తెలంగాణలో కులగణన మొదలైంది. విజయవంతం అవుతుందా లేదా అన్న అనుమానాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రెండూ దీనిపై పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శమవుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఈ జోష్‌లోనే రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసురుతూ ‘‘ఇక కాచుకోండి’’ అంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను కూడా బద్ధలు కొడతామని రాహుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా లేవన్నది కాంగ్రెస్ భావన. రాజకీయ కోణం ఉండనే ఉంది. కులగణన వల్ల బలహీన వర్గాల వారికి మరింత లబ్ధి చేకూరుతుందని, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలతోపాటు రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని కాంగ్రెస్ ఆలోచన. ఇవన్నీ వినేందుకు బాగానే ఉన్నా సర్వే పూర్తి కావాలంటే మాత్రం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నది మాత్రం నిజం. ఇప్పటికే బీహార్‌లో కులగణన చేశారు.
అయితే ఇది న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా ఒక చట్టం చేయకుండా కులగణన చేయడం వల్ల దానికి చట్టబద్ధత ఎలా వస్తుందన్నది ప్రశ్న. సర్వేలో అందే వివరాలు సమగ్రంగా ఉంటాయా? వాస్తవాలేనా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పాలకులు మారినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడంవల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఒకదాన్ని నిర్వహించారు. ఒకే రోజు రాష్ట్రమంతటా చేపట్టే ఈ సర్వేలో అందరూ కచ్చితంగా పాల్గొనాలని చెప్పడంతో అప్పట్లో జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. దూర ప్రాంతాల్లోని వారు వేలకు వేలు ఖర్చుపెట్టుకుని సొంతూళ్లకు రావాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలు ఏమయ్యాయి అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకు సర్వే చేశారు? అందిన సమాచారాన్ని ఎలా వాడారో ఎవరికీ చెప్పలేదు. దీంతో అదంతా వృథా ప్రయాసే అన్న అభిప్రాయం ఏర్పడింది.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలుకుగాను.. ఆయా పథకాలను కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమం కింద కోరారు. ఇందుకో అధికశాతం మంది క్యూల్లో నిలవాల్సి వచ్చింది. దరఖాస్తులు పెట్టుకోవడానికి నానా పాట్లు పడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదు. దీని ప్రభావం కాస్తా ప్రస్తుతం జరుగుతున్న కులగణనపై పడుతోంది. ముందు అప్పటి సమాచారం సంగతేమిటో తెల్చమని కొందరు సర్వే అధికారులను నిలదీస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు.
అసలు కుల గణన దేనికి? మా ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, మా రుణాలు తదితర వివరాలతో ఏమి చేస్తారు? అంటూ పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్యుమరేటర్లు పై అధికారులు ఇచ్చిన సమాచారాన్ని వివరిస్తున్నా ప్రజలకు సంతృప్తి కలగడం లేదు. అందుకే ఒక ఎన్యుమరేటర్.. ‘‘ఏమో సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగండి’’ అంటే.. ‘‘అయితే ఆయన్నే సర్వేకు రమ్మనండి’’ అని ఒక పౌరుడు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సర్వేలో భాగంగా బ్యాంకు ఖాతాల వివరాలు అడగడం వివాదాస్పదమైంది. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దాంతో ప్రభుత్వం విరమించుకుంది. ఇప్పుడు మళ్లీ అదేరకంగా బ్యాంకు ఖాతాల వివరాలు, ఇంటి స్థలం జాగా, ఆదాయ వనరులు మొదలైన వాటి గురించి సుమారు 75 పాయింట్లపై ప్రశ్నలు వేస్తున్నారు. వాటన్నిటికి జవాబు చెప్పడానికి చాలా టైమ్ పడుతుంది.నిజానికి ఏ సర్వే అయినా సింపుల్ గా ఉండాలి. తక్కువ ప్రశ్నలతో ఎక్కువ సమాచారం రాబట్టేలా చేయగలిగితే ఉపయుక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల వ్యక్తిగత ఆదాయ, ఆస్తి వివరాలు అడగడం ఆరంభించారో, అప్పుడే అనుమానాలు ప్రబలుతాయి. ఉదాహరణకు ఒక ఇంటి వద్దకు వచ్చి ఆ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంటుందని అడగగానే ఆ ఇంటి యజమానికి సందేహాలు వస్తాయి.
ప్రభుత్వం ఏమైనా పన్నులు పెంచడానికి ఈ ప్రశ్న వేస్తోందా, వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆపడానికా? అన్న భావన కలుగుతుంది. నిజానికి పట్టణాలు,నగరాలు, గ్రామ పంచాయతీలు ఎక్కడైనా స్థానిక సంస్థలలో ఇళ్లు, విస్తీర్ణం తదితర వివరాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే పన్నులు కడుతుంటారు. ఒక వేళ స్థలం యజమాని మారినా, ఆ వివరాలు కూడా నమోదు అవుతాయి. అలాంటప్పుడు ఈ తరహా వివరాలు స్థానిక సంస్థల నుంచి తెలుసుకోవచ్చు కదా! ఇళ్ల యజమానులు సర్వేలో నిజాలు చెబితే ఓకే. కాని వారికి ఉండే సంశయాలతో వాస్తవాలు చెప్పకపోతే ఏమి అవుతుందన్న ప్రశ్న కూడా వస్తుంది. చట్టబద్దత లేకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు. కేవలం ఎవరు ఏ కులం అన్నది తెలుసుకోవడమే లక్ష్యమైతే ఇన్ని పాయింట్లతో సమగ్ర సర్వే అవసరమా? అని కొందరు అడుతున్నారు.
నిజమే! ప్రభుత్వాల వద్ద ప్రజలందరి సమాచారం ఉంటే, దానిని విశ్లేషించుకుని, వివిధ స్కీములు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కులాల వారిగా జాబితా ఉంటే రిజర్వేషన్ ల విషయంలో నిర్దిష్ట విధానం అవలంబించడానికి వీలు అవుతుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో వీటి ఆధారంగా ఆయా పార్టీలు టిక్కెట్లు కేటాయించే అవకాశం పెరుగుతుంది. కాని కేవలం కులాల ఆధారంగానే రాజకీయాలు అన్నిసార్లు నడవవన్న విషయాన్ని కూడా విస్మరించలేం. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల నేతలే ఎందుకు రాజకీయంగా అధిక శాతం పదవులు పొందుతున్నారు? కులాల సర్వేతోనే పరిస్థితి మారుతుందా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం.
ఆయా నియోజకవర్గాలలో కులాల బలబలాలను కూడా చూసుకునే టిక్కెట్లు ఇవ్వడం ఇప్పటికే జరుగుతోంది. ఆ విషయాన్ని కూడా కాదనలేం. ఆదాయ వివరాలు ఉంటే దానికి తగ్గట్లుగా పేదలను ఆర్ధికాభివృద్ది చేయవచ్చు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు తమ ఆదాయ వివరాలను బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. ముఖ్యంగా పేదలతో పాటు దిగువ మధ్య తరగతివారు వివిధ ప్రభుత్వ స్కీముల కింద ప్రయోజనం పొందుతుంటారు. తమ ఆదాయం నిర్దిష్ట పరిమితికన్నా కాస్త ఎక్కువగా ఉన్నా వాటిని తొలగిస్తారేమో అన్న భయం వారిలో ఉంటుంది. దానిని ఎలా పొగొడతారో తెలియదు. ఆదాయ పన్ను శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల వద్ద ప్రజల ఆదాయ వివరాలు దొరుకుతాయి. వాటిని తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారం సేకరిస్తుంది. అలాగే బీసీ జనాభాను కూడా గుర్తించవచ్చు. రాజకీయ, ఉపాధి అవకాశాలలో బీసీలకు రిజర్వేషన్ లు పెంచుతామంటూ రాజకీయ పార్టీలు హడావుడి చేయడం, కమిషన్లు వేయడం, చివరికి అవన్ని ఉత్తుత్తిగానే మిగిలి పోవడం చూస్తూనే ఉన్నాం. =అసలు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కులగణన సర్వేలు చేయగలుగుతాయా? రిజర్వేషన్లు యాభై శాతం దాటి పెంచాలని సంకల్పించినా కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదు కదా! రాజకీయ పార్టీలకు ఈ అంశంలో ఉన్న చిత్తశుద్ది ఎంత అన్నది కూడా వస్తుంది.
ఒకపక్క బలహీన వర్గాలు అంత శాతం ఉన్నారు.. ఇంత శాతం ఉన్నారని చెబుతారు. కాని అధికార పంపిణీలో మాత్రం ఏ వర్గం ఆధిపత్యంతో ఉంటుందో, దానికే అధిక వాటా లభిస్తోంది. అంతెందుకు యాభై శాతం మించి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారంలో అన్యాయం జరుగుతోందని రాహుల్ గాందీ మొదలు రేవంత్ రెడ్డి వరకు అంటున్నారు కదా! కాని సీఎం పదవి వచ్చేసరికి ఎందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే ఇచ్చింది? మల్లు భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రి పదవికి ఎందుకు పరిమితం చేశారు?
ఇక్కడే కాదు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. రేవంత్‌కు సీఎంపదవి రావడాన్ని తప్పుపట్టడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసి పదవి సంపాదించుకున్నారు. కాని కులాల పంచాయతీ పెట్టినప్పుడే ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుంటాయి. సమాజంలో ఎంత కాదన్నా ఆధిపత్య కులాల, వర్గాల పెత్తనం ఇంకా పోలేదు. కులాల ప్రాతిపదికన అన్నీ జరిగిపోవు. అలా అని కులాలను విస్మరించాలని ఎవరూ చెప్పరు. వీటన్నిటికి మూల కారణం ఎక్కడ వస్తోంది? రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తుంటాయి.
అర్హతలతో నిమిత్తం లేకుండా హామీలు ఇచ్చి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత షరతులు పెట్టడం ఆరంభిస్తారు.దానిపై ప్రజలలో మండుతుంది. ఉదాహరణకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సూపర్ సిక్స్ అని, గ్యారంటీలు అని ఎన్నికల మానిఫెస్టోలలో పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు రూ.నెలకు 2500 చొప్పున ఇస్తామని చెబితే, ఏపీలో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే ఏపీలో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాలలో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇవే కాదు. వందల కొద్ది హామీలను గుప్పించారు.
తీరా ఎన్నికయ్యాక వాటిని ఎలా అమలు చేయలో తెలియక, ఆర్థిక వనరులు ఎక్కడనుంచి వస్తాయో అర్థం కాక, నేతలు తల పట్టుకుని కూర్చుంటున్నారు. అక్కడ నుంచి ప్రజలను ఎలా మోసం చేయాలా,డైవర్షన్ రాజకీయాలు ఎలా చేయాలా అన్నదానిపై దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కుల గణన అనండి, సమగ్ర కుటుంబ సర్వే అనండి.. ఏది చేసినా ప్రజలకు మేలు చేయడానికే అయితే స్వాగతించాల్సిందే. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు గేమ్ ఆడుతుంటే ప్రజలు హర్షించరు. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి చిత్తశుద్దితో చేస్తే తప్ప, ఒక్క తెలంగాణలోనో, మరో రాష్ట్రంలోనో చేస్తే పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్నది సందేహమే.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment