అలలు అలలుగా తెరలు తెరలుగా తరగలు తరగలుగా ఎగిసిపడిన కెరటాలుగా నల్ల సముద్రం , నీలి సంద్రం ఎర్ర సముద్రం మొత్తంగా సప్త సముద్రాలు వాటి లోతు తెలిసేలా , వాటి ఆటుపోట్లను అర్థం చేసుకునేలా అన్నింటిని చుట్టేస్తూ ఆమె తన కలల ప్రయాణానికి సిద్ధమైంది. పాఠాలు చెప్పే ఆ పంతులమ్మ జీవిత చరమాంకంలో సముద్ర ఘోష వింటూ తన అనుభూతులకి అక్షరరూపమివ్వాలని ఆశపడుతోంది.
హాయిగా మనవలు, మనవరాళ్లతో కాలం గడిపే వయసు. ఏ బాదర బందీ లేకుండా ఎవరో వండిపెడితే తింటూ కాలం గడిపే వయసు. అయినా ఆమెలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. సర్వస్వతంత్రంగా వ్యవహరించే ఆమె తనకున్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు. ఎం.వి.జెమిని అనే నౌకలో ప్రపంచ యాత్ర చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షరాన్ లేన్. ఇప్పుడు ఆమె వయసు 75 ఏళ్లు. హైస్కూలు రిటైర్డ్ టీచర్. చిన్నప్పట్నుంచి ప్రయాణాలంటే ఆమెకు చాలా ఇష్టం.
అడ్వంచర్స్ అంటే చెప్పలేనంత థ్రిల్. స్కూల్లో విదేశీ భాషలు బోధించేవారు. స్కూలు పిల్లల్ని తీసుకొని యూరప్ దేశాలన్నీ చుట్టేసి వచ్చారు. అయినా ఆమెకు లైఫ్‌లో ఏదో అసంతృప్తి. ఇంకొన్ని దేశాలు తిరగాలి. అక్కడ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలుసుకోవాలి. సరికొత్త రుచులు చవి చూడాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. జీవితంలో అనుక్షణం కొత్తదనం కోసం పరితపించే లేన్‌కు ఎంవి.జెమిని అనే నౌక ప్రయాణం ఒక చుక్కానిలా కనిపించింది. ఈ నౌక ప్రపంచాన్ని చుట్టి వస్తుందని సన్నిహితులు చెబితే తెలుసుకున్నారు.
ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా మూడేళ్లు నౌక ప్రయాణం. ఆ నౌకలో అత్యంత తక్కువ ధరకి లభించే ఒక చిన్న కేబిన్‌లాంటి గదికి ఏడాదికి 30 వేల డాలర్లు చెల్లించాలి. తన ఆస్తిపాస్తుల్ని అమ్మేస్తే మూడేళ్లకి సరిపడా డబ్బులు వచ్చేస్తాయని ఆ గది బుక్ చేసుకున్నారు. ఆ చిన్న గదికి కనీసం కిటికీ కూడా ఉండదు. కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. అదే మహద్భాగ్యంగా భావించారు. నవంబర్ 1 నుంచి ఈ నౌక ప్రయాణం ప్రారంభమవుతుంది.
కూతురికి చెబితే ఏమంటుందోనని ఆమెకి మాట మాత్రంగానైనా చెప్పలేదు. గాలి, ఎండ సోకని ఆ గదిలో కేవలం రాత్రి పూట మాత్రమే గడిపి మిగిలిన సమయమంతా తనకెంతో ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ గడిపేస్తానని చెబుతున్నారు. నౌకలో తోటి ప్రయాణికులతో మాటలు కలపడం, కొత్త స్నేహితుల్ని చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టమే. మొత్తం మూడేళ్ల పాటు సాగే ప్రయాణంలో ఎంవి జెమిని నౌక 375 రేవు పట్టణాల్లో ఆగుతుంది. ఇండియా నుంచి చైనా, మాల్దీవ్స్, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు తిరుగుతుంది.
‘‘నాకున్న లక్ష్యం ఒక్కటే. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నా బ్లాగ్‌లో రాయాలి. కలం పేరుతో ఒక బ్లాగ్‌ను ఏర్పాటు చేసి అందులో నా అనుభవాలన్నీ కథలుగా రాస్తాను. ఎవరైనా నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది. పది మందిలో తిరిగితేనే జీవితంపై అవగాహన వస్తుంది. అందులోనూ సముద్రాన్ని చూస్తూ ప్రయాణమంటే అదో అవధుల్లేని అనుభూతి. ఇల్లంటే మన మనసుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమే కావొచ్చు. కానీ విమానమో, పడవో, రైలో ఏదో ఒకటి ఎక్కి బయట ప్రపంచాన్ని చూడండి.
అదెంత అద్భుతంగా ఉంటుందో’’ అని లేన్ తన మనసులో మాట వెల్లడించారు. మూడేళ్లంటే తక్కువ కాలం ఏమీ కాదు. అందులోనూ కరోనా సోకిన తర్వాత ఆమె శ్వాసకోశ సంంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయినా కూడా ఆమె దేనికీ భయపడట్లేదు. ఇల్లు కంటే పడవే పదిలమంటున్నారు. తాను ప్రయాణించే పడవలో కూడా అనారోగ్యం వస్తే చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా ఒంటరి ప్రయాణం ఆమెకు కొత్తేం కాదు. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడీ ప్రయాణం ఆమెలో ఉత్సాహాన్ని నింపి వయసుని మరింత తగ్గించింది. మరి మనమూ లేన్‌కి హ్యాపీ జర్నీ చెప్పేద్దాం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment