దేశంలో 65% మంది వృద్ధులది ఇదే పరిస్థితి
హెల్ప్ ఏజ్ ఇండియా సర్వేలో వెల్లడి
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని టైర్ 1, 2 నగరాల్లో 5,169 మంది వృద్ధులపై అధ్యయనం
సాక్షి, అమరావతి: జీవిత చరమాంకంలో ఆర్థిక అభద్రతతో పండుటాకులు విలవిల్లాడుతున్నాయి. దేశంలో సగానికిపైగా వృద్ధుల్లో ఈ సమస్య ప్రబలంగా ఉంది. ఈ విషయం ఇటీవల హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ‘ఏజింగ్ ఇన్ ఇండియా’ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది.
సర్వేలో భాగంగా 10 రాష్ట్రాల్లోని 20 టైర్ 1, 2 నగరాల్లో 60 నుంచి 80 ఏళ్లు పైబడిన 5,169 మంది వృద్ధులు, 1,333 మంది సంరక్షకులను సర్వే చేశారు. దక్షిణాదిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని టైర్ 1 చెన్నై, బెంగళూరు, టైర్ 2 సేలం, హుబ్లీ నగరాలను సర్వే కోసం ఎంపిక చేశారు.
కాగా, సేకరించిన అభిప్రాయాలను అధ్యయనం చేసిన అనంతరం ప్రతి ముగ్గురిలో ఒకరు గత సంవత్సర కాలంలో ఎటువంటి ఆదాయం పొందలేదని గుర్తించారు. 65 శాతం మంది ఆర్థికంగా అభద్రతా భావంతో జీవిస్తున్నట్లు నిర్ధారించారు. 29 శాతం మంది వృద్ధాప్య పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, సామాజిక భద్రతా పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు.
అభద్రతాభావం మహిళల్లోనే అధికం
తమ ప్రస్తుత రాబడి, పెట్టుబడులు, పొదుపు పరిగణనలోకి తీసుకుని 65 శాతం మంది ఆర్థికంగా అభద్రతతో ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 90 శాతం, తమిళనాడులో 38 శాతం మంది అభద్రతా భావాన్ని వ్యక్తపరిచారు. 15 శాతం మంది వృద్ధులు నేటికీ పనిచేస్తున్నారు. వీరిలో 85 శాతం మంది అక్షరాస్యులుగా ఉన్నారు.
48 శాతం బీపీ.. 43 శాతం షుగర్ సమస్యలు
68శాతం మంది వృద్ధులు తమ సాధారణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. 10శాతం మంది మాత్రం తమ ఆరోగ్యం బాగోలేదన్నారు. మొత్తంగా పరిశీలిస్తే 48 శాతం మంది బీపీ, 43 శాతం మంది షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. 35 శాతం మంది ఎముకలు, కీళ్లకు సంబంధించిన అర్థరైటీస్ వంటి వ్యాధులను ఎదుర్కొంటున్నారు.
19 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్నాయి. అదే 80 ఏళ్లు పైబడిన వారిలో అయితే 62 శాతం మంది బీపీ, 54 శాతం మందిలో షుగర్ సమస్యతో ఉన్నట్టు తేలింది. 60 ఏళ్లు పైబడిన వారిలో 54 శాతం మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌తో బాధపడుతున్నారు. 79 శాతం మంది రెగ్యులర్ చెకప్‌లు, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment