విలువలను బతికించుకోవాలి...
మనం పక్షిలాగ ఎగరడం, చేపలాగ ఈతకొట్టడం నేర్చుకున్నాం. కాని నడవడం, మనిషిలాగ బతకడం మర్చిపోతున్నాం. విలువలు అనేవి జీవితంలోని ప్రతి విషయానికి పునాది. అవి లేనప్పుడు జీవితం అనిశ్చితికి గురవుతుంది.
భారతదేశం తరపున ఆధ్యాత్మిక సౌరభాలను ప్రపంచానికి వ్యాపింపజేస్తున్నారు మాతా అమృతానందమయి. కేరళ వాసి అయినప్పటికీ మన రాష్ట్రంలోని హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రబోధకురాలు ఇటీవలే అరవై వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘అమృతవర్షం 60’ పేరుతో కేరళలోని కొల్లం గ్రామంలో నిర్వహించిన మూడు రోజుల వేడుకకు హాజరైన లక్షలాదిమంది భక్తులకు తన ఆలింగన భాగ్యం కలిగించిన మాతా అమృతానందమయి సమాజహితమైన సందేశాన్ని సైతం అందించారు. ఆమె సందేశంలోని ముఖ్యాంశాలివి...
వీరులు కావాలి
మన దేశానికి ఇప్పుడు వీరులు కావాలి. ప్రేమశక్తితో భయరహితంగా ధైర్యంతో ముందుకు వెళ్లేవారు కావాలి. అయితే దీని అర్థం ఒక వ్యక్తి తన శక్తితో మరొకర్ని ఓడించాలనో, ఇతరుల రాజ్యాలను గెలుచుకోవాలనో కాదు. నాణ్యమైన నాయకత్వాన్ని అందించాలని.
ఆధ్యాత్మిక విలువలు అవసరం
మనుషులు శాంతి, సామరస్యాలతో లేనప్పుడు అభివృద్ధి ఉన్నా ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని అర్థం. అభివృద్ధితో పాటుగానే మనకు ఆధ్యాత్మిక సంస్కృతి, విశ్వవ్యాపితమైన విలువలు అవసరం.
మనసుల మధ్య దూరం...
సాంకేతిక పరిజ్ఞానం మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని రెట్టింపు జేస్తోంది. అవి మనం సృష్టించినవే అని మరిచిపోవద్దు. వీటినుంచి సంతోషాన్ని వెతుక్కోవడం సరైన విధానం కాదు.
జీవితాన్ని ఆనందించే సమయం...
ఇప్పుడు సమయాన్ని ఆదా చేసే ఉత్పత్తులు రోజుకొకటి వస్తున్నాయి. గతంలోలా జీవితాన్ని ఆనందించే సమయం, సందర్భాలు మనకు లేకుండా పోతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు చాలా ఉంటున్నాయి. కాని వారికి ఆడుకునే సమయం ఉండడం లేదు. మన చేతలకు, మన సాంస్కృతిక విలువలకు సంబంధం లేకపోతే అది ఒక పనిచేయని బ్యాటరీ కలిగిన మొబైల్‌ఫోన్‌ను వినియోగించడం లాంటిదే. అది కేవలం ఇతరులకు చూపించడానికి మాత్రమే తప్పితే మరెందుకూ పనికి రాదు.
నిశ్చలమైన వేదిక నిర్మించుకోవాలి...
మనం పక్షిలాగ ఎగరడం, చేపలాగ ఈతకొట్టడం నేర్చుకున్నాం. కాని నడవడం, మనిషిలాగ బతకడం మర్చిపోతున్నాం. విలువలు అనేవి జీవితంలోని ప్రతి విషయానికి పునాది. అవి లేనప్పుడు జీవితం అనిశ్చితికి గురవుతుంది. అది తరచు ఊగే వేదికలాగ మారకూడదంటే... మనలో అంతరాంతరాల్లో ఒక నిశ్చలమైన వేదికను నిర్మించుకోవాలి. విలువల్ని బతికించుకోవాలి.
ఒంటరి మనసులకు కుటుంబ చికిత్స...
ఒకప్పుడు కుటుంబం నుంచి ప్రతి ఒక్కరికీ భద్రత లభించేది. దాంతో సమస్యల్ని సులువుగా ఎదుర్కోగలిగేవారు. ఆధునిక సమాజంలో పరిమిత కుటుంబాల కారణంగా ఒంటరితనం అనే వ్యాధితో, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు పెరుగుతున్నారు. చిన్న విషయాలను కూడా భరించలేని వారు ఎక్కువయ్యారు.
సామాజిక దృక్పథం ఉండాలి...
మనం ఎప్పుడూ ఇతరుల తప్పులపైనే దృష్టిపెడతాం. ఇతరుల బలహీనతల విషయంలో మనం న్యాయమూర్తులం అవుతాం. అదే మన బలహీనతల విషయానికి వచ్చేసరికి మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తాం. అది సరైంది కాదు. దీనిని అర్థం చేసుకుంటే ఎందరినో మనం చేరువ చేసుకోగలం. ఒకప్పటి రోజుల్లో ప్రతి వ్యక్తిగత నిర్ణయం సమాజ బాధ్యతను అనుసరించి ఉండేది. వ్యక్తిగత లబ్దికోసం మాత్రమే ఆలోచించడం అంతిమంగా అందరికీ కీడు చేస్తుంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే..!
రామాయణమైనా మహాభారతమైనా లేక గత 1000 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నా... ఎందరో నియంతలు, రారాజులు... మహిళల పట్ల, అమ్మదనం పట్ల అమర్యాద కారణంగా తమ సామ్రాజ్యాలను సర్వనాశనం చేసుకున్నారు. అందుకే మనం వెంటనే చేయాల్సిన పని మన పిల్లల్లో విలువల పట్ల ప్రేమను పెంచడం. అలాగైతేనే ఈ పరిస్థితుల్లో మార్పు తేగలం.
- సేకరణ: ఎస్.సత్యబాబు