స్వీడన్ – వెల్‌డన్
‘చిన్నీ.... పడుకో...’
‘ఫైవ్ మినిట్స్ మమ్మీ...’
‘ఫైవ్ మినిట్స్ అంటావు....గంటలకొద్దీ ఫోన్‌లో గేమ్స్ ఆడుతుంటావు. త్వరగా లేవడానికి మాత్రం ఏడుస్తుంటావు’
.....ఇలాంటి మాటలు ఎన్నో ఇండ్లలో వినిపిస్తుంటాయి.
సాధారణంగా పెద్దవాళ్లు ‘నిద్రలేమి’ సమస్యను ఎదుర్కుంటారు. అయితే స్వీడన్‌లో మాత్రం పిల్లలు కూడా ‘నిద్రలేమి’కి గురవుతున్నారు. దీనికి కారణం వారు ఎక్కువ సమయం డిజిటల్ మీడియా, టీవీల ముందు గడపడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పిల్లల స్క్రీన్ టైమ్‌కు సంబంధించి తల్లిదండ్రులు పరిమితులు విధించాలని సూచించింది. రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు ఒక గంట, ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు గంట లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ‘స్క్రీన్‌టైమ్’ ఉండేలా చూసుకోవాలన్నారు.
ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపం అనేది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించడం తప్పనిసరి అంటుంది స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ. స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ మార్గదర్శకాలు స్క్రీన్ టైమ్ తగ్గించడానికే కాదు పిల్లల అలవాట్లలో మార్పు తేవడానికి ఉద్దేశించినవి కూడా. ‘బెటర్ స్లీప్ హైజీన్’లో భాగంగా రాత్రి సమయంలో పిల్లల బెడ్‌రూమ్‌లో ఫోన్‌లు, ట్యాబ్‌లాంటివి దూరంగా పెట్టాలని ఏజెన్సీ తల్లిదండ్రులకు సూచించింది.
స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గణాంకాల ప్రకారం పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు వారు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఇంటక్షరాక్షన్, ఫిజికల్ యాక్టివిటీలకు దూరం కావడమే కాదు ‘నిద్రలేమి’ ‘డిప్రెషన్’...మొదలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.
పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం అనేది మన దేశంలోనూ పెద్ద సమస్యగా మారింది. ‘అధిక స్క్రీన్ టైమ్’ వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చెబితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment