సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఓవైపు మోదీ.. మరోవైపు కేడీ కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని.. కేసీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేల కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.
నిజాం, రజాకార్ల కంటే దారుణంగా కేసీఆర్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ ఆస్తులు పోగొట్టుకుని, ప్రాణాలకు తెగించి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా.. ఈసారి ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచీ గట్టిగా పనిచేసి పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణంలో మండల అధ్యక్షుల పాత్ర కీలకమని, పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలిచేలా కృషి చేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే పిలుపునిచ్చారు.
తొమ్మిదిన్నరేళ్లుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులకు గురయ్యారని.. ఈసారి బీఆర్‌ఎస్‌ను గద్దెదించాల్సిందేనని టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, దామోదర రాజనర్సింహ, అంజన్‌కుమార్, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment