మాటల యుద్ధమే చేటు తెచ్చిందా?  | GHMC Elections 2020: MIM Traditional Votes Damaged TRS | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కారుకు దక్కని ఆదరణ

Published Mon, Dec 7 2020 8:45 AM | Last Updated on Mon, Dec 7 2020 8:45 AM

GHMC Elections 2020: MIM Traditional Votes Damaged TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ ఎన్నికల బరిలో లేని డివిజన్లలో సంప్రదాయ ఓటు బ్యాంక్‌ సైలెంట్‌గా టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసింది. మజ్లిస్‌పై మాటల దూకుడు కారుకు చేటు తెచ్చి పెట్టినట్లయింది. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలు కమలనాథుల వశం కావడంతో పాతబస్తీలో కారు అడ్రస్‌ గల్లంతైంది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం మజ్లిస్‌ సంప్రదాయ ఓట్ల ప్రభావం టీఆర్‌ఎస్‌పై పడింది. ముస్లిం గళంగా మారి పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న ఎంఐఎం పార్టీ నగరంలోని ముస్లిం ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం సంప్రదాయ ఓటు బ్యాంక్‌ కలిగి ఉంది. గత ఆరేళ్లుగా అధికార టీఆర్‌ఎస్‌తో దోస్తానా కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి పొత్తులు, సీట్ల సర్దుబాటు లేకుండా స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో ఒంటరిగా దిగుతూ వస్తోంది. మజ్లిస్‌ బరిలో లేనిప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను బలపర్చడమే కాకుండా ఏకంగా ఓటు వేసి గెలిపించాలంటూ పార్టీ సంప్రదాయ ఓటర్లకు విజ్ఞప్తి  చేయడం ఆనవాయితీగా మారింది. కానీ.. జీహెచ్‌ఎసీం ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌– మజ్లిస్‌ మధ్య మాటల యుద్ధం దోస్తీ కటీఫ్‌కు దారితీసి ఫలితాలపై ప్రభావం చూపినట్లయింది. 

ప్రాతినిధ్య సెగ్మెంట్లలో సైతం.. 
అసెంబ్లీ ప్రాతినిధ్యం గల సెగ్మెంట్లల్లోని కొన్ని డివిజన్‌లలో సైతం లోపాయికారీ ఒప్పందం కారణంగా ఎన్నికల బరికి దూరం ఉంటూ అధికార పక్షానికి సహకరిస్తూ రావడం మజ్లిస్‌ పార్టీ ఆనవాయితీ. మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని సైదాబాద్, మూసారంబాగ్, యాకుత్‌పురాలోని ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ల్లో మజ్లిస్‌ పార్టీ ఎన్నికల బరిలో దిగని కారణంగా టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చేది. అధిష్టానం ఆదేశాల మేరకు మజ్లిస్‌ కేడర్‌ కూడా బాహాటంగా టీఆర్‌ఎస్‌కు సహకరిస్తూ వచ్చేది. తాజా పరిణామాల దృష్ట్యా మజ్లిస్‌ కేడర్‌ టీఆర్‌ఎస్‌కు దూరం పాటించింది. మజ్లిస్‌  సంప్రదాయ ఓటర్లు కూడా మొగ్గుచూపకపోవడంతో మూడు సిట్టింగ్‌ స్థానాలు కమలం ఖాతాలో చేరడం టీఆర్‌ఎస్‌కు మింగుపడటంలేదు. 
 
కొంత పట్టున్న డివిజన్లల్లో.. 
మజ్లిస్‌ పార్టీకి జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్‌ ముషీరాబాద్, అంబర్‌పేట, ఎల్‌బీనగర్,  సికింద్రాబాద్, పటాన్‌చెరూ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సైతం కొంత వరకు సంప్రదాయ ఓటుబ్యాంక్‌ ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ముషీరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి రెండు చొప్పున మాత్రమే బరిలో దిగిన మజ్లిస్‌ తమ సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను పదిలపర్చుకోగా, మిగతా డివిజన్ల విషయంలో అధికార పక్షంతో  మైత్రి తెగిన కారణగా పార్టీ కేడర్‌కు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆయా డివిజన్లలోని పార్టీ కేడర్‌ కూడా దూరం పాటించడంతో టీఆర్‌ఎస్‌కు నష్టం వాటిల్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement