9 శాతం దాటితే పునరాలోచిస్తాం
8.5 శాతంలోపు కొనసాగితే ఓకే
ఫిక్కీ, అనరాక్ సర్వేలో మెజారిటీ మనోగతం
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి.
సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు..
→ గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు.
→ 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు.
→ 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు.
→ రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు.
→ 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు.
చెప్పుకోతగ్గ మార్పు..
‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్‌మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు.
దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్‌లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment