సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో కమలం వికసించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. టీఆర్‌ఎస్ కారు స్పీడును నిలువరించింది. 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఎగబాకింది. దుబ్బాక విజయం ఇచ్చిన స్ఫూర్తితో గ్రేటర్‌లోనూ హవా కొనసాగించింది. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీలో రెండో స్థానంలో ఉన్న ఎంఐఎంను వెనక్కితోసింది. కాంగ్రెస్‌ను 4వ స్థానంలోకి నెట్టి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేననే సంకేతాలను పంపింది. దుబ్బాక కిక్కుకు తోడు జీహెచ్ ఎంసీ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్తు ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని కమల నాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపుతో టార్గెట్ 2023 (అసెంబ్లీ ఎన్నికలే) లక్ష్యంగా తమ కార్యా చరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. (బీజేపీ ఆధిక్యం.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్)
ఫలించిన వ్యూహం.. ప్రత్యేక కార్యాచరణ
బీజేపీ అనుసరించిన వ్యూహం, ప్రత్యేక కార్యాచరణ ఫలితాలను ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని నియమించి బాధ్యతలను అప్పగించి పనిచేయించింది. వారికి అదనంగా 26 కమిటీలు, పార్టీ శ్రేణులు బీజేపీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశాయి. రోడ్‌షోలు, బస్సుయాత్రలతో ప్రచారం నిర్వహించారు.
పనిచేసిన భూపేంద్రజాలం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేను విజయ తీరాలకు చేర్చిన భూపేంద్ర యాదవ్‌ను జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్‌చార్జిగా పంపించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితర నేతల ప్రచారానికితోడు పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్, దేవేంద్ర ఫడ్నవీస్ వంటి నేతల ప్రచారం బీజేపీకి మేలు చేసిందని పార్టీ వర్గాలు భావిస్తు న్నాయి. పార్టీ ముఖ్య నేతలు ప్రచారంలో మాట్లాడాల్సిన అంశాలను కూడా భూపేంద్రయాదవ్ సూచనల మేరకు రూపొందించి అమలు చేయడం కలిసొచ్చింది.
కుల సమీకరణలు తోడుగా..
వివిధ కుల, విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశాలు కూడా బీజేపీ అభ్యర్థుల గెలుపునకు దోహద పడ్డాయి. మాజీమంత్రి డీకే అరుణను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడం ద్వారా ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. బీసీ సామాజిక వర్గాల్లో గౌడ్, యాదవ, మున్నూరుకాపులతోపాటు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకుని పనిచేయడం కలిసివచ్చింది. టీఆర్‌ఎస్ ఎంఐఎం మధ్య అవగాహన ఉందని యువత మెదళ్లలోకి ఎక్కించడంలో బండి సంజయ్ సఫలమయ్యారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, అక్ర మంగా వలస వచ్చిన వారిని, రోహింగ్యాలను ఏరివేస్తా మని చెప్పడం వారిని బీజేపీ వైపు మళ్లించింది.
ఇక ఆపరేషన్ అసెంబ్లీనే..
ఓవైపు దుబ్బాక విజయం.. మరోవైపు జీహెచ్‌ఎంసీలో అత్యధిక స్థానాలు గెలుపొందడంతో బీజేపీ ఆనందంలో మునిగింది. ఈ విజయాలే సోపానాలుగా, ఈ ఎన్నికల్లో పని చేసిన తీరునే స్ఫూర్తిగా ముందుకుసాగాలని నిర్ణయించింది. రాష్ట్ర పార్టీ నేతలంతా ఇదే ఐక్యతతో మరో మూడేళ్లలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయాలని నిర్ణయించారు. తద్వారా పార్టీని అధికారంలోకి తేవచ్చన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికల అమలును వేగవంతం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గణనీయ సంఖ్యలో గెలుపొందటంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. నాలుగు స్థానాల నుంచి 48 స్థానాల వరకు పార్టీని తీసుకెళ్లడం పట్ల పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వానికి అనుకూల నినాదాలు చేశారు. అనంతరం సంజయ్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు కిషన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు తదితరులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ బండి సంజయ్‌కి స్వీటు తినిపించి సంబురాలు జరుపుకున్నారు.
ఉపయోగపడిన టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత
ఆరేళ్లలో హైదరా బాద్ అభి వృద్ధి విషయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యా లను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో టీఆర్‌ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చింది. బ్యాలెట్ ఓట్లు 83 డివిజన్లలో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రావడమే ఇందుకు నిదర్శనం. వరదసాయం పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో బీజేపీ సక్సెస్ అయింది. అలాగే సోషల్ మీడియాలో కూడా బీజేపీ వ్యతిరేకప్రచారాన్ని బలంగా తిప్పికొట్టగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment