Job training
-
ఇదేం ‘శిక్ష’ణ..?.. కోచింగ్ పూర్తికాకుండానే సంస్థలకు సొమ్ములు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చే కాంట్రాక్టులు పొందిన పలు ప్రైవేటు కోచింగ్ సంస్థలు శిక్షణ పూర్తి చేయకుండానే సర్కారు సొమ్మును అప్పనంగా దండుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా సంస్థల నిర్వాకంతో విలువైన సమయాన్ని కోల్పోయిన అభ్యర్థులు పలు జిల్లాల్లో ఏకంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో వాస్తవ పరిస్థితిని సమీక్షించిన అధికారులకు అసలు సంగతి తెలిసింది. ఇంత జరిగినా అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టి ఇక చేసేదేంలేదని చేతులు దులుపుకోవడం గమనార్హం. ‘ప్రైవేటు’కు అప్పగించి... బీసీ అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గతేడాది సెపె్టంబర్ 15న రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లను తెరిచింది. ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేసింది. ఒక్కో అభ్యర్థికి మూడు నెలలపాటు అయ్యే శిక్షణ వ్యయాన్ని రూ. 5 వేల చొప్పున ఖరారు చేశారు. ఈ ఫీజును బీసీ సంక్షేమ శాఖ భరిస్తూ... అభ్యర్థులకు మాత్రం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సెంటర్లను తెరిచింది. ఈ లెక్కన ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రూ. 5 లక్షలు ఖర్చు కానుండగా రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్ల ద్వారా అయ్యే మొత్తం శిక్షణ ఖర్చు రూ. 2.5 కోటు్లగా ప్రభుత్వం తేల్చింది. ఈ మొత్తంతో అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను బీసీ స్టడీ సర్కిల్ ఏడు ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు ఇవ్వగా మిగతా ఆరు సెంటర్లకు ఐదేసి సెంటర్ల చొప్పున శిక్షణ బాధ్యతలు ఇచ్చింది. సబ్ కాంట్రాక్టు పేరుతో మాయ.. ఇంతవరకు బాగానే ఉన్నా... శిక్షణ బాధ్యతలు తీసుకున్న ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. అభ్యర్థులకు నేరుగా శిక్షణ ఇచ్చే బదులు ఆ బాధ్యతను కొందరికి సబ్ కాంట్రాక్టు ఇచ్చాయి. 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు తీసుకున్న ఓ కాంట్రాక్టు సంస్థ... కిందిస్థాయిలో ఒక్కో వ్యక్తికి 10 సెంటర్ల చొప్పున రూ. 7.5 లక్షలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలిసింది. అయితే సబ్ కాంట్రాక్టు పొందిన వాళ్లంతా తరగతులు ప్రారంభించి దాదాపు నెల రోజులు నిర్వహించిన అనంతరం అప్పటివరకు చెప్పిన క్లాసులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టు తీసుకున్న సంస్థలను డిమాండ్ చేశారు. కానీ కాంట్రాక్టు సంస్థలు పట్టించుకోకపోవడంతో సబ్ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ తరగతులను నిలిపివేశాయి. దీంతో అర్ధంతరంగా కోచింగ్ నిలిచిపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేయగా మరికొన్ని జిల్లాల్లో అభ్యర్థులను స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. మరోవైపు దీనిపై వివాదం కొనసాగుతుండగానే శిక్షణ గడువు ముగిసిందంటూ కాంట్రాక్టు సంస్థలు బీసీ స్టడీ సర్కిల్ నుంచి బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నోటీసులిచ్చినా స్పందించలేదు.. కలెక్టర్ల ఆదేశంతో రంగంలోకి దిగిన బీసీ సంక్షేమ అధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించి బీసీ స్టడీ సర్కిల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఇటీవల కాంట్రాక్టు పొందిన ప్రైవేటు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అవకతవకలపై వెంటనే వివరణ ఇవ్వాలని పేర్కొంది. కానీ ఈ నోటీసులకు ఆయా సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అర్ధంతరంగా ఆపేస్తే ఎలా? గ్రూప్–3, గ్రూప్–4 పోస్టులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనగానే సంబరపడ్డా. నారాయణపేట జిల్లాలోని బీసీ స్టడీ సెంటర్లో కోచింగ్‌కు వెళ్లా. దాదాపు నెలన్నర తరగతుల అనంతరం శిక్షణను అర్ధంతరంగా ఆపేశారు. దీంతో సిలబస్ పూర్తికాక, ఇతర కోచింగ్ సెంటర్లకు వెళ్లే పరిస్థితి సతమతమవుతున్నా. – శ్వేత, బొమ్మన్‌పాడ్, నారాయణపేట జిల్లా -
లక్ష మంది యువతకు శిక్షణలో విజనెట్ ఇండియా
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఎం రంగాల్లో ఉద్యోగాలకు అనుగుణంగా 1 లక్ష మంది గ్రాడ్యుయేట్స్‌కు తగు శిక్షణ కల్పించాలని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సంస్థ విజనెట్ ఇండియా నిర్దేశించుకుంది. 500 మంది యువ ప్రొఫెషనల్స్‌తో 45 రోజుల ప్రోగ్రాం తొలి బ్యాచ్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఎండీ అలోక్ బన్సల్ ఈ విషయం తెలిపారు. ’ఉన్నతి ఫర్ ఇండియా’ ప్రాజెక్టు కింద ఈ శిక్షణ ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేషన్ లభిస్తుందని తెలిపారు. ఫ్రెషర్లకు సాధారణంగా తమ సంస్థలో 3–4 దశల్లో వడపోత ఉంటుందని, ఈ శిక్షణ పొందినవారు ఒక్క రౌండును పూర్తి చేస్తే సరిపోతుందని బన్సల్ చెప్పారు. -
‘సివిల్’ పట్టభద్రులకు ఉద్యోగ శిక్షణ
ఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం కొత్త వరం ‘న్యాక్’ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ సాక్షి, హైదరాబాద్: సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. శిక్షణ ఇచ్చి, క్యాంపస్ ఇంటర్వూ్యల్లో ఉద్యోగం పొందేలా అభ్యర్థులను తీర్చిదిద్దే బాధ్యతలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)కు అప్పగించింది. ఈ మేరకు భవన నిర్మాణంలో ప్రతిభకు సాన పట్టి ప్రైవేటు నిర్మాణ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా అభ్యర్థులను న్యాక్ సిద్ధం చేస్తుంది. ఆయా నిర్మాణ సంస్థలను అభ్య ర్థుల ముంగిటకే రప్పించి ప్లేస్మెంట్ చూపిస్తుంది. ఈ కొత్త కార్యాచరణను తాజాగా న్యాక్ ప్రారంభించింది. సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వారికి ఉపాధి అవకా శాలు కల్పించే బాధ్యతను న్యాక్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి.. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొంతమందితో చర్చించి సమస్యకు కారణాలను విశ్లేషించారు. ఇంజనీరింగ్‌లో ప్రాక్టికల్ అవగాహన అవసరమని, ఇందుకు కనీసం మూడు నెలలపాటు భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం అంగీకరించటంతో బ్యాచ్‌లవారీ శిక్షణకు ప్రణాళిక రూ పొందించారు. భవన నిర్మాణానికి సంబంధించిన సర్వే, ఆటో క్యాడ్, మెటీరియల్ క్వాలిటీ పరీక్ష, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, సిమెంట్ పని, రంగులు వేయటం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడు నెలల శిక్షణ తర్వాత నిర్మాణ సంస్థలతో క్యాంపస్ ఇంటర్వూ్యలు ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ వ్యయాన్ని ఎస్సీ కార్పొరేషనే భరిస్తుంది. ఇందులో భాగంగా 30 మందితో తొలి శిక్షణ తరగతులు మొదలయ్యాయి. మరో నెల తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభించనున్నారు. -
కొలువుకు దగ్గరి దారి.. ఇంటర్న్‌షిప్
జాబ్ స్కిల్స్: మీరు కళాశాల చివరి దశలో ఉన్నారా? కార్పొరేట్ ప్రపంచంతో మీకు పరిచయం ఉందా? ఉద్యోగాల గురించి ఏమైనా అనుభవం ఉందా?.. లేకపోతే మాత్రం వెంటనే ఇంటర్న్‌షిప్‌లో చేరండి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ఉద్యోగ జీవితానికి, వ్యాపారంలో అనుభవానికి పునాది పడేది ఇక్కడే. ఇంటర్న్‌షిప్‌తో మీ రెజ్యమెకు విలువ పెరుగుతుంది. జాబ్ మార్కెట్లో మీకు డిమాండ్ ఏర్పడుతుంది. నియామకాల విషయంలో సంస్థలు సాధారణంగా అనుభవానికే ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఫ్రెషర్ల కంటే కొంత అనుభవం ఉన్నవారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటాయి. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ద్వారా వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత సమయం వృథా చేయకుండా ఇంటర్న్‌షిప్‌లో చేరడం మంచిది. ఫ్యూచర్ జాబ్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్‌షిప్‌పై విద్యార్థులు ముందునుంచే అవగాహన పెంచుకోవాలి. ఇంటర్న్‌షిప్ అంటే? ఇది ఒకరకంగా జాబ్ ట్రైనింగ్ లాంటిదే. అంటే.. ఉద్యోగంలో చేరడానికి ముందు దానికి సంబంధించిన శిక్షణ పొందడం. తరగతి గదిలో పాఠాలు, పుస్తకాల ద్వారా నేర్చుకున్న పరిజ్ఞానానికి ఎంత విలువ ఉంటుందో ఇంటర్న్‌షిప్‌లో నేర్చుకున్నదానికీ అంతే విలువ ఉంటుంది. సాధారణంగా ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు ఇంటర్న్షిష్లో చేరుతుంటారు. ప్రతి విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడాన్ని ఒక కచ్చితమైన నిబంధనగా మార్చారు. ఇటీవలి కాలంలో దీని ప్రాధాన్యతను గుర్తించిన డిగ్రీ విద్యార్థులు కూడా ఇంటర్న్షిష్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెరుగైన భవిష్యత్తుకు ఇప్పటినుంచే పునాదిరాయి వేసుకోవాలంటే ఇంటర్న్‌షిప్ పూర్తిచేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌తో లాభాలేంటి? జాబ్ మార్కెట్‌పై విద్యార్థులకు అవగాహన పెరుగుతుంది. సంస్థల అవసరాలేంటి? అవి తమ ఉద్యోగుల నుంచి ఏం కోరుకుంటున్నాయి? సంస్థల కార్యకలాపాలు ఎలా ఉంటాయి? వంటి కీలకమైన విషయాలు తెలుస్తాయి. కంపెనీలో అనుభవజ్ఞులతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకొని, నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. సదరు ఉద్యోగం మీకు తగినదో కాదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒక జాబ్‌లో చేరడాని కంటే ముందు ఆ జాబ్‌లోని లోతుపాతులు తెలుసుకొనే వెసులుబాటు ఇంటర్న్‌షిప్ ద్వారా లభిస్తుంది. ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. కార్పొరేట్ కల్చర్‌తో పరిచయం ఏర్పడుతుంది. ప్రాక్టికల్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇంటర్న్‌షిప్‌లో పొందిన పని అనుభవం విద్యార్థిని ఒక మంచి ఉద్యోగిగా మార్చేందుకు దోహదం చేస్తుంది. ఇంటర్న్‌షిప్‌తో విద్యార్థులు తమ అర్హతలను పెంచుకోవచ్చు. దీంతో వారి రెజ్యుమెకు అదనపు విలువ పెరుగుతుంది. ఇలాంటి రెజ్యుమెలు కంపెనీల యాజమాన్యాలను ఆకర్షిస్తాయి. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. కోర్సు పూర్తికాగానే ఉద్యోగం తాజాగా తెరపైకొచ్చిన ట్రెండ్ ఏమిటంటే... ఒక సంస్థలో ఇంటర్న్‌షిష్ చేసినవారికి అదే సంస్థలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇలాంటివారికే యాజమాన్యాలు పెద్దపీట వేస్తున్నాయి. విద్యార్థి పనితీరు, స్వభావం, నైపుణ్యాల గురించి ఇంటర్న్‌షిప్‌లో తెలిసిపోతుంది. ఆకట్టుకొనే పనితీరును ప్రదర్శించిన విద్యార్థుల చేతికి జాబ్ ఆఫర్ లెటర్లు అందుతున్నాయి. కోర్సు పూర్తికాగానే నేరుగా కొలువులో చేరిపోవొచ్చు. ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఉద్యోగాలు సులభంగా దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్న్‌షిప్ ద్వారా ఒక సంస్థ నుంచి బ్యాక్అప్ ఆప్షన్ లభిస్తుండడం మంచిదే కదా! భవిష్యత్తులో ఉపయోగపడే వ్యక్తులతో పరిచయాలు, అనుబంధాలు పెంచుకోవడానికి ఉపయోగపడే గొప్ప వేదిక.. ఇంటర్న్‌షిప్.