సాక్షి, న్యూఢిల్లీ : ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం లోక్‌సభలో మాట్లాడిన ఒవైసీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్‌లో ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. అంతేకాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను.. యూటీలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు.
ఇదే బీజేపీ మార్క్ పాలన అని, కశ్మీర్ విభజనే దీనికి ఉదాహరణ అని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీకి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కాగా లోక్‌సభ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం ముగిసిన విషయం తెలిసిందే. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు సాధారణంగా రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడతలో పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, బడ్జెట్ ప్రవేశం పెట్టడం ఉంటాయి. రెండో విడతలో వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై సంబంధిత స్టాండింగ్ కమిటీల పరిశీలన ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు, సంబంధిత గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం వంటివి ఉంటాయి.
కాగా, మొదటి విడత బడ్జెట్ సమావేశాలు 100% ఫలప్రదంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. జనవరి 29వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్ణీత 50 గంటల్లో 49 గంటలపాటు సభ్యుల కార్యకలాపాలు కొనసాగాయన్నారు. 43 నిమిషాలపాటు మాత్రం అంతరాయం కలిగిందని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులు 13 ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారన్నారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్య అంశాలపై చర్చ కోసం అర్ధరాత్రి వరకు కొనసాగిన సందర్భాలున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment