46 ఏళ్లకు తెరుచుకున్న సంభాల్‌లోని భస్మ శంకర్ ఆలయం
అక్కడే ఉన్న బావిలో యంత్రాంగం తవ్వకాలు
సంభాల్: ఉత్తరప్రదేశ్‌లో సంభాల్‌లో దాదాపు 46 ఏళ్ల తర్వాత గత వారం తెరుచుకున్న ఆలయం సమీపంలోని బావిలో దెబ్బతిన్న మూడు దేవతా విగ్రహాలు లభించాయి. నవంబర్‌లో షాహి జామా మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు ప్రయతి్నస్తుండగా హింస చెలరేగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఆ ప్రాంతానికి కిలోమీటర్ దూరంలోని ఖగ్గూ సరాయ్‌లోనే శ్రీ కార్తీక్ మహదేవ్(భస్మా శంకర్)ఆలయం ఉంది.
అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్న సమయంలో అక్కడే 1978 నుంచి మూతబడి ఉన్న ఆలయం విషయం బయటపడింది. ఆలయంలో హనుమాన్ విగ్రహం, శివలింగం ఉండగా, పక్కనే ఉన్న బావి శిథిలావస్థకు చేరుకుంది. ఈ బావిలో సోమవారం అధికారులు పూడిక తీత మొదలుపెట్టారు. సుమారు 15 అడుగుల లోతులో దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతి, గణేశ్, లక్ష్మీ దేవతా విగ్రహాలు లభించాయని అధికారులు చెప్పారు. ఆలయం ప్రాచీనతను కాపాడే లక్ష్యంతో పనులు చేపట్టామని చెప్పారు.
ఈ విగ్రహాలను ఎవరు, ఎందుకు ధ్వంసం చేసి ఉంటారనే విషయపై వివరాలను సేకరిస్తున్నామని అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా చెప్పారు. ఆలయం చుట్టూ ఆక్రమణల తొలగింపు కూడా జరుగుతోందన్నారు. కార్బన్ డేటింగ్ పరీక్షతో ఆలయంతోపాటు బావి ప్రాచీనతను నిర్థారించాలని కోరుతూ పురావస్తు శాఖకు లేఖ రాసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో జనం వచ్చి పూజలు చేస్తున్నారు. అధికారులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment