక్కడి ఓటర్లు మాత్రం సిట్టింగ్ అభ్యర్థి రాధాధీరజ్‌రెడ్డికే మళ్లీ పట్టం కటారు.
‘కార్వాన్’లో సత్తా చాటిన మజ్లిస్..
గోల్కొండ: కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ మరోసారి సత్తాను చాటింది. గత ఎన్నికల్లో గెలిచిన అయిదు స్థానాల్లో ఆ పార్టీ మళ్లీ విజయం సాధించింది. ముగ్గురు సిట్టింగ్, ఇద్దరు కొత్తవారిని బరిలో దింపి టోలిచౌకి, నానల్‌నగర్, గోల్కొండ డివిజన్‌లలో మెజార్టీ మరింత పెంచుకుంది. నియోజకవర్గంలోని ఆరు స్థానాలలో అయిదు మజ్లిస్ గెలుపొందగా, జియాగూడ స్థానంలో కమలం వికసించింది. జియాగూడలో సిట్టింగ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మిత్ర కృష్ణ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. గట్టి పోటీ అనుకున్న లంగర్‌హౌస్‌లో మజ్లిస్ సిట్టింగ్ అభ్యర్థి మరోసారి గెలుపొందారు. కార్వాన్ నియోజకవర్గం మజ్లిస్‌కు కంచుకోటగా మరోసారి రుజువైంది. కార్వాన్, లంగర్‌హౌస్, నానల్‌నగర్, గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు గెలుపొందారు. జియాగూడలో కమలం పదేళ్ల తర్వాత మళ్లీ వికసించింది. ఆరు డివిజన్లలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
అటు అసమ్మతి.. ఇటు మార్పు
అంబర్‌పేట: కాచిగూడ డివిజన్‌లో గతంలో ఓడిన బీజేపీ అభ్యర్థి ప్రజల మధ్యలో ఉండటం, దీనికి తోటు సిట్టింగ్ కార్పొరేటర్ రెబల్‌గా ఉండటంతో టీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. ఈ డివిజన్ బీజేపీ అభ్యర్థి కన్నె ఉమా రమేష్‌యాదవ్ గెలుపొందారు.
- నల్లకుంట డివిజన్‌లో సిట్టింగ్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి పదేళ్లు కార్పొరేటర్‌గా వ్యవహరించడంతో ఈ దఫా ప్రజలు మార్పు కోరుకొని బీజేపీ అభ్యర్థి అమృతను గెలిపించారు. రెబల్‌గా నామినేషన్ వేసిన ఉద్యమకారుడు కట్ట సుధాకర్‌ను ఉపసంహరించడంలో.. సీనియర్ నాయకులను సైతం ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయలేకపోవడం ఓటమికి మరో కారణం. దీనికి తోటు ఈ డివిజన్‌లో ముంపు సాయం కూడా ప్రభావం చూపింది.
- గోల్నాక డివిజన్‌లో టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థిని కాకుండా కొత్తవారైన దూసరి లావణ్యకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ మైనార్టీలతో పాటు ఎమ్మెల్యే సొంత డివిజన్ కావడంతో గులాబీ అభ్యర్థి విజయం సాధించగలిగారు.
- అంబర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్ పులి జగన్‌కు కాకుండా కొత్త అభ్యర్థి విజయ్‌కుమార్‌గౌడ్‌కు అధిష్టానం అవకాశం కల్పించింది. ఇన్‌చార్జిగా వ్యవహరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి అసమ్మతి నేతలను అతి కష్టంమీద బుజ్జగించడం, మైనార్టీ ఓటు బ్యాంకింగ్‌తో టీఆర్‌ఎస్ గెలిచింది.
- బాగ్ అంబర్‌పేట డివిజన్‌లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డిపై అసమ్మతి సెగతో పాటు కాలనీల్లో బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉంది. వరద సాయంలో అవకతవకలూ బీజేపీ అభ్యర్థి పద్మావెంకట్‌రెడ్డికి కలిసివచ్చాయి. టీఆర్‌ఎస్ ఓటమి పాలైంది.
మూడు సిట్టింగ్ స్థానాలు స్వాహా..
అబిడ్స్: గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో సాధించిన మూడు డివిజన్లను బీజేపీ దక్కించుకుంది. జాంబాగ్, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్, గోషామహల్, మంగళ్‌హాట్ డివిజన్లలో బీజేపీ విజయం సాధించగా దత్తాత్రేయనగర్ డివిజన్‌లో మాత్రం మజ్లిస్ విజయం సాధించింది. గత మూడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దత్తాత్రేయనగర్, జాంబాగ్‌లో మజ్లిస్ గెలుస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో జాంబాగ్‌ను బీజేపీ గెలుచుకుంది. దీంతో టీఆర్‌ఎస్ మూడు సీట్లతో పాటు మజ్లిస్ ఒక్క సీటును బీజేపీ కైవసం చేసుకుంది.
అలా కలిసొచ్చి.. ఇలా వెనకబడి..
సనత్‌నగర్: సనత్‌నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ మరోసారి విజయదుందుభి మోగించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చొరవతో పాటు ఇక్కడ మంచినీటి రిజర్వాయర్, ఇండోర్ స్టేడియం, వైకుంఠధామం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తికావడంతో పాటు అభివృద్ధే కారణంగా చెప్పాలి.
- అమీర్‌పేటలో ఇక్కడ టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ శేషుకుమారి ఓటమి చవిచూశారు. ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ టికెట్ ఆశించడంతో పాటు శేషుకుమారి అభ్యర్ధిత్వంపై బాహాటంగానే వ్యతిరేకించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు ఆమెకు పనిచేయకుండా ఓటమికి కారణమయ్యారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేసిన కేతినేని సరళకు ఉత్తర భారతీయుల ఓటింగ్ కలిసొచ్చింది.
- బన్సీలాల్‌పేటలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ హేమలత విజయానికి ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల కారణంగా చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థి స్పందన గట్టి పోటీ ఇచ్చినా ఆర్థిక, అంగబలం అంతగా లేకపోవడంతో ఓటమి పాలైనట్లు తెలుస్తోంది.
- రాంగోపాల్‌పేట డివిజన్ టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ అరుణగౌడ్ ఓటమికి స్థానికంగా కొంత బయటపడని వ్యతిరేకత. బీజేపీ అభ్యర్ధి సుచిత్ర గెలుపు వెనుక ఆ పార్టీ వేవ్‌తో పాటు స్థానికంగా సత్సంబంధాలు మెరుగ్గా ఉండడం, నార్త్ ఇండియన్ ఓట్లు శాతం ఎక్కువగా ఉండడం.
- బేగంపేట డివిజన్ నుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి టి.మహేశ్వరికి గతంలో కార్పొరేటర్‌గా చేసిన అనుభవం, ప్రభుత్వ సంక్షేమ పథకాలూ కలిసొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment