శాటిలైట్ సర్వే ద్వారా సాగు విస్తీర్ణం వివరాల సేకరణ
గ్రామాలు, పంట రకాలు, సర్వే నంబర్లవారీగా అధ్యయనం
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడి
ఈ నెల 26నే ‘సాగు రైతుకే భరోసా’కథనంలో ఈ అంశాన్ని వెల్లడించిన ‘సాక్షి’
సాక్షి, హైదరాబాద్: పంటలు సాగుచేసిన భూమికే రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. ఇందుకోసం శాటిలైట్ సర్వే ద్వారా రిమోట్ సెన్సింగ్ డేటాను వినియోగించనున్నట్లు తెలిపారు. సర్వే నంబర్లవారీగా సాగులో ఉన్న భూమి విస్తీర్ణంతోపాటు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను రిమోట్ సెన్సింగ్ డేటాతో పొందవచ్చని చెప్పారు.
ఇదే విషయాన్ని ఈ నెల 26వ తేదీన ‘సాగు రైతుకే భరోసా’శీర్షికతో ప్రచురితమైన కథనంలో ‘సాక్షి’వెల్లడించింది. ఈ సంక్రాంతి నుంచి ‘రైతుభరోసా’ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం సచివాలయంలో రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసే వివిధ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమావేశమయ్యారు.
రిమోట్ సెన్సింగ్ డేటానే కీలకం
సాగు చేసిన భూముల వివరాలను వ్యవసాయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నమోదుచేస్తామని మంత్రి వెల్లడించారు. పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డేటాలో గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా సాగుభూమి, పంటల వివరాలను సేకరిస్తామని చెప్పారు. సాగు భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగా లేని భూముల విస్తీర్ణంతో పాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందనే వివరాలను పక్కాగా నమోదు చేస్తామని తెలిపారు.
ఈ వివరాలను రైతుభరోసా పథకంతోపాటు, పంటల బీమా పథకానికి కూడా వినియోగిస్తామని పేర్కొన్నారు. పంటల ఆరోగ్య స్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫాన్‌ల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడంలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల గురించి వివరించారు.
నమూనా సర్వే కింద రెండు మండలాల్లో పంటలు, గ్రామాల వారీగా సాగైన వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సాగుకు అనువుగా లేని ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా చూపించారు. పంటలను సోకే చీడపీడలను ఆరంభంలోనే గుర్తించే విధంగా ఆయా కంపెనీలు ఏఐ పరిజ్ఞానంలో తయారు చేసిన మోడల్స్‌ను వివరించారు.
ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నిటిని పరిశీలించి మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు, కేబినెట్ ఆమోదానికి పంపించడం జరుగుతుందని మంత్రి తుమ్మల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment