సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు ఖాయమైంది కాబట్టే కమ్యూనిస్టులకు కేసీఆర్ పంగనామాలు పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘మునుగోడులో కమ్యూనిస్టులతో కలిసిన సందర్భంలో వారితో పొత్తు పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
కానీ ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన కేసీఆర్ అమిత్‌షాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకే కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారు’అని చెప్పారు. బుధవారం గాం«దీభవన్‌లో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, బీజేపీతో ఒప్పందం మేరకే కమ్యూనిస్టుల కు సీట్లు ఇవ్వకుండా ఏకపక్షంగా కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారని అన్నారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన చంద్రశేఖర్ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషకరమని, ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పారు.
సాగర్ కట్టమీద చర్చిద్దాం వస్తారా?
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని బీఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, చరిత్ర తిరిగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో బీఆర్‌ఎస్ నేతలకు అర్థమవుతుందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్ట మీద కూర్చుని చర్చిద్దాం వస్తారా? అని బీఆర్‌ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్ 7,500 కోట్లకు తెగనమ్ముకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షకోట్లు మింగాడని, కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేద ప్రజల ఓట్లను దండుకునేందుకు వారిని కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిన చోట తాము ఓట్లు అడగబోమని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట్ల బీఆర్‌ఎస్ ఓట్లు అడగకుండా ఉంటారా అని రేవంత్ సవాల్ విసిరారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ అయిందని విమర్శించారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెచ్చిన తర్వాతే కేసీఆర్ అక్కడ పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, రూ.5 లక్షల వరకు పేదల వైద్య ఖర్చులను ఆరోగ్యశ్రీ ద్వారా భరిస్తామని, రూ.500కే గ్యాస్ సిలెండర్ ఇస్తామని, ప్రతి పేద వ్యక్తి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం అందిస్తామని పునరుద్ఘాటించారు. ఈనెల 26న చేవెళ్లలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment