ప్రవాసులకు ఖరీదైన నగరంగా దేశంలోనే అగ్రస్థానం
ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్
దేశ ఆర్థిక రాజధానిలో భారీగా పెరిగిన జీవన వ్యయం
మెర్సర్– ‘2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వేలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో హాంకాంగ్
సాక్షి, అమరావతి: ప్రముఖ హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్– ‘2024 కాస్ట్ ఆఫ్ లివింగ్’ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది.దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబైలో జీవించే ప్రవాసుల జీవన వ్యయం గణనీయంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా 11 స్థానాలు ఎగబాకి 136వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై ఐదు స్థానాలు దిగజారి 189వ స్థానానికి, అలాగే బెంగళూరు ఆరు స్థానాలు క్షీణించి 195వ స్థానానికి చేరుకున్నాయి. హైదరాబాద్ 202వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది.
ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వేరొక నగరం, దేశానికి వలస వెళ్లి జీవించడంలో జీవన వ్యయం కీలక పాత్ర పోషిస్తున్నది. స్థానిక ఆర్థిక పరిస్థితులు కొన్ని నగరాలను ప్రవాసులకు మరింత ఖరీదైనవిగా చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ వరుసలోనే పూణే ఎనిమిది స్థానాలు ఎగబాకి 205వ, కోల్‌కతా నాలుగు స్థానాలు ఎగబాకి 207వ స్థానానికి చేరుకున్నాయి.
ఇక్కడ ఈ ఖర్చులు ఎక్కువ
ఆసియాలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 21వ స్థానం, ఢిల్లీ 30వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీలో ఈ ఏడాది గృహాల అద్దెలు 12–15 శాతం పెరిగాయి. ముంబైలో 6–8 శాతం, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలలో 2–6 శాతం పెరుగుదల నమోదైనట్లు నివేదిక చెబుతున్నది. ఇక ముంబైలో రవాణా ఖర్చులు భారీగా ఉంటున్నాయి. ఆ తర్వాత బెంగళూరు ఉంది.
పాల ఉత్పత్తులు, రొట్టెలు, పానీయాలు, నూనెలు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల కోసం కోల్‌కతాలో పొదుపుగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కేవలం ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు ఢిల్లీలో అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్నాయి. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ఖర్చుల్లో మాత్రం ముంబై అందనంత ఎత్తులో ఉంది. దీని వెనుకే చెన్నై ఉంది. ఎనర్జీ, యుటిలిటీ ఖర్చుల్లో ముంబై, పూణేలు భయపెడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
హాంకాంగ్ మరోసారి
ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాన్ని పరిశీలిస్తే మొదటి ఐదు నగరాలు ర్యాంకింగ్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. హాంకాంగ్ (చైనా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బాసెల్, బెర్న్ (స్విట్జర్లాండ్), న్యూయార్క్ సిటీ (యూఎస్), లండన్ (యూకే), నసావు (బహామాస్), లాస్ ఏంజిల్స్ (యూఎస్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మెర్సర్ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాల్లో జీవన వ్యయాన్ని అంచనా వేసింది. గృహనిర్మాణం, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2024లో అధిక జీవన వ్యయాన్ని ఖరీదైన గృహ వినియోగం, అధిక రవాణా ఖర్చులు, వస్తువులు, సేవల అధిక ధర, ద్రవ్యోల్బణం, మారకపు రేటు హెచ్చుతగ్గులు, యుటిలిటీలు, స్థానిక పన్నులు, విద్య తీవ్రంగా ప్రభావితం చేసినట్టు వివరించింది.
అధిక జీవన వ్యయాలకు ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ నగరం ఈ జాబితాలో ఏడో స్థానాన్ని పొందింది. ఆసియా–పసిఫిక్ ప్రాంతాల్లోని నగరాలు టాప్–10లో ఎక్కువ సంఖ్యలో ఉండడం విశేషం. ఇందులో టోక్యో 5వ, బీజింగ్ 9వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment