సక్సెస్... ఫెయిల్యూర్... జీవితంలో ఏదీ అంతిమం కాదు! | shahrukh khan birthday special interview | Sakshi
Sakshi News home page

సక్సెస్... ఫెయిల్యూర్... జీవితంలో ఏదీ అంతిమం కాదు!

Published Sat, Nov 1 2014 11:28 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

shahrukh khan birthday special interview

పీక్కుపోయిన చెంపలు...
 పాలిపోయిన శరీరం...
 చొక్కా లేనప్పుడు చూస్తేనేమో గ్రీకు శిల్పం!
 నిర్లక్ష్యపు చూపులు...
 నిర్విరామంగా చేతుల్ని వెలిగించే సిగరెట్...
 అందుకున్న విజయాల రికార్డు చూస్తేనేమో అద్భుతం!
 పాతికేళ్ల క్రితం ముంబయిలో అడుగుపెట్టిన ఒక సాధారణ వ్యక్తి
 పవరాఫ్ బాలీవుడ్‌కి ప్రతిరూపంలా మారడం ఓ సంచలన చరిత్ర!
 ఎందరినో ఇన్‌స్పైర్ చేసే సక్సెస్ స్టోరీ!
 అయితే సక్సెస్ అంటే ఇంతేనా? ... ఇంకేదో ఉందంటున్నారు బాలీవుడ్ బాద్‌షా!
 రెండున్నరగంటల ఎంటర్‌టైన్‌మెంట్ పీస్‌లా తాను మిగిలిపోదలచుకోలేదంటున్నారాయన.
 స్వయంగా నిర్మించి, నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సక్సెస్‌ను
 ఎంజాయ్ చేస్తూ షారుఖ్ ఖాన్ ‘సాక్షి’కి ముంబయ్‌లో ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...
 నేడు తన బర్త్‌డే సందర్భంగా...

హాయ్ సర్... మీ మాతృభూమి నుంచి వస్తున్నాం ఎలా ఉన్నారు?
షారుఖ్: హాయ్... వెరీ ఫైన్. అవును హైదరాబాద్ మా ‘మదర్’ ల్యాండ్. అక్కడ టోలీచౌకీలో మా అమ్మగారి  ఇల్లు ఇప్పటికీ ఉంది. ఐలైక్ ద సిటీ వెరీ మచ్.
 
అటు ప్రొడక్షన్... ఇటు యాక్షన్... బాగా హెవీ వర్క్. ఏమైతేనేం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా సక్సెస్. ఇప్పుడు హ్యాపీగా రిలాక్సవుతున్నారా?
షారుఖ్: జస్ట్ వన్ వీక్ గ్యాప్. అంతే! మళ్లీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.
 
మీరు ఆల్రెడీ సూపర్‌స్టార్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. అయినా అటు క్రికెట్ టీమ్, ఇటు ప్రొడక్షన్, యాక్షన్... ఇలా కష్టపడుతూనే ఉన్నారు. ఇక కొంత విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం లేదా?
ఈ ప్రశ్నకు షారుఖ్ ఒక్కక్షణం ఆగారు... ఆలోచించారు. ఎదురుగా ఉన్న సిగరెట్ ప్యాకెట్‌లో నుంచి తన చిరకాల నేస్తాన్ని తీసి వెలిగించి, గట్టిగా ఒక దమ్ము లాగారు. అనంతరం ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో అడుగుతున్న ప్రశ్నలకు, ఆయన ఇచ్చిన సమాధానాల సమాహారం ఆయన మాటల్లోనే...
 
ఎవరికి నిరూపించుకోవాలి?    
షారుఖ్: నిజమే! జీవితం అందించిన వాటి  గురించి చాలా హ్యాపీగా ఉన్నా... అయితే నేను పనిచేస్తోంది ఎగ్జయిట్‌మెంట్ కోసం! కొత్త విషయాలతోనే ఆ ఎగ్జయిట్‌మెంట్ వస్తుంది! ప్రొడ్యూసర్‌ని అయినా, కొత్త కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్నా... ఇదంతా అందుకే! ఈ ప్రస్థానంలో... ఐ స్టార్టెడ్ ఫీల్ ఇంపార్టెంట్. అంతే తప్ప ఎవరికో ప్రూవ్ చేయడం కోసం కాదు. కాలం ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు మోసుకొస్తోంది. వాటిని అందుకోవాలి. పొద్దున్నే ఎగ్జయిట్‌మెంట్‌తో లేవాలి.
 
నేనెప్పుడూ నన్ను నేను నిరూపించుకోవడానికి పని చేయలేదు. అసలు నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? దాదాపు పదిహేనేళ్లుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా జీవితం ఒకలాగే ఉంది. లోయర్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ మాది. ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చేటప్పటికి హిందీ సినిమా అంటేనే  తెలీదు. కొన్ని సంవత్సరాల కెరీర్ తర్వాత...నేనొక స్టార్‌ని అనే విషయం నాకు అర్థమైంది. ముంబయిలో జాలర్లు నివసించే చిన్న కాలనీలో ఉన్న నేనే ఇప్పుడు అత్యంత ఖరీదైన ఇండియన్ మూవీని రూపొందించాను.
 
ఒక్కోసారి నా భార్య, పిల్లలూ కూడా అంటుంటారు... ‘ఎందుకు ఇదంతా? అవసరమా?’ అని! కాని నేనేం చేయను? విశ్రాంతినీ, పని లేకపోవడాన్నీ ఊహించలేను. విచిత్రమేమిటంటే... కొన్ని రోజుల పాటు పని లేకపోతే... మా అమ్మాయే నన్ను అడుగుతుంది - ‘నువ్వు పనిచేయడం లేదేంటి’ అని! పని లేకపోతే ఏం చేయాలో నాకు తెలీదు. అవును. నేను పనికి ఎడిక్ట్ అయిపోయాను. పనిలోని ఒత్తిడిని బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. ఈ మధ్యే షోల్డర్ విరిగింది. షూస్ వేసుకోవడానికి కూడా చేయి సహకరించట్లేదు. అయినా పనిచేయడానికే ఇష్టపడతాను. తప్పక రెస్ట్ అంటూ తీసుకోవలసిన సందర్భం వస్తే... పుస్తకాలు బాగా చదువుతాను. బాత్‌రూమ్‌లో, కారులో కూడా చదువుతాను.
 
ఐయామ్ ది బెస్ట్...
షారుఖ్: ముంబయిలో 24 సంవత్సరాల క్రితం నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడే ‘ఐయామ్ ది బెస్ట్’ అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పటికీ అంతే! ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముతూ నిద్ర లేస్తేనే పని చేయగలం. లేకపోతే లేదు. అప్పుడే హ్యాపీగా ఉంటుంది. ఆ ఫిలాసఫీని అనుసరించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పనిని ఎంజాయ్ చేయగలుగుతున్నా. అక్కడ నుంచి ఇక ఒత్తిడి లేదు. ఐ ఫీల్ హ్యాపీ మీటింగ్ పీపుల్...  ఐ ఫీల్ హ్యాపీ షేరింగ్ దిస్ వండర్ ఫుల్ లైఫ్ విత్ పీపుల్! దటీజ్ వై.. దేరీజ్ నో ప్రెషర్!
 
ఇష్టపడి మాత్రమే చేశా..!
షారుఖ్: అటు సినిమాలు, ఇటు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) విజయం, ఇంటర్నేషనల్ అవార్డ్స్... ఇవన్నీ ఈ ఏడాది నన్ను సక్సెస్‌ఫుల్ చేశాయి. అంత మాత్రాన అన్నీ బావున్నాయనీ, నేనిప్పుడు పని మానేయాలనీ అనుకోను. నేనేది చేసినా దాన్ని ఇష్టపడి చేశా. ఏది చేసినా నాకు ఇష్టమైన ప్రయత్నం అయితేనే చేశా. డబ్బు కోసం ఏదీ చేయలేదు. నిజానికి ఒక బిజినెస్ వెంచర్‌గా చూసినట్టయితే కెకెఆర్ సక్సెస్ అయ్యేది కాదు. ఈ వెంచర్‌లో సక్సెస్ చూడడానికి ఐదేళ్లు పట్టింది. రెండుసార్లు చాంపియన్‌షిప్‌లు గెలిచాక... ఎండార్స్‌మెంట్స్ వచ్చాయి. బిజినెస్‌పర్సన్‌గా అయితే ఈ వెయిటింగ్ చేసుండేవాణ్ణి కాను. నేను డబ్బు సంపాదించాలని క్రికెట్‌తో అనుబంధం పెట్టుకోలేదు. ప్రారంభంలో దెబ్బతిన్నా. తరువాత గెలిచా. ఆలస్యమైనా... విజయం అనేది ఒక స్వీటెస్ట్ థింగ్!
 
విజయానికి గ్యారెంటీ ఇవ్వలేం!
షారుఖ్: సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌ను అడిగితే... చాలా మంది క్రాఫ్ట్ చెప్పగలరు. టెక్నిక్ చెప్పగలరు. అయితే అందులోని సారం మాత్రం చెప్పలేరు. నా సక్సెస్ విషయంలో ఐ రియల్లీ హ్యావ్ నో ఐడియా. కొన్నేళ్లు వెనక్కివెళ్లి, ‘నేను అలా చేశా కాబట్టి ఇలా అయింది. ఆ టైమ్‌లో ఇలా చేయకపోయుంటే...’ వంటి సూత్రాల్ని చెప్పలేను. నేను చేసిందే చెయ్యమంటూ నా పిల్లలకు కూడా చెప్పలేను. ఎందుకంటే సక్సెస్‌కు అస్యూరెన్స్ ఇవ్వలేం. ఏ మార్గాన్ని అనుసరిస్తే సక్సెస్ వస్తుందో కచ్చితంగా చెప్పలేం. చాలామంది తిరస్కరించిన ప్రాజెక్ట్స్ నేను ఓకె చేస్తే సూపర్‌హిట్ అయ్యాయి.
 
కెకెఆర్ విషయంలోనూ చాలామంది అది నాకు అనవసరం అన్నారు. చేయలేను అన్నారు. అయితే నాకో మార్పు కావాలి. అంతే నేను యాక్సెప్ట్ చేశా. సరైన టైమ్‌కి అక్కడ ఉండడం ఇంపార్టెంట్. రైట్ ఫిల్మ్, రైట్ డెరైక్టర్, రైట్ టీమ్, ఐ వజ్ ఎ రైట్ గై ఫర్ రైట్ ప్లేస్! అంతే! నా స్టోరీ ఇతరులకు ఏం నేర్పుతుందో గానీ, దాని నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే జీవితంలో ఏదీ అంతిమం కాదు! ఫెయిల్యూర్, సక్సెస్ - రెండూ అంతే!
 
ప్రజలకు కావాల్సినదేదో చేయాలి!
షారుఖ్: నాకో మంచి ఇల్లు, ఫ్యామిలీ, గ్రేట్ ఆఫీస్, సరిపడినంత డబ్బు... దేవుడు ఇచ్చాడు. అదృష్టం ఇచ్చింది. జనం ఇచ్చారు. అయితే ఇవి చాలని నేను అనుకోను. నేను ఇది మాత్రమే సక్సెస్ అనుకోను. ఇంకా ఎంతో చేయాలి. తీసుకున్నదానికి ప్రతిఫలంగా వెనక్కి ఇవ్వాలి. ఇక్కడ గొప్ప టెక్నాలజీ సృష్టించాలి. ఒక గొప్ప స్టూడియో కట్టాలి. సక్సెస్ అంటే నేనేదైనా కొత్తది కనుగొన్నప్పుడే! నా తర్వాత కూడా అది బతికుండాలి! సేఫ్టీ పిన్‌ని కనిపెట్టిన జంటిల్మన్ సక్సెస్‌ఫుల్ అని నేననుకుంటాను. జస్ట్... కేవలం రెండున్నరగంటల ఎంటర్‌టైన్‌మెంట్ పీస్‌లా మాత్రమే నేను ఉండదలచుకోలేదు. ప్రజలకు కావాల్సిందేదో నేను చేయగలగాలి. అదేమిటో నాకు స్పష్టత లేదు. అయితే  చేయగలను అని నమ్మకం ఉంది. అలాగని రాజకీయాలంటే అంటే... నో! దానికి మరీ మంచితనం కావాలి. అది నా వల్ల కాదు (నవ్వులు). ఒక 20 సంవత్సరాల తర్వాత నా నటన గురించి కొత్తగా మీరు చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. అదే నేను రంగుల సినిమాను కొత్తగా సృష్టించాననుకోండి... ‘అదిగో షారుఖ్స్ క్రియేషన్’ అంటారు. నా రంగంలో నేను మీకో కొత్త అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాను.  క్రీడల విషయంలో కూడా నా వంతుగా ఏమైనా చేయాలనుకుంటున్నాను.
 
కమర్షియలైజ్... అయితే తప్పేంటి?
షారుఖ్: మనందరికీ మనం ఏం చేయగలమో తెలుసు. వరల్డ్ ఈజ్ బెస్ట్ ప్లేస్ టు లివ్. మంచి ఉద్దేశంతో కమర్షియలైజ్ చేయడంలో తప్పు లేదంటాను. మంచి ఫిల్మ్‌మేకర్ ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. కొందరు వారి వర్క్ చూడాలి. కొందరు కొనాలి. కొందరు వర్క్ ఇవ్వాలి. ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీలు. కాబట్టి, తప్పదు. కంఫర్టబుల్ ఎర్నింగ్ ఉంటేనే ఇదంతా చేయగలం. ముందు మీరు కంఫర్టబుల్‌గా ఉంటేనే అప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేయగలరు. మీరనుకున్న మంచి పనులు చేయగలరు. సినిమాలైనా, స్పోర్ట్స్ అయినా అంతే! కమర్షియలైజ్ కాకపోతే వర్ధమాన క్రీడాకారులకు కెరీర్ ఎలా ఇస్తాం? నా మటుకు నేను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను అవ్వాలనుకున్నా. కానీ, అవలేకపోయా. అందుకే, ఇలాంటివన్నీ చేస్తుంటా! అయినా, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా క్రీడలకు సరైన ప్రొఫెషనల్ స్కూల్స్ లేవంటే.. అర్థం ఏమిటి? కాబట్టి, మంచి చేయాలంటే కమర్షియలైజ్ చేయాల్సిందే! అయితే ఇదంతా క్యాపిటలిస్ట్‌గా నేను మాట్లాడడడం లేదు. ఆ సంగతి గ్రహించండి.
 
గౌరి బెస్ట్ పార్ట్‌నర్!
షారుఖ్: నా భార్య గౌరి మంచి పార్ట్‌నర్. ఆమె చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడామె ఇంటీరియర్ డిజైనర్‌గా మారి, స్టోర్ స్టార్ట్ చేసింది. బిజినెస్‌పరంగా తనకేమైనా టిప్స్ ఇస్తారా అంటే... ఇంట్లో ఇద్దరం ఉన్నప్పుడు నో బిజినెస్. చెప్పాను కదా... మాది చాలా మిడిల్‌క్లాస్ మెంటాలిటీ! చేతి నిండా పని వల్ల ఇంట్లో నేనెక్కువ సమయం గడపలేను. ఒంటరిగా, విసుగుపుడుతూ ఉండకుండా ఓ హాబీలా ఈ స్టోర్‌ను ప్రారంభించింది. అయితే  అదేదో పెద్ద స్టోర్ కావాలనో, మరొకటో అనుకోవడం లేదు. షారుఖ్ కూడా ఇందులో భాగం కావాలనుకోవడం లేదు.
 
‘కోట్ల’ ఆటలో వాస్తవం లేదు!
షారుఖ్: నిజంగా సినిమాలకు వందల కోట్ల వసూళ్ళ గురించి, 500 కోట్ల క్లబ్ గురించి మనలో ఎవరం ఆలోచించగలం? పత్రికల వాళ్ళు ఏదో రాస్తుంటారు. నిజానికి అందరూ మాట్లాడే ఈ వందల కోట్లు అనేది గ్రాస్ కలెక్షన్ గురించి! అందులో నుంచి 52 శాతం థియేటర్ ఛార్జీలు, 12 శాతం పన్నులు, అవికాక డిస్ట్రిబ్యూటర్ కమిషన్లు - ఇవన్నీ తీసేసి వాస్తవంగా లెక్కిస్తే... ఈ కోట్ల మూటలంతా డొల్లేనని తెలుస్తుంది. నా వరకూ నా లక్ష్యం ఏమిటంటే... అత్యధిక సంఖ్యాకులు వచ్చి, నా సినిమా చూస్తే చాలు. అంతే! ఈ నంబర్లు కాదు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ మాత్రమే నేను చూసుకోవాలి. దీన్ని చూడడానికి ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్లో 240 మంది పనిచేస్తున్నారు.
 
మహిళలకు మర్యాద ఇవ్వాలి...
షారుఖ్: ఐ ప్రిఫర్ టు వర్క్ విత్ ఉమెన్... ఎందుకంటే వాళ్లు బాగా హార్డ్ వర్కింగ్! బాగా డిటైల్డ్. ఒక గుమ్మం ముందు మహిళ నుంచుంటే వెంటనే తలుపు తీసి రమ్మంటాం. అదేదో వాళ్లు బలహీనమనో, సానుభూతితోనో కాదు. మన మనసుల్లో మహిళకు ఎప్పుడూ గౌరవం ఉంది. ఇవ్వాలి కూడా. నా తల్లి, సిస్టర్... వీళ్లందరితో నేనలాగే పెరిగాను. నా సినిమాల్లో  హీరోతో పాటు తగినంత పాత్ర హీరోయిన్‌కీఉండాలనుకుంటాను. అలాగే నా ఆఫీస్‌లో, నాతో పనిచేసేవాళ్లలో చాలా మంది మహిళలున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం అత్యవసరం. బయట జరిగే చాలా సంఘటనలు చూస్తున్నాం. ప్రపంచం మొత్తాన్నీ మార్చలేకపోయినా... మన వంతుగా వాళ్లకు గౌరవం ఇవ్వడాన్ని బాధ్యతగా భావించాలి.
 
ప్యాక్... లుక్స్ వరకే!
షారుఖ్: నిజంగా చెప్పాలంటే ఏ సినిమాకీ సిక్స్ ప్యాక్ అవసరం లేదు. ‘ఓం శాంతి ఓం’లో హీరో ముతకభాష మాట్లాడతాడు. బస్తీల్లో ఉంటాడు.  హీరో అవ్వాలనుకుంటాడు. కరకుగా కనిపించాలి అని వర్కవుట్ చేశాను. అంతేకాకుండా నాకు స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. దాని కోసం వర్కవుట్ చేస్తుంటే వెరీ స్ట్రాంగ్ యాబ్స్ వచ్చాయి. వర్కవుట్ టైమ్‌లో కొందరికి బైసప్స్, కొందరికి చెస్ట్ ఇలా... ఒక్కొక్కరికీ ఒక్కోటి బాగా స్పందిస్తాయి. అలాగే నాకు యాబ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. దాంతో ప్యాక్ మీద కాన్సన్‌ట్రేట్ చేశాను. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో కూడా పాత్రకు తగ్గట్టుగా రఫ్‌గా కనపడే ప్రయత్నంలో ప్యాక్‌ను ప్రదర్శించా.
 
పిల్లల కోసమే ప్రార్థిస్తుంటా..!
షారుఖ్: ఫేమస్ అయిన పబ్లిక్ ఫిగర్ అంటే... అడ్వాంటేజ్‌లతో పాటు డిజెట్వాంటేజ్‌లూ ఉంటాయి. నాకు 14 మంది కాప్స్, ముగ్గురు సెక్యూరిటీ గార్డ్‌లు ఉన్నారు. నిజానికి నేను జనాన్ని ఇష్టపడతాను. వారిని ప్రేమిస్తాను. వారికి దూరంగా ఉండడం నచ్చదు. కానీ తప్పదు. ఒక్కోసారి గుంపును కంట్రోల్ చేయలేం కదా! నా పిల్లలు ఈ పరిస్థితుల మధ్య ఇబ్బంది పడతారు.  వాళ్లు కూడా నా లాగా టీనేజ్‌లో ఒక సాధారణ జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలి. యుక్తవయసులో ఎలాగైతే సాధారణ జీవితాన్ని నేను అనుభవించానో వాళ్లు కూడా అదే అనుభవించాలి. బస్సుల్లో, రోడ్ల మీద స్వేచ్ఛగా నడవాలి. అందుకే దూరంగా విదేశాల్లో ఉంచి చదివిస్తున్నాను. దేవుడికి చేసే ప్రార్థన ఏదైనా ఉంటే, అది నా కోసం కాదు - నా పిల్లల కోసం మాత్రమే ప్రార్థిస్తాను. వాళ్లు బాగుంటే, వాళ్లు సంతోషంగా ఉంటే మనకు అన్నీ బాగున్నట్టే! ‘హ్యాపీ న్యూ ఇయర్’ చివరలో టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చివరి పాటలో మొత్తం కాస్టింగ్ అంతా ఉంటుంది. పిల్లలూ ఉంటారు. అదే సమయానికి అక్కడ ఉండడంతో మా అబ్బాయి అబ్‌రామ్ (సరోగసీ ద్వారా కన్న బిడ్డ)ని కూడా పెడదామని (దర్శకురాలు) ఫరా (ఖాన్) అంటే ఓకె అన్నాను. ఇప్పుడా సీన్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది.
 
సిగరె ట్... బ్యాడ్ హ్యాబిట్...
షారుఖ్: స్మోకింగ్ రియల్లీ... బ్యాడ్ హ్యాబిట్! నేను మానాలనుకున్నా మానలేకుండా పిల్లల దగ్గర సైతం రెగ్యులర్‌గా చేసే పని - స్మోకింగ్! పబ్లిక్ స్పేస్‌లలో కూడా నేను కంట్రోల్ తప్పుతున్నా. దీన్ని వదలకుండా నేనేం చెప్పినా లాభం ఏముంది? ఎప్పుడైతే నేను దీన్ని వదిలేస్తానో, అప్పుడు తప్పకుండా ‘సారీ’ చెబుతాను. ఇక ఆహారం విషయానికొస్తే, వేళ కాని వేళల్లో తింటాను. బాగా బ్లాక్ కాఫీ తాగుతాను. నా పనివేళలు కూడా కరెక్ట్ కాదు. అయినా ఇప్పటికీ, నేను రోజుకు తక్కువ గంటలు మాత్రమే నిద్రపోతూ హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాను. చాలా యంగ్‌గా ఉన్నప్పుడే  రాత్రిపూట నిద్రపోకుండా చదవడానికి వీలుగా బ్లాక్  కాఫీ తాగడం మొదలుపెట్టాను. అది ఇప్పటికీ వదలడం లేదు.  చెయిన్‌స్మోకర్స్‌కు భిన్నంగా... చాలా ఆలస్యంగా, 26 ఏళ్ళ వయసులో తొలి సిగరెట్ తాగా! చిన్నప్పటి నుంచి ఆటలు బాగా ఆడేవాణ్ణి. ఆరోగ్యంగా ఉండాలనుకునేవాణ్ణి. అందుకే తొలిరోజుల్లో సిగరెట్ ఆలోచన రాలేదేమో! ముంబయికి వచ్చాక, రంగస్థలంలో కాలుమోపాక... అప్పుడు స్మోకింగ్ స్టార్ట్ చేశా. సినిమాల విడుదలకు ముందు టెన్షన్ వల్ల స్మోకింగ్ మరీ తీవ్రంగా మారుతుందా అని అడిగితే, అప్పుడే కాదు... ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుందని చెప్పగలను! (నవ్వులు)
 
అవకాశం ఎప్పుడూ ఉంటుంది...
షారుఖ్: ప్రేక్షకులకు చిన్న సందేశమైనా లేకుండా నేనే సినిమా చేయలేదు. కొన్నిసార్లు ఎంటర్‌టైన్‌మెంట్ హోరులో  మన సందేశం హైలెట్ కాక పోవచ్చు. జీవితంలో నువ్వు కొన్ని కోల్పోతూనే ఉన్నా... మరెన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఓర్పు ఉంటే జీవితం నీకు అవకాశం తప్పక ఇస్తుంది.  నా తాజా చిత్రం, జీవితం చెప్పే సందేశం అదే!
 
- ఎస్. సత్యబాబు
 
ఇంటికెళితే స్విచ్చాఫ్...
పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు కరణ్ (జోహార్), సుస్మిత (సేన్) - ఇలా అందరూ సినిమా వాళ్లే వచ్చేవారు ఇంటికి. దాంతో మనుషులంతా సినిమావాళ్లే అనుకునేవారు నా పిల్లలు. నా కారు ఎక్కడ ఆగినా జనం వచ్చి గుమిగూడేవారు. దాంతో  భయపడేవారు. స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళే సమయంలో మా అమ్మాయి ఒక మాట అడిగింది... ‘‘మా క్లాస్‌మేట్స్ వాళ్ళ ఫాదర్స్‌ను అంతా ‘రాహుల్స్ ఫాదర్, రాధికాస్ పాపా’ అని అంటారు. కానీ, నన్ను మాత్రం ‘షారుఖ్స్ డాటర్’ అంటారేమిటి? అని!’’ పిల్లలపై తల్లితండ్రుల సూపర్‌స్టార్ షాడో ఉండదా - అంటే ఉంటుంది. తప్పదు. ఆ ప్రభావంతో సహా బతకడం వాళ్లు నేర్చుకోవాల్సిందే! ఇలాంటి సమస్యకు పరిష్కారంగా ఇంటికి వెళ్లాక సినిమాకు దూరమవడం అలవాటు చేసుకున్నా. ఇంటి నుంచి పనిచేయను. సినిమాల గురించి, నా షూటింగ్ గురించి ఇంట్లో మాట్లాడను. నేనీ రోజు ఒక గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చాననో, ఇంకేదో ఎక్స్‌పీరియన్స్ అంటూ వారితో పంచుకోను. ఎప్పుడైతే నేను నా కుటుంబంతో ఉంటానో అప్పుడు వారి మనిషిని. అంతే! ఇంక ఏమీ మనసులోకి రానీయను. నేనో స్టార్‌ని అనే భావనే రానీయను.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement