కొలువుకు దగ్గరి దారి.. ఇంటర్న్‌షిప్ | Resume to be shortlisted after joining with Internship | Sakshi
Sakshi News home page

కొలువుకు దగ్గరి దారి.. ఇంటర్న్‌షిప్

Published Wed, Jul 23 2014 4:02 AM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

కొలువుకు దగ్గరి దారి.. ఇంటర్న్‌షిప్ - Sakshi

కొలువుకు దగ్గరి దారి.. ఇంటర్న్‌షిప్

జాబ్ స్కిల్స్: మీరు కళాశాల చివరి దశలో ఉన్నారా? కార్పొరేట్ ప్రపంచంతో మీకు పరిచయం ఉందా? ఉద్యోగాల గురించి ఏమైనా అనుభవం ఉందా?.. లేకపోతే మాత్రం వెంటనే ఇంటర్న్‌షిప్‌లో చేరండి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఉద్యోగ జీవితానికి, వ్యాపారంలో అనుభవానికి పునాది పడేది ఇక్కడే. ఇంటర్న్‌షిప్‌తో మీ రెజ్యమెకు విలువ పెరుగుతుంది. జాబ్ మార్కెట్‌లో మీకు డిమాండ్ ఏర్పడుతుంది.
 
 నియామకాల విషయంలో సంస్థలు సాధారణంగా అనుభవానికే ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఫ్రెషర్ల కంటే కొంత అనుభవం ఉన్నవారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటాయి. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ద్వారా వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సమయం వృథా చేయకుండా ఇంటర్న్‌షిప్‌లో చేరడం మంచిది. ఫ్యూచర్ జాబ్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్‌షిప్‌పై విద్యార్థులు ముందునుంచే అవగాహన పెంచుకోవాలి.
 
 ఇంటర్న్‌షిప్ అంటే?
 ఇది ఒకరకంగా జాబ్ ట్రైనింగ్ లాంటిదే. అంటే.. ఉద్యోగంలో చేరడానికి ముందు దానికి సంబంధించిన శిక్షణ పొందడం. తరగతి గదిలో పాఠాలు, పుస్తకాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానానికి ఎంత విలువ ఉంటుందో ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్నదానికీ అంతే విలువ ఉంటుంది. సాధారణంగా ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు ఇంటర్న్‌షిష్‌లో చేరుతుంటారు. ప్రతి విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడాన్ని ఒక కచ్చితమైన నిబంధనగా మార్చారు. ఇటీవలి కాలంలో దీని ప్రాధాన్యతను గుర్తించిన డిగ్రీ విద్యార్థులు కూడా ఇంటర్న్‌షిష్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెరుగైన భవిష్యత్తుకు ఇప్పటినుంచే పునాదిరాయి వేసుకోవాలంటే ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
 
 ఇంటర్న్‌షిప్‌తో లాభాలేంటి?
 జాబ్ మార్కెట్‌పై విద్యార్థులకు అవగాహన పెరుగుతుంది. సంస్థల అవసరాలేంటి? అవి తమ ఉద్యోగుల నుంచి ఏం కోరుకుంటున్నాయి? సంస్థల కార్యకలాపాలు ఎలా ఉంటాయి? వంటి కీలకమైన విషయాలు తెలుస్తాయి. కంపెనీలో అనుభవజ్ఞులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకొని, నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సదరు ఉద్యోగం మీకు తగినదో కాదో స్పష్టంగా తెలిసిపోతుంది.
 
 ఒక జాబ్‌లో చేరడాని కంటే ముందు ఆ జాబ్‌లోని లోతుపాతులు తెలుసుకొనే వెసులుబాటు ఇంటర్న్‌షిప్ ద్వారా లభిస్తుంది. ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్ ఎలా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. కార్పొరేట్ కల్చర్‌తో పరిచయం ఏర్పడుతుంది.  ప్రాక్టికల్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇంటర్న్‌షిప్‌లో పొందిన పని అనుభవం విద్యార్థిని ఒక మంచి ఉద్యోగిగా మార్చేందుకు దోహదం చేస్తుంది. ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులు తమ అర్హతలను పెంచుకోవచ్చు. దీంతో వారి రెజ్యుమెకు అదనపు విలువ పెరుగుతుంది. ఇలాంటి రెజ్యుమెలు కంపెనీల యాజమాన్యాలను ఆకర్షిస్తాయి. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
 
 కోర్సు పూర్తికాగానే ఉద్యోగం
 తాజాగా తెరపైకొచ్చిన ట్రెండ్ ఏమిటంటే...  ఒక సంస్థలో ఇంటర్న్‌షిష్ చేసినవారికి అదే సంస్థలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇలాంటివారికే యాజమాన్యాలు పెద్దపీట వేస్తున్నాయి. విద్యార్థి పనితీరు, స్వభావం, నైపుణ్యాల గురించి ఇంటర్న్‌షిప్‌లో తెలిసిపోతుంది. ఆకట్టుకొనే పనితీరును ప్రదర్శించిన విద్యార్థుల చేతికి జాబ్ ఆఫర్ లెటర్లు అందుతున్నాయి. కోర్సు పూర్తికాగానే నేరుగా కొలువులో చేరిపోవొచ్చు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఉద్యోగాలు సులభంగా దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్ ద్వారా ఒక సంస్థ నుంచి బ్యాక్‌అప్ ఆప్షన్ లభిస్తుండడం మంచిదే కదా! భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తులతో పరిచయాలు, అనుబంధాలు పెంచుకోవడానికి ఉపయోగపడే గొప్ప వేదిక.. ఇంటర్న్‌షిప్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement