సికింద్రాబాద్: బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు సయోధ్య కుదుర్చుకుని.. తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నాయని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ.కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీతాఫల్‌మండిలో శనివారం సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ బూత్‌కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని సీఎంతోపాటు బీఆర్‌ఎస్ నాయకులు చెప్పుకుంటున్న గొప్పల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
కేవలం ఐటీ సంస్థలున్న ప్రాంతాలు మాత్రమే భాగ్యనగరం కాదని, సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాల్లోని సమస్యలు ఆయా ప్రాంతాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని కంటోన్మెంట్ సివిల్ ఏరియాలను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభమైందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల అభిప్రాయం సేకరించేందుకు కమిటీలు వేశామన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారని చెప్పారు. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డులున్న అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించాక.. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో కొనసాగుతున్న సివిల్ ఏరియాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే బిల్లును రూపొందించి పార్లమెంట్‌లో ఆమోదిస్తామన్నారు. అప్పటి వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి ఎన్నికలు జరిగే అవకాశం లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment