మంచినీళ్లపేటకు క్షేమంగా చేరిన కాకినాడ మత్స్యకారులు
వజ్రపుకొత్తూరు : బోటులో డీజిల్ లేదు. ఎటు వెళుతోందో తెలిపే దిక్సూచి పనిచేయట్లేదు. చుట్టూ రాకాసి అలలు.. ఎటుచూసినా తమను మింగేసేందుకు ఎగసిపడుతున్న సముద్ర ఆటుపోట్లు! అలలు ఎగసిపడుతున్నా మనోధైర్యం చెక్కుచెదరకుండా.. గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని సంద్రంపై కఠిన ప్రయాణం చేశారు. ఏ ప్రాంతంలో ఉన్నామో తెలియక ఆ మత్స్యకారులు నిద్రలేని రాత్రులు గడిపారు.
వెంట తెచ్చుకున్న ఆహారమంతా పాడైపోయినా.. అదరలేదు. క్షణక్షణం.. భయంభయంగా నిశిరాత్రులు గడిపిన ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజుల పాటు సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన కాకినాడ మున్సిపాలిటీ పరిధి దుమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు గరువారం సాయంత్రం 4.30 గంటలకు వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట సముద్ర తీరానికి చేరుకున్నారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ములపేటకు చెందిన గరికిన ఆనంద్, ఎరిపిల్లి సత్తిబాబు, పేర్ల సత్తిబాబు, ఎరిపిల్లి లక్ష్మయ్య, దాసరి కోయిరాజు, మారిపిల్లి సింహాద్రి, గరికిని అప్పారావు ఈ నెల 6న చేపల వేటకు బోటులో బయలుదేరారు. కాకినాడ 10వ వార్డు కార్పొరేటర్ మోసా పెత్రోకు చెందిన బోటులో వీరంతా భైరవ పాలెం వద్దకు వేట సాగించేందుకు వెళుతున్నారు. సుమారు 80 నుంచి 90 మైళ్లు ప్రయాణించే సరికి అలల ఉద్ధృతితో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో తెలియకుండానే బోటు 300 మైళ్లు దాటేసింది. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రి లేకపోడడంతో వీరంతా బోటులోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.
ఇందులో దాదాపు రూ.3.75 లక్షల విలువైన ట్యూనా చేపలు కుళ్లిపోయాయి. దీంతో 700 కిలోల వరకు సముద్రంలోనే వదిలేశారు. మరో 800 కిలోల వరకు బోటులోనే ఉన్నాయి. దాదాపు రూ.2లక్షల విలువైన వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి. బోటు ప్రస్తుతం మంచినీళ్లపేట మత్స్యకారుల సాయంతో సహకారంతో తీరంలో లంగరు వేశారు. వీరికి నాలుగు రోజులుగా నిద్రాహారాలు లేవు. 10 రోజుల పాటు వారి వెంట తెచ్చుకు 400 లీటర్ల డీజిల్ ఖర్చయిపోగా తెర చాపల సాయంతో ప్రయాణించారు. జీపీఎస్ ద్వారా కళింగపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో వీరి బోటు ఉన్నట్లు గుర్తించి బోటు యజమాని పెత్రోకు సమాచారం ఇచ్చారు.
మంచినీళ్లపేట మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నారావు, ఇతర మత్స్యకారులు బోటును గుర్తించి అందులో మత్స్యకారులను తెప్పల సాయంతో గ్రామానికి తీసుకువచ్చారు. వారికి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటుచేశారు. గ్లో సంస్థ ద్వారా వై.వెంకన్నచౌదరి మంచినీళ్లపేట చేరుకుని కాకినాడ మత్స్యకారులతో మాట్లాడారు. దారి ఖర్చుల కోసం రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు ఎంపీపీ జి. వసంతరావు, జి. పాపారావు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment