చేతిరాతకు పదును పెడదాం
అక్షరాలకు లక్షల రూపాలు. చక్కని చేతిరాత మార్కుల సాధనకే కాదు.. వ్యక్తిత్వానికి, క్రమశిక్షణకు గీటురాయి. అందంగా రాసేవారి మనసు కూడా అందంగా.. సౌమ్యంగా.. ఉంటుందట. ఏ విషయంలోనైనా స్పష్టత కలిగి ఉంటారట. దూకుడు స్వభావం కాకుండా.. శాంతంగా ఆలోచిస్తారట. ఇలా ఎన్నో సుగుణాలు మంచి చేతిరాత నేర్చుకోవడం ద్వారా అలవరచుకోవచ్చని.. ఆ రంగంలోని నిపుణులు, మానసిక విశ్లేషకుల మాట.
సాక్షి, విశాఖపట్నం: మన రాత బాగుంటే ఫలితం అదే వస్తుంది. నిజమే కదూ! కాలపరీక్షకు నిలబడి తగిన ఫలితం పొందాలంటే మన చేతి రాత బాగుండాలి. మంచి హ్యాండ్ రైటింగ్ విద్యార్థుల విజయానికి ఎంతో ఉపకరిస్తుంది. ఎంత బాగా చదివితే మాత్రం.. చేతిరాత బాగోలేకపోతే స్టేట్ ర్యాంకు రావాల్సినవారు దాన్ని కోల్పోతారు. కచ్చితంగా పాసవుతామనుకునేవారు కాస్త.. అది మిస్సవుతారు. అలా జగరకుండా ఉండాలంటే.. పరీక్షల సమయానికి ముందునుంచే.. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో చేతిరాతపై దృష్టిపెడితే పరీక్షలు ఎప్పుడొచ్చినా బెంగ ఉండదు. ఈ కొద్ది కాలంలో.. చేతిరాతలో విలువైన.. సులువైన మెలకువలు నేర్చుకుంటే ఫలితంపై ఇక బెంగ అవసరం లేదు.
అక్షరాలకు లక్షల రూపాలు
అవును.. ఒకే అక్షరాన్ని లక్షలాది రూపాల్లో రాయొచ్చు. అయితే విద్యార్థులకు అవసరమైన రైటింగ్ స్టైల్ కేవలం రెండు రకాలు. ఒకటి కర్సివ్ రైటింగ్.. రెండోది ప్లెయిన్ లేదా ప్రింట్ స్క్రిప్ట్. కర్సివ్ రైటింగ్ యూనివర్సల్ రైటింగ్. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా చేతిరాతకు ప్రాధాన్యం ఎందుకంటే.. అది క్రమశిక్షణకు గీటురాయి లాంటిది. అక్షర స్వరూపమే కాదు.. రాసే తీరులో ఓ రిథమ్ ఉంటుంది. ఎక్కడ గాడి తప్పినా రాత బాగోదు. రాతను బట్టే విద్యార్థి శ్రద్ధాశక్తులను అంచనా వేయొచ్చు.
చేతిరాత ఎందుకు బాగోదంటే...
చాలామంది విద్యార్థులు బాగా చదువుతారే తప్ప రాతపై దృష్టి పెట్టరు. యూనిట్ టెస్ట్ మొదలు ఫైనల్ పరీక్షల వరకు ఆ పాఠశాల/కళాశాలలో జరిగే పరీక్షల్లో చేతిరాత బాగోపోయినా టీచర్లకు భావం/అర్థం తెలిస్తే చాలు.. మార్కులు వేసేస్తారు. దీం తో అలాంటి విద్యార్థులు చేతి రాతపై పెద్దగా దృష్టి పెట్టరు.
చేతిరాత బాగోలేదని మార్కెట్లో దొరికే కాపీ పుస్తకాలు రాస్తారు. కానీ.. గురుముఖఃతా అభ్యాసన ఉండదు కనుక.. పుస్తకంలో రాత ఒకలా ఉంటే.. రాసేతీరు మరోలా ఉంటుంది. నూటికి 30 శాతానికి మించి కాపీ పుస్తకాల ద్వారా రాత మెరుగు పడినవారు అరుదు.
పెన్‌ని గట్టిగా.. దగ్గరగా పట్టుకోవడం. ఒత్తిపెట్టి రాయడం.
రాసేటప్పుడు బాగా వంగిపోవడం (పుస్తకానికి దగ్గరగా ముఖం పెట్టడం).
చెప్పుకుంటే... ఇవి చాలా చిన్న లోపాలు. వీటి నుంచి బయటపడడానికి వయసు, తరగతిని బట్టి 21 నుంచి 41 గంటల అభ్యాసన (ప్రాక్టీస్) ఉంటే చాలు. ఎవరైనా మంచి చేతిరాత నిపుణుడిని సంప్రదించి ఈ లోపాలను ఇట్టే సరిదిద్దుకోవచ్చు. అదే సమయంలో మంచి మెలకువలు నేర్చుకోవాలి. శిక్షణకు వెళ్లే అవకాశం లేనివారు కింది సూచనల్ని పాటి స్తే కొంతవరకు చేతిరాతను మెరుగుపరచుకోవచ్చు.
పెన్‌ని గట్టిగా పట్టుకోవడం, పుస్తకానికి దగ్గరగా ముఖం ఆనించి రాయడం.. కారణం ఏదైనా కావచ్చు. ఇలాంటి అలవాట్లను వదిలించుకోవాలి.
అలానే ఇంగ్లిష్ విషయానికొస్తే..
కర్సివ్ రైటింగ్‌లో ప్రతి అక్షరం 80 శాతం ఉండాలి. అదీ రైట్ స్లాంటింగ్ (కుడివైపు అక్షరాలు వంగి) ఉండాలి. జోన్‌స కచ్చితంగా పాటించాలి. ప్రాథమికంగా ఈ అక్షరాల స్వరూపం తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి. అదీ రోజుకు రెండు లేదా మూడు గంటలు.
ఎవరైనా నేర్చుకోవచ్చు
చేతిరాతైనా.. లేదా ఏ విద్య అయినా ముఖ్యంగా విద్యార్థి శ్రద్ధ, క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుంది. అలాంటి శ్రద్ధ ఉన్న పిల్లలు మావద్ద కేవలం వారంలో చేతిరాత మెరుగుపరచుకోవచ్చు. సహజంగా ఏడేళ్ల వయసు దాటినవారు.. అంటే సెకెండ్ స్టాండర్‌డ .. ఆపై తరగతుల నుంచి విద్యార్థులు.. వారి వయసును బట్టి నిర్ణీత సమయంలో చక్కని చేతిరాత నేర్చుకోవచ్చు. 14 ఏళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా 21 రోజుల సాధన అవసరం. టెన్‌త, ఇంటర్, డిగ్రీ విద్యార్థులైతే వారి శ్రద్ధాశక్తులను బట్టి కేవలం నాలుగు గంటల్లో రైటింగ్‌పై చక్కని అవగాహన ఏర్పరచుకోవచ్చు. అదే 14 ఏళ్లలోపు పిల్లల్లో అంత శ్రద్ధ కానరాకపోవచ్చు. వారికి నెలరోజుల వరకు శిక్షణ అవసరం. టీచర్లు, సివిల్స్ వంటివాటికి ప్రిపేర్ అయ్యేవారు కేవలం ఒక క్లాస్‌తో మెలకువలకు నేర్చుకోగలరు. తర్వాత ఇంటి వద్ద సాధన చేసుకోవచ్చు.
- రాజీ, సిరి హ్యాండ్‌రైటింగ్ నిర్వాహకురాలు, విశాఖ