కమలానికి ఊపు... కారుకు కుదుపు.. పతంగి మెరుపు.. చేతికి షాకు.. గ్రేటర్ ఓటరు విలక్షణ తీర్పు వెలువరించాడు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ దక్కలేదు. మేయర్ సీటు రేసులో ఎవరికీ స్పష్టత ఇవ్వలేదు. ఊహించని ఫలితాలు.. ఎదురు దెబ్బలతో సిట్టింగ్‌లు గల్లంతయ్యారు. పెద్ద పార్టీల అభ్యర్థులకూ డిపాజిట్ దక్కక అవాక్కయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బకాగా... మరి కొందరు ఊరట చెందారు. 55 సీట్లతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ మేయర్ పీఠానికి కొద్ది దూరంలో నిలిచింది. 48 సీట్లతో బీజేపీప్రధాన ప్రతిపక్షమైంది. 44 సీట్లతో ఎంఐఎం మేయర్ ఎన్నికలో కీలకంగా మారింది. మొత్తంగా గ్రేటర్–2020 ఎన్నికలసమరం రసవత్తరంగా ముగిసింది. మేయర్ పీఠంపై సస్పెన్స్‌ను మిగిల్చింది.
సాక్షి, హైదరాబాద్ : బల్దియా ఫలితాలు నగర మంత్రులకు షాక్‌నిచ్చాయి. మంత్రులు సబిత, మహమూద్ అలీ, తలసానికి ఈ ఎన్నికలు అసంతృప్తినివ్వగా... కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆనందాన్ని కలిగించాయి. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి తన పరిధిలోని రెండు డివిజన్లలోను అభ్యర్థులు ఓటమి పాలుకావడం నిరాశను మిగిల్చింది. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన నియోజకవర్గంలో సగం సీట్లతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. రాజేంద్రనగర్ సెగ్మెంట్‌లో ఇన్‌చార్జిగా వ్యవహరించిన హోంమంత్రి మహమూద్ అలీ కూడా బల్దియా సమరంలో చతికిలపడ్డారు. మొత్తం ఐదు డివిజన్లలోనూ ప్రత్యర్థి పార్టీలే విజయం సాధించడం ఆయనకు ఆవేదన మిగిల్చింది. ఇక మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, గంగుల, నిరంజన్‌రెడ్డి, ఈటల ప్రచారం చేసిన డివిజన్లలో గులాబీకి చుక్కెదురైంది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించిన మంత్రి హరీశ్‌రావు.. ఈ మూడింటి గెలుపుతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. కాగా, సీఎం తనయ, ఎమ్మెల్సీ కవిత ఇన్‌చార్జిగా వ్యవహరించిన గాంధీనగర్‌లో కారుకు పరాభవమే మిగిలింది. దీంతో గ్రేటర్ ఫలితాలు మంత్రులకు షాకింగ్‌కు గురిచేశాయి.
ఎల్బీనగర్‌లో అత్యధిక సీట్లు
అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఎల్బీనగర్ నియోజకవర్గం కమలం ధాటికి చెల్లా చెదురైంది. ఇక్కడ 11 డివిజన్లు ఉండగా, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో రెండు డివిజన్లు ఉన్నాయి. ఈ 13 డివిజన్లను బీజేపీ అభ్యర్థులే గెలుచుకోవడం విశేషం. ఇటీవల కురిసిన వర్షాలకు సరూర్‌నగర్, బీఎన్‌రెడ్డి, వనస్థలిపురం, నాగోల్, హస్తినాపురం డివిజన్లలో అనేక కాలనీలు నీటమునిగాయి. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వదర సహాయం అర్హులకు అందజేయకుండా కార్పొరేటర్లు, వారి బంధువులు, కార్యకర్తలు పంచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఎల్‌ఆర్‌ఎస్, రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయాలు ఇక్కడి ఓటర్లలో వ్యతిరేకతను పెంచాయి.
వారసులకు దక్కని యోగం
గ్రేటర్ ఎన్నికల్లో పలువురు అగ్ర నాయకుల వారసులుగా రంగంలోకి దిగిన వారిలో కొందరు గెలుపొందగా మరికొందరు ఓటమి పాలయ్యారు. వీరిలో రెండో సారి పోటీచేసిన వారిలో ఎక్కువ మంది మరోసారి గెలుపొందగా తొలిసారి పోటీచేసిన వారిలో ఎక్కువ మంది ఓటమిపాలవడం విశేషం.
ఓడినవారిలో..
మాజీ మంత్రి, దివంగత నేత నాయని నర్సింహారెడ్డి వారసుడిగా రాంనగర్ డివిజన్ నుంచి తొలిసారి బరిలోకి దిగిన ఆయన అల్లుడు శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గాజుల రామారం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హబ్సిగూడ డివిజన్ నుంచి పోటీచేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సతీమణి స్వప్నకు విజయం దక్కలేదు. సీనియర్ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత కూడా కవాడి గూడ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు పద్మ గాంధీనగర్ డివిజన్‌లో పోటీ చేసి గెలవలేకపోయారు. బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కుమారుడు బద్ధం మహిపాల్ రెడ్డి బంజారాహిల్స్ బీజేపీ ఆభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment