home buyer
-
పెర్రీ చనిపోయిన ఇల్లు.. రూ.71 కోట్లకు కొన్న భారతీయ మహిళ
ప్రముఖ అమెరికన్-కెనడియన్ నటుడు, ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘ఫ్రెండ్స్’ స్టార్ మాథ్యూ పెర్రీ ఇంటిని భారత్‌కు చెందిన ఓ మహిళ కొనుగోలు చేశారు. అది కూడా రూ.71 కోట్లు పెట్టి మరీ కొన్నారు. పెర్రీ కెటామైన్ డోస్ ఎక్కువై ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.సాధారణంగా భారతీయులు.. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇల్లు కొనడానికి ఇష్టపడరు. కానీ భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ లాస్ ఏంజిల్స్‌లోని మాథ్యూ పెర్రీ విల్లాను కొనుగోలు చేశారు. అక్కడ ఆయన గతేడాది అక్టోబర్‌లో హాట్ టబ్‌లో చనిపోయారు.పెర్రీ జ్ఞాపకాలకు గౌరవంపెర్రీ జ్ఞాపకాలు, సానుకూల అంశాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు అనితా వర్మ చెబుతున్నారు. హిందూ మతాన్ని ఆచరించే ఆమె అక్కడ పూజలు చేయించారు. ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఎవరీ అనితా వర్మ?భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ క్యామెల్బ్యాక్ ప్రొడక్షన్స్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. వర్మ-లాలియన్ అరిజోనాలో ప్రసిద్ధ వాణిజ్య రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా. ఆమె తన కుటుంబ వ్యాపారమైన వర్మలాండ్ను విడిచి అరిజోనా ల్యాండ్ కన్సల్టింగ్ను ప్రారంభించారు. కాగా ఇక ఇంటి విషయానికి వస్తే అనితా వర్మ 8.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. ఇదే ఇంటిని పెర్రీ 2020లో 6 మిలియన్ డాలర్లకు కొన్నారు. -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
బ్రాండెడ్ గృహాలదే బాజా
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోళ్లలో బ్రాండ్ మోగిపోతుంది. నాణ్యత, గడువులోగా నిర్మాణాల పూర్తి, ఆధునిక వసతుల కల్పన, రుణాల మంజూరులో ప్రాధాన్యత.. కారణాలేవైనా బ్రాండెడ్ నిర్మాణ సంస్థల గృహాలకు డిమాండ్ పెరిగింది. రెరా, జీఎస్టీ వంటి నిర్మాణాత్మక విధానాల అమలు తర్వాత వీటి ఆధిపత్యం పెరిగింది. లగ్జరీతో పాటు అఫర్డబుల్, మధ్య ఆదాయ విభాగాల గృహాలను నిర్మిస్తుండటంతో లిస్టెడ్, ప్రముఖ డెవలపర్ల విక్రయాలు ప్రతికూల సమయంలోనూ జోరుగా సాగుతున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్స్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2021 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాలలో (ఏప్రిల్–డిసెంబర్) 93,140 గృహాలు విక్రయమయ్యాయి. ఇందులో ఎనిమిది లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల వాటా 22 శాతంగా ఉండగా.. ప్రధానమైన అన్–లిస్టెడ్ కంపెనీల విక్రయాలు 18 శాతం, ఇతర కంపెనీల విక్రయాలు 60 శాతంగా ఉన్నాయి. 2017 ఎఫ్‌వైలో మొత్తం 2.03 లక్షల గృహాలు విక్రయం కాగా ఇందులో టాప్ 8 లిస్టెడ్ కంపెనీల విక్రయాల వాటా 6 శాతంగా ఉంది. నాన్–లిస్టెడ్ సంస్థల విక్రయాలు 11 శాతం, ఇతరు ల వాటా 83 శాతంగా ఉంది. 2021 ఎఫ్వైలోని లిస్టెడ్ కంపెనీల సేల్స్‌లో అత్యధికంగా 66.4 లక్షల చ.అ. విక్రయాలతో గోద్రెజ్ ప్రాపర్టీస్ ముందు వ రుసలో నిలువగా.. 50.4 లక్షల చ.అ. విక్రయాలలో బెంగళూరు కంపెనీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ నిలిచింది. క్యూ3లో సేల్స్ అధరహో.. 2021 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 8 లిస్టెడ్ కంపెనీలు 2.123 కోట్ల చ.అ.లో విక్రయాలను పూర్తి చేశాయి. కోవిడ్–19 ఫస్ట్ వేవ్ 2020 ఎఫ్వైతో పోల్చితే విక్రయాలలో 2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2020 ఎఫ్వై ఏప్రిల్–డిసెంబర్లో 2.088 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. ఎఫ్వై 21లో తొలి మూడు త్రైమాసికాల విక్రయాలను గమనిస్తే.. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో సేల్స్ బాగా జరిగాయి. జూలై–సెప్టెంబర్ (క్యూ2)తో పోలిస్తే క్యూ3 విక్రయాలలో 77 శాతం వృద్ధి నమోదయింది. 8 లిస్టెడ్ కంపెనీలు ఏప్రిల్–జూన్ (క్యూ1)లో 51.6 లక్షల చ.అ. విక్రయాలను పూర్తి చేయగా.. క్యూ2లో 58 లక్షల చ.అ., క్యూ3లో 1.027 కోట్ల చ.అ. విక్రయాలను చేశాయి. జనవరి–మార్చి (క్యూ4)లో ఇప్పటివరకు బ్రిగేడ్, ఒబెరాయ్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్ మూడు కంపెనీలు మాత్రమే ఫలితాలను ప్రకటించాయి. ఇవి 32.1 లక్షల చ.అ.లుగా ఉన్నాయి. లిస్టెడ్, ప్రధాన కంపెనీలివే... ► 8 లిస్టెడ్ కంపెనీలివే: బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, కోల్టే–పాటిల్, మహీంద్రా లైఫ్‌స్పేసెస్, ఒబెరాయ్ రియాల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, పూర్వాంకర, శోభా. ► ప్రధాన కంపెనీలివే: మైహోమ్ కన్స్ట్రక్షన్స్, అపర్ణా కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్, అసెట్జ్ ప్రాపర్టీ, ఏటీఎస్ గ్రీన్, కాసాగ్రాండ్ బిల్డర్స్, కల్పతరు, లోధా గ్రూప్, పిరామల్ రియల్టీ, రన్వాల్ గ్రూప్, సలార్పూరియా సత్త్వా, శ్రీరామ్ ప్రాపర్టీస్, సిగ్నేచర్ గ్లోబల్, సన్‌టెక్ రియల్టీ, టాటా హౌసింగ్ డెవలపర్మెంట్ కో, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్, వాధ్వా గ్రూప్, వీటీపీ రియల్టీ. -
గృహ రుణ బదిలీతో లాభమెంత
అరుణ్ మిశ్రా (40) ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్. 2010లో యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.20 లక్షల రుణాన్ని తీసుకుని నోయిడాలో రూ.37 లక్షల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశారు. ఫ్లోటింగ్ రేటుపై రుణాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన 9 శాతం వడ్డీ రేటు చెల్లిస్తున్నాడు. 2010లో రుణాన్ని తీసుకున్నందున బీపీఎల్ఆర్ ఆధారిత రుణ రేటే ఇప్పటికీ అమలవుతోంది. ప్రస్తుత రేటుకు అతను మార్చుకోలేదు. దీనివల్ల అతను పలు ప్రయోజనాలు కోల్పోతున్నాడు. అరుణ్ ఒక ఉదాహరణ మాత్రమే. 2010 తర్వాత గృహ రుణాలకు బెంచ్‌మార్క్ విధానాలు మూడు పర్యాయాలు మారిపోయాయి. 2011లో బేస్ రేటు, 2016లో ఎంసీఎల్ఆర్ రేటు, 2019 అక్టోబర్‌లో ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేటు విధానాలు అమల్లోకి వచ్చాయి. రేట్లలో మార్పును వెంటనే బదలాయించడం, పారదర్శకత పెంపునకు ఎప్పటికప్పుడు నూతన విధానాల అమలు జరుగుతోంది. కానీ, అరుణ్ మిశ్రా వంటి ఎందరో ఇప్పటికీ పాత బెంచ్ మార్క్ విధానంలోనే కొనసాగుతున్నారు. మరింత పారదర్శకత, తక్కువ వడ్డీ రేటుతో కూడిన విధానాలకు బదిలీ చేసుకోవడం లేదు. ఒక నివేదిక ప్రకారం.. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియోలో 25 శాతం రుణాలు ఇప్పటికీ బేస్ రేటు విధానంలోనే కొనసాగుతున్నాయి. రూ.5,000 కోట్ల రుణాలు బీపీఎల్ఆర్ విధానంలో ఉన్నాయి. ‘‘బేస్ రేటు లేదా బీపీఎల్ఆర్ విధానంలో రుణాలు తీసుకున్న కస్టమర్లు నేడు అందుబాటులో ఉన్న మెరుగైన రేట్లతో పోలిస్తే 3.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు’’ అని బ్యాంక్‌బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ చందానీ తెలిపారు. కనుక ఇంటి రుణాలు తీసుకున్న వారు ఒక్కసారి వాటిని సమీక్షించుకోవడం ఎంతో అవసరం. రుణాన్ని నూతన బెంచ్ మార్క్ విధానంలోకి మార్చుకోవడం.. అప్పటికీ తాము చెల్లిస్తున్న వడ్డీ రేటు, మార్కెట్లో ఉన్న రేటు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే వెంటనే ఆ రుణాన్ని మరో సంస్థకు బదలాయించుకోవడం వల్ల లాభం ఉంటుంది. కానీ, దీనికంటే ముందు చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలను అందించే ప్రాఫిట్ కథనం ఇది. అవగాహన లేకే.. ‘‘ఇంటి రుణాన్ని మరొక బ్యాంకు లేదా సంస్థకు బదలాయించుకోకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉంటుంటాయి. మరింత పారదర్శకమైన బెంచ్‌మార్క్ రేట్ల విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలియకపోవచ్చు. లేదా ప్రస్తుతం తాము చెల్లిస్తున్న రేటు మెరుగ్గానూ ఉండొచ్చు. కొందరికి తెలిసినప్పటికీ నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు’’ అని స్విచ్మే వ్యవస్థాపకుడు ఆదిత్య మిశ్రా తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోలిస్తే బ్యాంకులు కొంచెం తక్కువ రేటుకు రుణాన్ని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర సేవింగ్స్, కరెంటు ఖాతాల్లో డిపాజిట్లు దండి గా ఉంటాయి. వీటిపై కస్టమర్లకు బ్యాంకులు చెల్లించే రేటు సగటున చాలా తక్కువ. సేవింగ్స్ ఖాతాలపై 3–3.5 శాతం రేటు చెల్లిస్తుంటే, కరెంటు ఖాతాల్లోని బ్యాలెన్స్‌లపై చెల్లింపులు సున్నా యే. చాలా చౌకగా బ్యాంకులకు నిధుల అందుబాటు ఉంటుంది. అందుకే బ్యాంకుల గృహ రుణాలపై రేట్లు కొంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఎప్పుడు మారడం.. గృహ రుణాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే మరో సంస్థకు బదిలీ చేసుకోవాలని భావించే వారు.. దీనివల్ల లాభమా? నష్టమా? అన్న సందిగ్ధంలో ఉంటే... పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. ‘‘రుణ కాల వ్యవధి కనీసం మరో 15 ఏళ్లు ఉండి, ప్రస్తుత రుణంపై రేటుతో పోలిస్తే కనీసం 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తక్కువకు ఆఫర్ చేస్తుంటే అప్పుడు రుణాన్ని బదిలీ చేసుకోవడం లాభదాయకం అవుతుంది. ఒకవేళ 15 సంవత్సరాల కంటే తక్కువ కాలమే ఇంకా చెల్లింపులకు మిగిలి ఉంటే అప్పుడు బదిలీ చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఎంతన్నది లెక్క వేసుకుని చూడాలి’’ అని ఆదిత్య మిశ్రా సూచించారు. హోమ్‌లోన్ ట్రాన్స్ఫర్ కాలిక్యులేటర్లు ఆన్లైన్లో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో బదిలీ వల్ల మిగిలేది ఎంతన్నది తెలుసుకోవచ్చు. రుణాన్ని బదిలీ చేసుకునే సమయంలో చెల్లించాల్సిన పలు చార్జీలను మిగిలే ప్రయోజనం నుంచి మినహాయించడం మరిచిపోవద్దు. అంతిమంగా పెద్ద మొత్తమే మిగులుతుందన్న లెక్క తేలితే అప్పుడు నిరభ్యంతరంగా రుణాన్ని బదలాయించుకోవచ్చు. కాకపోతే, రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. ‘‘చాలా సంస్థలు మిగిలి ఉన్న గృహ రుణ బదిలీకి అనుమతిస్తూ కొత్తగా టాపప్ లోన్‌ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అదనపు నిధుల సాయం అవసరమున్న వారు దీన్ని పరిశీలించొచ్చు. ఇది తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది’’ అని రతన్ చౌదరి తెలిపారు. రేటు తగ్గింపునకు సంప్రదింపులు మీరు ఇప్పటికే గృహ రుణం తీసుకుని వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే.. అదే సంస్థ మీతో పోలిస్తే కొత్త కస్టమర్లకు తక్కువ రేటుకు రుణాన్ని ఆఫర్ చేస్తుంటే.. అప్పుడు మీకు కూడా రేటు తగ్గించే విషయమై సంప్రదింపులు చేపట్టాలి. రుణ రేటును తగ్గించేందుకు బ్యాంకు అంగీకరించనప్పుడు లేదా మంచి రేటును ఆఫర్ చేయనప్పుడే రుణ బదలాయింపు గురించి యోచించాలి. గతంలో రుణాలు తీసుకుని ఉంటే.. అవి ఎంసీఎల్ఆర్, బేస్ రేటు, బీపీఎల్ఆర్ వడ్డీ రేట్ల విధానంలో ఉండొచ్చు. ఈ రుణాలను ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత విధానానికి (రెపో తదితర) మార్చుకోవచ్చు. ఎటువంటి ఫీజులు తీసుకోకుండానే బ్యాంకులు ఇందుకు అనుమతిస్తున్నాయి. ‘‘నిర్వహణ చార్జీ, న్యాయపరమైన డాక్యుమెంట్ల చార్జీలను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఒక్కసారి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మారిపోతే.. అప్పుడు కొత్త కస్టమర్లకు అమలు చేసే చార్జీయే వర్తిస్తుంది’’ అని పైసాబజార్ గృహ రుణాల విభాగం అధిపతి రతన్ చౌదరి తెలిపారు. బదిలీ ప్రక్రియ.. రుణాన్ని బదిలీ చేసుకోవాలని నిర్ణయించుకుంటే మీ నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా ప్రస్తుత రుణదాతకు తెలియజేయాలి. అప్పుడు సంబంధిత బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేదా సమ్మతి పత్రాన్ని విడుదల చేస్తుంది. అందులో ఇంకా చెల్లించాల్సిన రుణం ఎంతన్న వివరాలు ఉంటాయి. ఈ పత్రాన్ని కొత్తగా రుణాన్ని ఆఫర్ చేస్తున్న సంస్థకు అందించాలి. దీనితోపాటు ఆదాయ ధ్రువీకరణ, ప్రాపర్టీ టైటిల్ డాక్యుమెంట్ కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్ (ప్రాపర్టీ వినియోగం) లేదా కంప్లీషన్ (నిర్మాణం పూర్తయినట్టు) సర్టిఫికెట్, ఆర్కిటెక్ట్ ప్లాన్ కూడా కొత్త సంస్థ కోరే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత కొత్త సంస్థ రుణాన్ని మంజూరు చేస్తుంది. అంగీకరించిన మేరకు రుణాన్ని చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పాత రుణదాత పేరు మీద విడుదల చేస్తుంది. దీన్ని పాత రుణదాతకు సమర్పించాలి. కొత్త రుణ గ్రహీత వద్ద మార్ట్గేజ్ అగ్రిమెంట్‌పై (తనఖా ఒప్పందం) సంతకం చేయాల్సి ఉంటుంది. పాత సంస్థ నుంచి కొత్త రుణ గ్రహీత పేరు మీదకు ప్రాపర్టీ డీడ్ మార్చే సమయంలో రుణ గ్రహీత హాజరుకావాల్సి వస్తుంది. వ్యయాలు నూతనంగా రుణాన్ని ఇచ్చే సంస్థ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. రుణ మొత్తంలో ఇది ఒక శాతంగా ఉండొచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో రుణదాతలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తుంటారు. ఆ సమయంలో ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.10వేల లోపే ఉంటుంది. కొన్ని అయితే, పూర్తిగా మాఫీ కూడా చేస్తున్నాయి. అయితే ప్రాపర్టీ మార్ట్గేజ్ డీడ్‌పై స్టాంప్ డ్యూటీ రూపంలో ఎక్కువ చార్జీ భరించాల్సి ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఇది ఒక్కో విధంగా ఉండొచ్చు. గృహ రుణ బదిలీకి ఎంతలేదన్నా రెండు నుంచి ఐదు వారాల సమయం తీసుకుంటుంది. -
రెరా తొలి తీర్పు: రూ. 26లక్షల పరిహారం
సాక్షి, ముంబై: ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన రియల్ ఎస్టేట్ చట్టం రెరా (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) పరిధిలో తొలి తీర్పు వెలుపడింది. అదీ గృహకొనుగోలుదారుకు అనుకూలంగా ఈ తీర్పు వెలుడింది. అనుకున్న సమయానికి ఇంటిని స్వాధీనం చేయకపోవడంతో బాధితుడు ఆన్లైన్ ద్వారా రెరాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు పరిహారం చెల్లించాల్సిందిగా బిల్డర్‌ను రెరా ఆదేశించింది. 2016నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని బిల్డర్ చెప్పారు. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీనికి తోడు ఆయన చెల్లించిన అడ్వాన్స్ సొమ్మను చెల్లించడానికి సదరు బిల్డర్ నిరాకరించారు. ఈ క్రమంలో బాధితుడు రెరాను ఆశ్రయించారు. రూ.5000 చెల్లింపు ద్వారా మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) వెబ్సైట్ లో ఫిర్యాదుదారు కేసు నమోదు చేశారు. దీన్ని విచారించిన రెరా గృహ కొనుగోలుదారునికి రూ. 26.15 లక్షలను తిరిగి చెల్లించాలని బుధవారం ఆదేశించింది. ముంబైకి చెందిన బిల్డర్‌కు ఈ ఆదేశాలు జారీ చేసింది. గృహ-కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సంబంధిత చట్టాలు అధికారుల మధ్య మంచి సమన్వయం ఉండాలని మహా రెరా చైర్మన్ గౌతం ఛటర్జీ మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా జైపీ ఇన్ ఫ్రాటెక్ కేసులు ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ప్రాజెక్ట్ డెలివరీలో జాప్యానికి సంబంధించి ఇప్పటివరకు తమకు 98 ఫిర్యాదులను అందుకున్నామన్నారు. కారణం ఏదైనా కొనసాగుతున్న ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయితే వినియోగదారులే నష్టపోతారని ఛటర్జీ వ్యాఖ్యానించారు.మరోవైపు ఈ ఆదేశాలు జారీ అయినే వెంటనే డెవలపర్ తనుకు చెక్‌ను అందించారంటూ ఫిర్యాదు దారు సంతోషం వ్యక్తం చేశారు.