
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ ఎవరి సొత్తు కాదని.. అక్కడ బీజేపీ పాగా వేయబోతుందని తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ మేయర్ పీఠం.. మజ్లిస్ సపోర్ట్‌తోనే టీఆర్‌ఎస్ దక్కించుకుందన్నారు. ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. (చదవండి: సారు, కారు.. పదహారు అన్నది ఎవరు?)
రేపు (ఆదివారం) బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. ఆయన ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని, అక్కడి నుండి నేరుగా భాగ్యలక్షి అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుండి వారసిగూడా వెళ్తారన్నారు. సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు రోడ్ షో ఉంటుందని పేర్కొన్నారు. అక్కడి నుండి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారన్నారని ఆయన తెలిపారు.(చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: గడప దాటి వచ్చేవారెందరు..?)