Sea Travel
-
కలల అలలపై... అలలు అలలుగా
అలలు అలలుగా తెరలు తెరలుగా తరగలు తరగలుగా ఎగిసిపడిన కెరటాలుగా నల్ల సముద్రం , నీలి సంద్రం ఎర్ర సముద్రం మొత్తంగా సప్త సముద్రాలు వాటి లోతు తెలిసేలా , వాటి ఆటుపోట్లను అర్థం చేసుకునేలా అన్నింటిని చుట్టేస్తూ ఆమె తన కలల ప్రయాణానికి సిద్ధమైంది. పాఠాలు చెప్పే ఆ పంతులమ్మ జీవిత చరమాంకంలో సముద్ర ఘోష వింటూ తన అనుభూతులకి అక్షరరూపమివ్వాలని ఆశపడుతోంది. హాయిగా మనవలు, మనవరాళ్లతో కాలం గడిపే వయసు. ఏ బాదర బందీ లేకుండా ఎవరో వండిపెడితే తింటూ కాలం గడిపే వయసు. అయినా ఆమెలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. సర్వస్వతంత్రంగా వ్యవహరించే ఆమె తనకున్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు. ఎం.వి.జెమిని అనే నౌకలో ప్రపంచ యాత్ర చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షరాన్ లేన్. ఇప్పుడు ఆమె వయసు 75 ఏళ్లు. హైస్కూలు రిటైర్డ్ టీచర్. చిన్నప్పట్నుంచి ప్రయాణాలంటే ఆమెకు చాలా ఇష్టం. అడ్వంచర్స్ అంటే చెప్పలేనంత థ్రిల్. స్కూల్లో విదేశీ భాషలు బోధించేవారు. స్కూలు పిల్లల్ని తీసుకొని యూరప్ దేశాలన్నీ చుట్టేసి వచ్చారు. అయినా ఆమెకు లైఫ్‌లో ఏదో అసంతృప్తి. ఇంకొన్ని దేశాలు తిరగాలి. అక్కడ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలుసుకోవాలి. సరికొత్త రుచులు చవి చూడాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. జీవితంలో అనుక్షణం కొత్తదనం కోసం పరితపించే లేన్‌కు ఎంవి.జెమిని అనే నౌక ప్రయాణం ఒక చుక్కానిలా కనిపించింది. ఈ నౌక ప్రపంచాన్ని చుట్టి వస్తుందని సన్నిహితులు చెబితే తెలుసుకున్నారు. ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా మూడేళ్లు నౌక ప్రయాణం. ఆ నౌకలో అత్యంత తక్కువ ధరకి లభించే ఒక చిన్న కేబిన్లాంటి గదికి ఏడాదికి 30 వేల డాలర్లు చెల్లించాలి. తన ఆస్తిపాస్తుల్ని అమ్మేస్తే మూడేళ్లకి సరిపడా డబ్బులు వచ్చేస్తాయని ఆ గది బుక్ చేసుకున్నారు. ఆ చిన్న గదికి కనీసం కిటికీ కూడా ఉండదు. కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. అదే మహద్భాగ్యంగా భావించారు. నవంబర్ 1 నుంచి ఈ నౌక ప్రయాణం ప్రారంభమవుతుంది. కూతురికి చెబితే ఏమంటుందోనని ఆమెకి మాట మాత్రంగానైనా చెప్పలేదు. గాలి, ఎండ సోకని ఆ గదిలో కేవలం రాత్రి పూట మాత్రమే గడిపి మిగిలిన సమయమంతా తనకెంతో ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ గడిపేస్తానని చెబుతున్నారు. నౌకలో తోటి ప్రయాణికులతో మాటలు కలపడం, కొత్త స్నేహితుల్ని చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టమే. మొత్తం మూడేళ్ల పాటు సాగే ప్రయాణంలో ఎంవి జెమిని నౌక 375 రేవు పట్టణాల్లో ఆగుతుంది. ఇండియా నుంచి చైనా, మాల్దీవ్స్, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు తిరుగుతుంది. ‘‘నాకున్న లక్ష్యం ఒక్కటే. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నా బ్లాగ్‌లో రాయాలి. కలం పేరుతో ఒక బ్లాగ్‌ను ఏర్పాటు చేసి అందులో నా అనుభవాలన్నీ కథలుగా రాస్తాను. ఎవరైనా నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది. పది మందిలో తిరిగితేనే జీవితంపై అవగాహన వస్తుంది. అందులోనూ సముద్రాన్ని చూస్తూ ప్రయాణమంటే అదో అవధుల్లేని అనుభూతి. ఇల్లంటే మన మనసుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమే కావొచ్చు. కానీ విమానమో, పడవో, రైలో ఏదో ఒకటి ఎక్కి బయట ప్రపంచాన్ని చూడండి. అదెంత అద్భుతంగా ఉంటుందో’’ అని లేన్ తన మనసులో మాట వెల్లడించారు. మూడేళ్లంటే తక్కువ కాలం ఏమీ కాదు. అందులోనూ కరోనా సోకిన తర్వాత ఆమె శ్వాసకోశ సంంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయినా కూడా ఆమె దేనికీ భయపడట్లేదు. ఇల్లు కంటే పడవే పదిలమంటున్నారు. తాను ప్రయాణించే పడవలో కూడా అనారోగ్యం వస్తే చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా ఒంటరి ప్రయాణం ఆమెకు కొత్తేం కాదు. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడీ ప్రయాణం ఆమెలో ఉత్సాహాన్ని నింపి వయసుని మరింత తగ్గించింది. మరి మనమూ లేన్‌కి హ్యాపీ జర్నీ చెప్పేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
షిప్లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్మెంట్లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?
నేల మీద ఉండీ ఉండీ బోర్ కొట్టిందా. కాస్త వెరైటీగా సముద్రంలో ఇల్లు కట్టుకొని ఉంటే భలే ఉంటుందని అనుకుంటున్నారా. అయితే మీ కోసం ఓ గుడ్ న్యూస్! సముద్రంలో ఉండటమే కాదు. బోర్ కొడితే నీళ్లలో అలా ఓ చుట్టు చుట్టేసి కూడా వచ్చేలా ఇళ్లు సిద్ధమవుతున్నాయి. అదెలా.. అనుకుంటున్నారా. ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ రూ. 2.7 కోట్ల నుంచి మొదలు ఫ్లోరిడాకు చెందిన స్టోరీ లైన్స్ కంపెనీ ‘ఎంవీ నరేటివ్’పేరుతో లగ్జరీ క్రూయిజ్ షిప్‌ను నిర్మిస్తోంది. 2024 కల్లా ఇది అందుబాటులోకి రానుంది. షిప్లో ఒకటి నుంచి నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లు, స్టూడియోలు కలిపి మొత్తం 547 నిర్మిస్తోంది. వీటినే తాజాగా అమ్మకానికి పెట్టింది. వీటి ధర రూ.2.7 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇంటి పరిమాణం, ఇంట్లోని వస్తువులను బట్టి ధర పెరుగుతుంటుంది. ఇళ్లను 12, 24 ఏళ్లకు అద్దెకు కూడా ఇస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది. (చదవండి: కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!) ఇంటికి కావాల్సినవన్నీ అందుబాటులో.. ప్రతి అపార్ట్మెంట్లో ఇంట్లో ఉండటానికి కావాల్సిన ఫర్నిచరంతా ఉంటుంది. ఇటాలియన్ ఇంటీరియర్ డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తుంది. కిచెన్, టీవీలు, ఇంట్లో వేడి, చలి నియంత్రణ వ్యవస్థలు, మూడ్‌కు తగ్గట్టు కాంతి రంగులను మార్చుకునే వెసులుబాటు ఉంది. షిప్లో మొత్తం 20 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా ఆర్డర్ చేసుకునేలా 24 గంటల హోమ్ డెలివరీ వెసులుబాటు ఉంది. వినోదం కోసం ఓ సినిమా హాలు, బీర్లు అమ్మే చిన్న మైక్రో బ్రూవరీ, 3 స్విమ్మింగ్ పూల్స్, 10 వేల పుస్తకాలున్న లైబ్రరీ, స్పా, వెల్నెస్ సెంటర్, యోగా స్టూడియో కూడా ఉన్నాయి. అలాగే గోల్ఫ్ సిములేటర్, డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. షిప్లో ఉండే వాళ్లు చెస్, ఫొటోగ్రఫీలాంటి క్లబ్‌లుగా ఏర్పడి ఆడుకోవచ్చు. ఈ షిప్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అక్కడి పోర్టుల్లో దాదాపు 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రదేశాలను తిరిగి రావొచ్చు. షిప్ ఎక్కడికెళ్లాలి, ఎక్కడ ఆగాలో షిప్‌లోని వాళ్లు ముందే నిర్ణయించుకోవచ్చు కూడా. (చదవండి: వారిని విడుదల చేయండి!) -
మృత్యుంజయులు
వజ్రపుకొత్తూరు : బోటులో డీజిల్ లేదు. ఎటు వెళుతోందో తెలిపే దిక్సూచి పనిచేయట్లేదు. చుట్టూ రాకాసి అలలు.. ఎటుచూసినా తమను మింగేసేందుకు ఎగసిపడుతున్న సముద్ర ఆటుపోట్లు! అలలు ఎగసిపడుతున్నా మనోధైర్యం చెక్కుచెదరకుండా.. గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని సంద్రంపై కఠిన ప్రయాణం చేశారు. ఏ ప్రాంతంలో ఉన్నామో తెలియక ఆ మత్స్యకారులు నిద్రలేని రాత్రులు గడిపారు. వెంట తెచ్చుకున్న ఆహారమంతా పాడైపోయినా.. అదరలేదు. క్షణక్షణం.. భయంభయంగా నిశిరాత్రులు గడిపిన ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజుల పాటు సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన కాకినాడ మున్సిపాలిటీ పరిధి దుమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు గరువారం సాయంత్రం 4.30 గంటలకు వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట సముద్ర తీరానికి చేరుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ములపేటకు చెందిన గరికిన ఆనంద్, ఎరిపిల్లి సత్తిబాబు, పేర్ల సత్తిబాబు, ఎరిపిల్లి లక్ష్మయ్య, దాసరి కోయిరాజు, మారిపిల్లి సింహాద్రి, గరికిని అప్పారావు ఈ నెల 6న చేపల వేటకు బోటులో బయలుదేరారు. కాకినాడ 10వ వార్డు కార్పొరేటర్ మోసా పెత్రోకు చెందిన బోటులో వీరంతా భైరవ పాలెం వద్దకు వేట సాగించేందుకు వెళుతున్నారు. సుమారు 80 నుంచి 90 మైళ్లు ప్రయాణించే సరికి అలల ఉద్ధృతితో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో తెలియకుండానే బోటు 300 మైళ్లు దాటేసింది. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రి లేకపోడడంతో వీరంతా బోటులోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఇందులో దాదాపు రూ.3.75 లక్షల విలువైన ట్యూనా చేపలు కుళ్లిపోయాయి. దీంతో 700 కిలోల వరకు సముద్రంలోనే వదిలేశారు. మరో 800 కిలోల వరకు బోటులోనే ఉన్నాయి. దాదాపు రూ.2లక్షల విలువైన వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి. బోటు ప్రస్తుతం మంచినీళ్లపేట మత్స్యకారుల సాయంతో సహకారంతో తీరంలో లంగరు వేశారు. వీరికి నాలుగు రోజులుగా నిద్రాహారాలు లేవు. 10 రోజుల పాటు వారి వెంట తెచ్చుకు 400 లీటర్ల డీజిల్ ఖర్చయిపోగా తెర చాపల సాయంతో ప్రయాణించారు. జీపీఎస్ ద్వారా కళింగపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో వీరి బోటు ఉన్నట్లు గుర్తించి బోటు యజమాని పెత్రోకు సమాచారం ఇచ్చారు. మంచినీళ్లపేట మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నారావు, ఇతర మత్స్యకారులు బోటును గుర్తించి అందులో మత్స్యకారులను తెప్పల సాయంతో గ్రామానికి తీసుకువచ్చారు. వారికి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటుచేశారు. గ్లో సంస్థ ద్వారా వై.వెంకన్నచౌదరి మంచినీళ్లపేట చేరుకుని కాకినాడ మత్స్యకారులతో మాట్లాడారు. దారి ఖర్చుల కోసం రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు ఎంపీపీ జి. వసంతరావు, జి. పాపారావు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
ఇంగ్లిష్ చానల్‌ను ఈదేశాడు!
13.13 గంటల్లో లక్ష్యాన్ని ముద్దాడిన పుణేవాసి పింప్రి, న్యూస్‌లైన్: ప్రతికూల వాతావరణం... ఒకదాని వెనుక మరొకటిగా వచ్చి అడ్డుకుంటున్న అలలు... గమ్యం ఎక్కడుందో కనబడని కటిక చీకటి... అయినా ముందుకు సాగాడు. పోటుపాట్లను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ ఉపోద్ఘాతమంతా పుణే నగరానికి చెందిన రోహన్ మోరే గురించి. ఇంతకీ ఆయన ఏం ఘనకార్యం సాధించాడనే కదా? ఆ వివరాల్లోకెళ్తే... పుణేకు చెందిన రోహన్ మోరే ఇంగ్లీష్ చానెల్ సులువుగా ఈది సత్తాను చాటాడు. ఇంగ్లిష్ చానల్‌ను ఈదాలన్న తన చిరకాల వాంచను ఈ నెల 26వ తేదీన నెరవేర్చుకున్నాడు. 13 గంటల 13 నిమిషాల్లో సుమారు 35 కిలోమీటర్ల సముద్రాన్ని ఈది గమ్యం చేరుకున్నాడు. తన సముద్ర ప్రయాణం గురించి ఆయన మాట్లాడుతూ... ‘ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల మధ్యగల ఇంగ్లిష్ చానల్‌ను ఈదేందుకు ఈ నెల 26వ తేదీన రాత్రి 10 గంటలకు ఇంగ్లండ్ సముద్ర తీరానికి చేరుకున్నాను. ఈదడం ప్రారంభించిన తర్వాత సుమారు ఐదు గంటలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారింది. అలల తాకిడి పెరిగింది. దీంతో ఈదడం చాలా కష్టమైంది. చిమ్మ చీకటిలో ఎటువైపు వెళ్తున్నానో కూడా తెలియలేదు. సరిగ్గా ఆ సమయంలో ఓ బోటు కనిపించింది. దాని వెనకే వెళ్తే ఫ్రాన్స్ తీరం చేరుకోవచ్చని నిర్ణయించుకొని శక్తినంతా కూడదీసుకున్నా. దానివెంటే ఈదడాన్ని కొనసాగించాను. అయితే బోటువల్ల వచ్చే అలల తాకిడి కూడా నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ ముందుకు సాగాను. లక్ష్యసాధన ముందు అలలు, చీకట్లు పటాపంచలయ్యాయి. కనుచూపు మేరలో ఫ్రాన్స్ తీరంలోని ఫినిష్ క్యాప్ పాయింట్ కనిపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వేగం పెంచాను. 13 గంటల్లో తీరాన్ని చేరుకున్నాన’ని చెప్పాడు. 1996లో మహారాష్ర్ట జలతరణ్ సంఘటన ఆధ్వర్యంలో నిర్వహించిన ధురంతర్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు సముద్రంలో మొదటిసారిగా ఈదానని చెప్పాడు. దీంతో ఇంగ్లీష్ చానెల్‌ను ఈదాలన్న పట్టుదల పెరిగిందని, అందుకు అవసరమైన శిక్షణ దేశ విదేశాలు తిరిగానని చెప్పాడు. తన ప్రయత్నానికి నేషన్ స్పోర్ట్స్ ట్రస్టు, పుణే అంతర్జాతీయ మారథాన్ సమితి సహాయ సహకారాలు అందించాయని చెప్పాడు. తన లక్ష్యం నెరవేరేందుకు సహకరించిన ఆర్థిక సాయం చేసిన అభయ్ దాడే, తీర్ఫీదునిచ్చిన ఫ్రెండా స్ట్రీటర్(ఇంగ్లండ్)లకు కృత జ్ఞతలు తెలిపాడు. స్ట్రీటర్ కుమార్తె ఎలీనా స్ట్రీటర్ ఇంగ్లిష్ చానల్‌ను 49 సార్లు ఈదిందని, ఆమె కూడా కొన్ని మెలకువలు నేర్పిందన్నారు.