![Minister Seethakka during the face to face nteraction program](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/sitakka.jpg.webp?itok=Q8IgW7Jr)
అన్ని వర్గాల లెక్కలు తేలాయి
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసమే ఒక్క రోజులో బీఆర్‌ఎస్ సర్వే
నరేంద్ర నుంచి రాజేందర్ వరకు బీసీలను వెళ్లగొట్టారు
మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ ఎక్కడా లెక్క తప్పలేదని, అన్ని సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా తేలాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ప్రస్తుత కులగణనలో లభించిన సమాచారం ఆధారంగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు తీసుకున్నారు.
ప్రజల విజ్ఞప్తులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడిన సీతక్క కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. మేక వన్నె పులిలా బీసీ, ఎస్సీల హక్కులను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేశారని, అదంతా కేవలం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసమేనని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు కులగణన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
ఆలె నరేంద్ర, ఈటల రాజేందర్ లాంటి బలమైన బీసీ నేతలను పార్టీ నుంచి వెళ్లగొట్టారన్నారు. తమ సర్వేను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు జరిగిన కులగణన ఎందుకు బయటపెట్టలేదో కేసీఆర్‌ను ప్రశ్నించలేదని అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం, ఇన్‌చార్జ్ భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని, ప్రతి మూడు నెలలకోసారి ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుందని సీతక్క చెప్పారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఆయన సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు.
అధికారులను వెళ్లి కలవండి
మంత్రితో ముఖాముఖిలో భాగంగా తమకు వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు చేరవేస్తామని, వాటి పరిష్కారానికి ప్రజలు స్థానిక అధికారులను సంప్రదించాలని సీతక్క చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
గ్రామాల రోడ్లు, హోంగార్డు ఉద్యోగాలు, పంట రుణాల మాఫీ, కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ షాపుల ఏర్పాటు, వడ్డీ వ్యాపారుల ఆగడాలు, ధరణి తదితర అంశాలపై ప్రజలు మంత్రి సీతక్కకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ.ఫహీం, మహిళా కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ నేత అల్లం భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment