సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌గా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. జీహెచ్‌ఎంసీలో ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం లేకపోవడంతో టీఆర్‌ఎస్, బీజేపీలు బరిలో నిలవగా రెండు పదవులు కూడా గులాబీనే వరించాయి. బుధవారం ఎంఐఎం కూడా విప్‌ను నియమించడంతో పోటీలో ఉంటుందని భావించినా.. ఎంఐఎం నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులకూ ఎంఐఎం సభ్యులు టీఆర్‌ఎస్‌కే ఓట్లు వేశారు. చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలైనందున ఎంఐఎం వైఖరి ఎలా ఉంటుందోనని పలువురు భావించినా.. ఎంఐఎం సైతం టీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడంతో గత పాలకమండళ్ల తరహాలోనే ఈసారి కూడా టీఆర్‌ఎస్, ఎంఐఎం సఖ్యతతోనే పనిచేయగలవని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లోనే వరిస్తుందనుకున్నా..
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ అయిన విజయలక్ష్మిని గత ఎన్నికల్లోనే మేయర్ పదవి వరిస్తుందని భావించినా.. అప్పట్లో ఆమెకు టికెట్ లభించలేదు. విజయలక్ష్మి ఉన్నత విద్యావంతురాలు, విదేశాల్లో ఉండి వచ్చారు. కాగా, టీఆర్‌ఎస్ తొలినాళ్ల నుంచి పనిచేస్తున్న మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతను మేయర్ పదవి వరించనుందని ప్రచారం జరిగినా.. ఆమెకు డిప్యూటీ మేయర్ అవకాశం కల్పించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ మహిళలే కావడం విశేషం. డిప్యూటీ మేయర్‌గా మైనార్టీ వర్గాలకు టీఆర్‌ఎస్ అవకాశం కల్పిస్తుందని తొలుత భావించినా అలా జరగలేదు.
ఐదో మహిళా మేయర్..
గద్వాల విజయలక్ష్మి బల్దియాకు 26వ మేయర్ కాగా, ఐదో మహిళా మేయర్. చివరి వరకు పలు ఊహగానాలు, ఉత్కంఠ నెలకొన్నా.. ఎన్నికల ప్రక్రియ మొత్తం 20 నిమిషాల్లోనే ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మొహంతి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియా పరిశీలకులుగా వ్యవహరించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ముందు ఉదయం 11 గంటలకు కొత్తగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ భాషల వారీగా గ్రూపులుగా విడదీసి అందరినీ ఒకేసారి ప్రమాణం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ప్రక్రియ ఇలా సాగింది..
ఎన్నిక ప్రారంభం కాగానే ఎంఐఎం ఓటు వేస్తుందా లేదా తటస్థంగా ఉంటుందా అన్న ఉత్కంఠ సభలో నెలకొంది. అయితే ఎంఐఎం సభ్యులంతా టీఆర్‌ఎస్ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేశారు. దీంతో బీజేపీ సభ్యులు సభలో కొద్దిసేపు గొడవ చేశారు. టీఆర్‌ఎస్ సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు సహ మొత్తం బలం 88 మంది ఉన్నా.. ఎన్నికయ్యేందుకు వారంతా అవసరం లేకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలందరూ హాజరు కాలేదు. వారి ఎక్స్‌అఫీషియో ఓట్లను ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున వాటిని ఇక్కడ వినియోగించుకోలేదని టీఆర్‌ఎస్ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మాత్రమే ఉండటంతో, వారు ఎవరికీ ఓట్లు వేయొద్దని నిర్ణయించుకుని ఎన్నిక ప్రక్రియలో పాలు పంచుకోలేదు. ప్రమాణ స్వీకారం చేయగానే వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment