పార్టీలు కాదు.. ప్రైవేటు కంపెనీలు!  | PM Narendra Modi Fires On BRS And MIM At Palamuru Meeting | Sakshi
Sakshi News home page

పార్టీలు కాదు.. ప్రైవేటు కంపెనీలు! 

Published Mon, Oct 2 2023 3:59 AM | Last Updated on Mon, Oct 2 2023 3:59 AM

PM Narendra Modi Fires On BRS And MIM At Palamuru Meeting - Sakshi

కుటుంబ సభ్యులు ఓనర్లు..బయటివారు అటెండర్లు! 
తెలంగాణలోని రెండు కుటుంబ పాలిత పార్టీలది ఒకటే ఫార్ములా.. అవినీతి, కమీషన్లు..అంతా కుటుంబం కోసం, కుటుంబం ద్వారా, కుటుంబానికి చెందిన (పార్టీ బై ద ఫ్యామిలీ,ఫర్‌ ద ఫ్యామిలీ, టు ద ఫ్యామిలీ) అన్నట్టుగా ఆ పార్టీల తీరు ఉంది. అవి పార్టీలు కాదు.. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలుగా నడిపిస్తున్నారు. వాటిలో ప్రెసిడెంట్లు, సీఈవోలు, డైరెక్టర్, జనరల్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్లు, అంతా కుటుంబ సభ్యులే. సహాయకులుగా ఉండే అటెండర్లు, సపోర్ట్‌ స్టాఫ్‌గానే బయటి వ్యక్తులు ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు చరమగీతం పాడి.. బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉంది. 

ఢిల్లీలో ఓ అన్న ఉన్నాడు..
తెలంగాణ రాణీ రుద్రమ వంటి వీరవనితలు పుట్టిన భూమి. ఇటీవల ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో చట్టసభల్లో మహిళల గొంతు మరింతగా వినిపించబోతోంది. మహిళలు మోదీ చేతులను బలోపేతం చేస్తే.. మోదీ మహిళా శక్తిని బలోపేతం చేస్తున్నాడు.. తెలంగాణలోని అక్కాచెల్లెళ్లకు ఢిల్లీలో ఒక అన్న (మోదీ) ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. మహిళల కోసం ఆత్మ గౌరవ గృహాలు, ముద్రా యోజన, పీఎం ఆవాస్‌ యోజన, ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు వంటివి తెచ్చి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చాం. 

మహబూబ్‌నగర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అభివృద్ధి జరగకుండా రెండు కుటుంబ పాలిత పార్టీలు అడ్డుకుంటున్నాయని.. అవి ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మా ర్చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వాటికి ప్రజల సంక్షేమం కంటే కుటుంబ ప్రయోజనాలే ప్రధానంగా మారిపోయాయని మండిపడ్డా రు. తెలంగాణ సర్కార్‌ కారు స్టీరింగ్‌ మరొకరి చే తుల్లో ఉందని.. దీనిని బట్టి ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరివార వాద పార్టీలకు చరమగీతం పాడాలని.. ప్రజల జీవితాలను ఎలా మెరుగుపర్చాలి, ఎలా అభివృద్ధి చేయాలని నిరంతరం ఆలోచించే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదివారం పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం చేసిన సాయం, పథకాలను ప్రస్తావిస్తూనే.. బీఆర్‌ఎస్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. సభలో మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు కేవలం అవినీతి, అక్రమాల కోసమే. ఇటీవల ప్రాజెక్టులకు ప్రారం¿ోత్సవాల పేరిట ఆర్భాటాలు, హంగామా చేశారు. కానీ వాటిలోంచి రైతులకు నీళ్లు మాత్రం రాలేదు. ఇలా ప్రాజెక్టుల పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారు. రైతు పథకాలను కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తప్పుడు హామీలతో మోసం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. ఎందరో రైతుల మరణానికి కారణం అయ్యారు. 

పసుపు బోర్డు, గిరిజన వర్సిటీతో ఎంతో మేలు 
కేంద్రం ఇప్పటిదాకా తెలంగాణలో అమలుచేసిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇప్పుడు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, ఇతర ప్రాజెక్టులతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ములుగులో రూ.900 కోట్లతో సమ్మక్క–సారలమ్మ కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.

నిజానికి మేం గిరిజన వర్సిటీని ఐదేళ్ల కిందటే నెలకొల్పాలని ప్రయత్నిస్తే.. రాష్ట్రంలోని అవినీతి ప్రభుత్వం దానికి భూమి ఇచ్చేందుకు ఐదేళ్లు పట్టింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోంది. మేం పసుపు రైతుల కష్టాలను గుర్తించి, వారిని ఆదుకోవడానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే సుగంధ ద్రవ్యాల బోర్డు ఉండగా.. ప్రత్యేకంగా పసుపు కోసం నేషనల్‌ టర్మరిక్‌ బోర్డు ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు, రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. ఎగుమతులకు వాల్యూ అడిషన్‌గా పనికొస్తుంది. 

రూ.27వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం 
కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాన్ని గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేస్తోంది. 2014లో కాంగ్రెస్‌ హయాంలో రూ.3,400 కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తే.. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాదిలోనే రూ.27 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. అన్నదాతలకు గౌరవం కల్పించాం. రాష్ట్రంలో మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రైతుల కోసం తెరిచాం. ఇప్పుడు రూ.13,500 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఈ సభకు వచ్చిన వారిని ఉత్సాహాన్ని చూస్తుంటే ఇక్కడి ప్రభుత్వానికి నిద్ర పట్టదు. 

తెలంగాణ అభివృద్ధికి తోడుగా.. 
బీజేపీ తెలంగాణ ప్రజల జీవితాలను మరింత ఉజ్వలం చేసేందుకు, అభివృద్ధి మార్గాన నడిపించేందుకు కంకణబద్ధమై ఉంది. 2014 నాటికి తెలంగాణలో రూ.2,500 కిలోమీటర్ల పొడవున మాత్రమే జాతీయ రహదారులు ఉంటే.. మేం వచ్చాక తొమ్మిదేళ్లలో వాటిని రెండింతలు చేశాం. వీటివల్ల చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల దాకా రవాణా స దుపాయాలు పెరిగి.. ఉద్యోగులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణకు చెందిన బిద్రీ ఆర్ట్‌ (కళంకారీ)కు సంబంధించిన వస్తువును ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కానుకగా ఇచ్చాను. దాంతో అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. 

మోదీ గ్యారంటీలపై భరోసా
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో మహిళలు, రైతులు, ఇతర వర్గాల ప్రజల్లో మోదీ గ్యారంటీలపై భరోసా కనిపిస్తోంది. మోదీ ఏదైనా గ్యారంటీ ఇస్తే దానిని కచ్చితంగా చేసి తీరుతారని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత, నిజాయతీతో కూడిన పారదర్శక ప్రభుత్వం కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది.

ఈ సభకు హాజరైన ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే.. తెలంగాణ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనే సంకల్పంతో ఉన్నట్టు స్ప ష్టం అవుతోంది. తెలంగాణలో మార్పు కచ్చితం. అది బీజేపీతో మాత్రమే సాధ్యం. గత నాలుగేళ్లలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నా..’’అని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. 

1.30కి రాక.. 5.30కి తిరుగు ప్రయాణం 
శంషాబాద్‌: ప్రధాని మోదీ పాలమూరు పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి తల సాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్‌ తదితరులు స్వాగతం పలికారు. తర్వాత ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణం అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement