వండర్ బుక్ లో సాహస వీరుడు
హిమాయత్‌నగర్: ఒక కర్ర ముక్క తగిలితేనే ధారగా రక్తం కారుతుండటం మనం చూస్తేనే ఉంటాం. అలాంటిది ఓ యువకుడు పదునైన 5 అంగుళాల మేకును ముక్కులోకి దింపుకొంటే... పైగా దానిపై సుత్తితో కొడితే.. ఆలోచిస్తేనే ఎంత భయంకరంగా ఉంటుంది. అక్కడితో ఆగకుండా గోడలకు రంధ్రాలు చేసే డ్రిల్లింగ్ మిషన్‌తో అదే ముక్కులో డ్రిలింగ్ చేసుకుంటే... ఇంతకీ ఈ సాహసానికి పూనుకున్నది ఎవరనుకుంటున్నారా ఆ యువకుడు నల్గొండ జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్.
ప్రపంచంలోనే ఇలాంటి కఠినమైన సాహసాలు చేసేవారిలో ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు. తన సాహసాలతో క్రాంతి కుమార్ వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా చోటు దక్కించుకున్నాడు. శుక్రవారం హిమాయత్‌నగర్ మీడియా సెంటర్‌లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ దక్షిణ భారత సమన్వయ కర్త బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఏపీ సమన్వయ కర్త గుర్రం స్వర్ణశ్రీ తదితరులు, విలేకరుల ముందు ఈ ప్రదర్శన చేసి అందర్నీ అబ్బుర పరిచాడు. క్రాంతి కుమార్ ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు మెమొంటో, గోల్డ్ మెడల్‌ను బహూకరించారు.
ఈ కార్యక్రమానికి లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ డెరైక్టర్ డాక్టర్ కోమట్‌రెడ్డి గోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రాంతికుమార్ సాహసాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ అరుదుగా కనిపించే ఇలాంటి సాహసవంతులను ప్రభుత్వం ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా సాహస విన్యాసాన్ని ప్రదర్శించిన యువకుడు క్రాంతికుమార్ రోజు వారీ కూలీగా వాల్ పెయింటింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.