2016–17లో సగటు 4.5
2021–22లో 4.3
వ్యవసాయ కుటుంబాల్లో 4.5
వ్యవసాయేతర కుటుంబాల్లో 4.0
ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణాల్లో ఎక్కువ
ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మహారాష్ట్రలో తక్కువ
ఏపీలో 2016–17తో పోల్చితే 2021–22లో స్వల్పంగా పెరుగుదల
వ్యవసాయ కుటుంబాల్లో 30 శాతం పెద్దలు నిరక్షరాస్యులు
వ్యవసాయేతర కుటుంబాల్లో 28 శాతం నిరక్షరాస్యులు
ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ సర్వే 2021–22 వెల్లడి
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గుతోంది. 2016–17తో పోల్చితే 2021–22లో గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గినట్లు ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ సర్వే 2021–22 వెల్లడించింది. 2016–17లో గ్రామీణ భారతంలో 4.5 ఉండగా 2021–22లో 4.3 ఉందని సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల పరిమాణం, కుటుంబ పెద్ద విద్యార్హతలపై నిర్వహించిన సర్వేను నాబార్డు విడుదల చేసింది.
2021–22లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాల సగటు పరిమాణం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. వ్యవసాయేతర కుటుంబాల్లో 4.0గా ఉండగా వ్యవసాయ కుటుంబాల్లో 4.5గా ఉంది. రాష్ట్రాల మధ్య గృహ పరిమాణాలలో వైవిధ్యాలను సూచిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మహారాష్ట్ర, సిక్కిం, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది.
ఈ రాష్ట్రాల్లో కుటుంబానికి సగటున నలుగురు కంటే తక్కువగా ఉన్నారని సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016–17తో పోల్చితే 2021–22లో స్వల్పంగా పెరిగింది. ఏపీలో 2016–17లో 3.5 ఉండగా 2021–22లో 3.7గా ఉంది. ఇక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల్లో 30 శాతం పెద్దలు నిరక్షరాస్యులుగా ఉండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 28 శాతం ఉన్నట్లు సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment