ఆ స్థలాల లీజింగ్​లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌! | Office Space Leasing Decrease 21 Pc October Sq Ft Across Top 7 Cities Says Survey | Sakshi
Sakshi News home page

ఆ స్థలాల లీజింగ్​లో దూసుకెళ్తున్న హైదరాబాద్‌!

Published Sun, Nov 27 2022 1:57 PM | Last Updated on Sun, Nov 27 2022 2:49 PM

Office Space Leasing Decrease 21 Pc October Sq Ft Across Top 7 Cities Says Survey - Sakshi

న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్‌ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సేవల్లోని జేఎల్‌ఎల్‌ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్‌ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది.

అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్‌ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్‌ పరిమాణం 8.5 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్‌ స్పేస్‌కు డిమాండ్‌ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్‌ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్‌ఎల్‌ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్‌ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది.

తయారీ రంగం నుంచి డిమాండ్‌
తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్‌ కనిపించింది. 22 శాతం ఆఫీస్‌ స్పేస్‌ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్‌ స్పేస్‌ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

జేఎల్‌ఎల్‌ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్‌ గ్రేడ్‌ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్‌ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్‌ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది.

చదవండి: పీఎన్‌బీ కస్టమర్లకు అలర్ట్‌.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్‌ ఖాతాపై ఆంక్షలు తప్పవ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement