గుజరాత్‌కో నీతి.. తెలంగాణకో నీతా?:కేటీఆర్‌ | KTR Fires On PM Modi And Congress Party Leaders | Sakshi
Sakshi News home page

గుజరాత్‌కో నీతి.. తెలంగాణకో నీతా?..బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే, ఢిల్లీ జుట్టు మన చేతిలో... 

Published Mon, Oct 2 2023 4:22 AM | Last Updated on Mon, Oct 2 2023 7:56 AM

KTR Fires On PM Modi And Congress Party Leaders - Sakshi

సాక్షి,పెద్దపల్లి/గోదావరిఖని/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘నీ ఉద్దేశం మంచిదే అయితే.. నీకు నియ్యత్‌ ఉంటే గుజరాత్‌కో నీతి.. తెలంగాణకో నీతి ఉంటదా? నువ్వు గుజరాత్‌ ప్రధానివా? దేశానికి ప్రధానివా?’అని మోదీని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. అలాగే 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఐటీ, ఇండ్రస్టియల్‌ పార్కుల ఏర్పాటు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మంచిర్యాల జిల్లాలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామగుండం, పెద్దపల్లి, రామకృష్ణాపూర్‌లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేటీఆర్‌ ప్రసంగించారు.
 
సింగరేణికి గనులు ఇవ్వలేదేం? 
రామగుండం, పెద్దపల్లి సభల్లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ‘ఏం ముఖం పెట్టుకొని ప్రధాని రాష్ట్రానికి వస్తున్నడు? ఇటీవల రామగుండం వచ్చిన మోదీ సింగరేణిని ప్రైవేటీకరించబోమని తియ్యని మాటలు చెప్పారు. కానీ ఆ తర్వాత నెల రోజులకే సింగరేణి బొగ్గు బ్లాకులను వేలానికి పెట్టారు’అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వేలంలో పాల్గొని బొగ్గు బ్లాకులు దక్కించుకోవాలని మోదీ ఉచిత సలహా ఇచ్చారని పేర్కొన్నారు.

ప్రధానికి సింగరేణిపై ప్రేమ ఉంటే గుజరాత్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బొగ్గు గనులు ఎలా రాసిచ్చారో.. అదే పద్ధతిని సింగరేణికి ఎందుకు పాటించలేదని నిలదీశారు. ‘నాకు తెలుసు నీ కుట్ర.. ఏ ప్రభుత్వరంగ సంస్థ అయినా మంచిగ నడిస్తే.. దానిని నష్టాల్లోకి నెట్టేయాలి. ఆ తర్వాత నష్టాల్లోకి వచ్చిన సంస్థగా ముద్రవేసి నీ దోస్తులకు కట్టబెట్టాలి. అడ్డికి పావుసేరుకు అమ్మి అందులో చందాలు తీసుకోవాలి. ఇలా స్కీంలు పెట్టి ఒక్కో ప్రభుత్వరంగ సంస్థను అమ్ముతున్నారన్నారు.

ఎయిర్‌ ఇండియా, రైల్వే, ఎల్‌ఐసీ.. ఇలా అనేక ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారు’అని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రికే ఉందన్నారు. మోదీ అంటే అమ్మకం, కేసీఆర్‌ అంటే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ‘ఎన్ని వేషాలు వేసినా, డైలాగులు కొట్టినా.. నిన్ను (మోదీ) ఎవరూ నమ్మరు. బీజేపీకి నూకలు చెల్లాయి. డిపాజిట్‌ కూడా రాదు’కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని... అందువల్ల ఎమ్మెల్యేలనే కాదు.. బీఆర్‌ఎస్‌ ఎంపీలనూ గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పుడు ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) జుట్టు మన చేతుల్లో ఉంటుందన్నారు. 

4 కోట్ల ప్రజలంతా కేసీఆర్‌ కుటుంబం... 
‘మాది కుటుంబ పార్టీ అని మోదీ అంటుండు. అవును.. మాది బరాబార్‌ కుటుంబ పార్టీయే. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలంతా కేసీఆర్‌ కుటుంబ సభ్యులే. 13 లక్షల మంది యువతులకు పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్‌. 46 లక్షల మంది వృద్ధులకు పింఛన్‌ ఇచ్చే పెద్ద కొడుకు కేసీఆర్‌.. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చి అండగా నిలిచిన పెద్దన్న కేసీఆర్‌.

ప్రతి కుటంబంలో కేసీఆర్‌ ఒక సభ్యుడు.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కేసీఆర్‌’అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌ గ్యారెంటీలను నమ్మొద్దు 
మంచిర్యాల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ 
‘వారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్మితే ఆగమవుడు గ్యారంటీ’అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్‌పల్లిలో రూ. 500 కోట్లతో నిర్మించే ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన కేటీఆర్‌... పట్టణంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు, రామకృష్ణాపూర్‌ పరిధిలోని గాంధారీ వనంలో ఎకో అర్బన్‌ పార్క్, ఓపెన్‌ జిమ్, వంతెనల వంటి మొత్తం రూ. 312 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొన్నారు. అనంతరం మందమర్రిలో రోడ్‌ షో చేపట్టారు.

అలాగే రామకృష్ణాపూర్‌ ఠాగూర్‌ స్టేడియంలో ఎమ్మెల్యే సుమన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఏడో విడత 304 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ చెప్పే ఆరు గ్యారెంటీలను నమ్మితే మళ్లీ 3 గంటల కరెంట్, రైతులు ఆగమవడం, ఏడాదికో సీఎం మారడం ఈ మూడు మాత్రం గ్యారంటీగా జరుగుతాయన్నారు. ‘బడే మియాతో బడే మియా చోటే మియా సుబానుల్లా అన్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ తీరు ఉంది.

రాష్ట్రానికి ప్రధాని మోదీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారు? దక్షణాదికి వెలుగులిస్తన్న సింగరేణిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. గని కార్మికులకు ఆర్మీ ఉద్యోగుల తరహాలో ఐటీ మినహాయింపు ఇవ్వమంటే ఉలుకు పలుకు లేదు’అని కేటీఆర్‌ విమర్శించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ప్రేమ ఉండదని... ఎన్నటికైనా గులాబీ జెండానే శ్రీరామ రక్ష అని పునరుద్ఘాటించారు. మూడోసారి ముచ్చటగా కేసీఆర్‌ను సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. 

మళ్లీ గెలిపిస్తే బాల్క సుమన్‌కు ప్రమోషన్‌... 
‘సుమన్‌ బాగా పని చేస్తున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో చెన్నూరులో అభివృద్ధి ఉంది. మళ్లీ గెలిపిస్తే సీఎం ప్రమోషన్‌ ఇస్తారు. త్వరలో రూ. 1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం, కొత్తగా రెవెన్యూ డివిజన్, ఆస్నాద్, పారుపల్లి మండలాలు ఏర్పాటు చేస్తాం’అని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మంత్రి పర్యటనలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు నారాదాసు లక్ష్మణరావు, పైడిపల్లి రవీందర్, టీబీజీకేఎస్‌ నేత కెంగర్ల మల్లన్న తదితరలు పాల్గొన్నారు.  

కేటీఆర్‌ను వీడని ‘రైల్వే గేటు’.. 
రామకృష్ణాపూర్, మంచిర్యాల మధ్య రైల్వే గేటు పడి స్థానికులు ఇబ్బంది పడుతున్నారని... నిధులు విడుదల చేసి ఆర్వోబీ పూర్తి చేసేలా చూడాలని సభలో బాల్క సుమన్‌ మంత్రి కేటీఆర్‌ను కోరారు. సభ అనంతరం ఆ మార్గంలోనే కేటీఆర్‌ కాన్వాయ్‌ ఎమ్మెల్యే సుమన్‌ ఇంటికి వెళ్తుండగా రైల్వే గేటు పడి వాహనాలు నిలిచిపోయాయి. 15 నిమిషాల తర్వాత రైలు వెళ్లాక గేటు తీయడంతో కాన్వాయ్‌ కదిలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement