జీహెచ్‌ఎంసీ మేయర్ ఎంపికలో ‘మజ్లిస్’ పాత్ర కీలకంగా మారింది. దాదాపు 30 శాతం సీట్లు దక్కించుకున్నఎంఐఎం మద్దతుపైనే మేయర్ ఎన్నిక ఆధారపడి ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.‘మేం ఎవ్వరి దగ్గరకు వెళ్లం.. మా దగ్గరికే వాళ్లు రావాలి’ అన్న రీతిలో ఆ పార్టీ అధినేత వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల దృష్ట్యా ‘తాము కారెక్కడం కంటే తమ బండి ఎక్కితే హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తాం’ అని మీడియా సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మరో వైపు లోపాయికారీ ఒప్పందంతో టీఆర్‌ఎస్‌తో కలిసి పోయే అవకాశాలు కూడా లేకపోలేదు.
సాక్షి, సిటీబ్యూరో : మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన ఎంఐఎంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునేది అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ‘పార్టీలో చర్చించి మేయర్ పీఠంపై నిర్ణయం తీసుకుంటాం’ అని సాక్ష్యాత్తు ఆయనే పేర్కొనడం కాస్త విస్మయం గొలుపుతోంది. చివరి వరకు విషయాన్ని సాగదీయాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో చర్చిస్తామని చెప్పుకొచ్చారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. (కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!)
ఆరేళ్ల బంధం..
గత ఆరేళ్లుగా అధికార టీఆర్‌ఎస్–మజ్లిస్ మధ్య దోస్తీ కొనసాగుతున్నప్పటికి ప్రతి ఎన్నికల్లో స్నేహ పూర్వక పోటీ పేరుతో ఎవరికి వారు ఒంటరిగా బరిలో దిగుతూ వచ్చారు. ఈసారి కూడా ఎవరికి వారే పోటీకి దిగగా.. టీఆర్‌ఎస్ ఒక అడుగు ముందుకు వేసి మజ్లిస్‌తో దోస్తీ గీస్తీ లేదని, గత పర్యాయం ఐదు సీట్లలో ఓడగొట్టాం.. ఈ సారి పది డివిజన్లలో ఓడిస్తామని చెప్పింది. దానికి మజ్లిస్ ఘాటుగానే స్పందించింది. పరస్పర విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరడంతో ఆరేళ్ల బంధం కాస్త బెడిసినట్టయింది. ఈ నేపథ్యంలో తిరిగి దోస్తీ కోసం ఒకరికి ఒకరు సంప్రదించుకునేందుకు సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. (కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు)
సంఖ్యా బలంపై ధీమా
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పక్షాన 44 మంది అభ్యర్థులు విజయం సాధించగా, మరో పది మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దీంతో బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54కి చేరింది. అయితే మేయర్ పీఠం సాధించేందుకు ఈ బలం సరిపోదు. అందువల్ల టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడమా..? లేక టీఆర్‌ఎస్ సహకారం తీసుకోవడమా? అనే రెండు మార్గాలు మాత్రమే మజ్లిస్ ముందు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మాదిరిగా పాలనలో భాగస్వాములై రెండున్నరేళ్లు మేయర్ పదవి చేపట్టడమా... లేక బేషరతుగా మద్దతిచ్చి డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టడమా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వెంటనే నిర్ణయం వెలువరించకుండా... వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (వాళ్లడిగితే.. ఆలోచిస్తాం)
దారుస్సలాంలో సందడి
మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం సందడిగా మారింది. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో వేర్వేరుగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమయ్యారు. మేయర్ పీఠం అంశం పెద్దగా చర్చించనప్పటికీ ‘అధికారం ముఖ్యం కాదు.. ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి. సమస్యలు పరిష్కరించి వారిని సంతృప్తిపర్చాలి’ అని ఆయన ఉద్బోధించారు. 51 స్థానాలకు గాను 44 డివిజన్లలో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment