ప్రముఖ అమెరికన్-కెనడియన్ నటుడు, ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘ఫ్రెండ్స్’ స్టార్ మాథ్యూ పెర్రీ ఇంటిని భారత్‌కు చెందిన ఓ మహిళ కొనుగోలు చేశారు. అది కూడా రూ.71 కోట్లు పెట్టి మరీ కొన్నారు. పెర్రీ కెటామైన్ డోస్ ఎక్కువై ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.
సాధారణంగా భారతీయులు.. ఎవరైనా ఇంట్లో చనిపోతే ఆ ఇల్లు కొనడానికి ఇష్టపడరు. కానీ భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ లాస్ ఏంజిల్స్‌లోని మాథ్యూ పెర్రీ విల్లాను కొనుగోలు చేశారు. అక్కడ ఆయన గతేడాది అక్టోబర్‌లో హాట్ టబ్‌లో చనిపోయారు.
పెర్రీ జ్ఞాపకాలకు గౌరవం
పెర్రీ జ్ఞాపకాలు, సానుకూల అంశాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు అనితా వర్మ చెబుతున్నారు. హిందూ మతాన్ని ఆచరించే ఆమె అక్కడ పూజలు చేయించారు. ఆ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఎవరీ అనితా వర్మ?
భారతీయ మూలాలున్న అనితా వర్మ-లాలియన్ క్యామెల్‌బ్యాక్ ప్రొడక్షన్స్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. వర్మ-లాలియన్ అరిజోనాలో ప్రసిద్ధ వాణిజ్య రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కూడా. ఆమె తన కుటుంబ వ్యాపారమైన వర్మలాండ్‌ను విడిచి అరిజోనా ల్యాండ్ కన్సల్టింగ్‌ను ప్రారంభించారు. కాగా ఇక ఇంటి విషయానికి వస్తే అనితా వర్మ 8.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.71 కోట్లు) పెట్టి కొనుగోలు చేశారు. ఇదే ఇంటిని పెర్రీ 2020లో 6 మిలియన్ డాలర్లకు కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment