అసలే పరీక్ష టెన్‌షన్.. ఆపై భానుడి భగభగలు...అరగంటకోసారి నీళ్లు తాగకపోతే గొంతెడిపోతోంది.. కానీ తొలిరోజు పది పరీక్ష కేంద్రాల్లో చాలా చోట్ల నీళ్లు దొరక్క విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలి వెలుతురు లేని సెంటర్లలో ఫ్యాన్లు, బల్బులు ఏర్పాటు చేయక పోవడంతో విద్యార్థులంతా చెమటలు కక్కుతూ పరీక్షలు రాశారు. ఇక చాలా సెంటర్లలో ఈ సారి కూడా నేలబారు పరీక్షలు తప్పలేదు. మరోవైపు సకాలంలో రవాణా సదుపాయూలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా పదో తరగతి విద్యార్థులకు కష్టాలు తప్పలేదు. పరీక్షల సమయంలో కరెంటు కోతలు లేకపోయినా... చాలా కేంద్రాల్లో కనీస వసతులు కల్పించలేకపోయారు. తిరగని ఫ్యాన్లు.. వేసవి తాపంతో విద్యార్థులు కఠిన పరీక్ష రాశారు. సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కాగా, తొలిరోజు జరిగిన తెలుగు పేపర్-1 పరీక్ష కు 51,092 మంది విద్యార్థులకు గాను 50,765 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జరిగింది. తొలిరోజు కావడంతో నిర్ధేశించిన సమయానికి గంట ముందే చాలామంది విద్యార్థులు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు గదులు వెతుక్కోవడానికి ఇబ్బందులు పడ్డారు.
చేతులెత్తేసిన విద్యాశాఖ
జిల్లాలోని ప్రతి కేంద్రంలోనూ ఈసారి ఫర్నీచర్ ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ అధికారులు పదేపదే చె ప్పినా, చివరకు చేతులెత్తేశారు. దీంతో వివిధ కేంద్రాల్లో ఫర్నీచర్ లేక విద్యార్థులు నేలమీద పరీక్షలు రాయాల్సి వచ్చింది. కొన్ని సెంటర్లలో ఉదయం వచ్చి నంబర్లు వేయడంతో విద్యార్థులు గదులు వెతుక్కోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే వివిధ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బల్లలు చిన్నవి కావడం... ఒక్కో బల్లపై ఇద్దరేసి విద్యార్థులను కూర్చోబెట్టడంతో అసౌకర్యానికి గురయ్యారు. చాలా కేంద్రాల్లో ఫ్యాన్లు తిరగకపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. ఇక ఇన్విజిలేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాండ్లపెంట కేంద్రంలోని ఇద్దరు టీచర్లను విధుల నుంచి తొలగించారు.
ఏ ఒక్క విద్యార్థీ ఇబ్బంది పడకూడదు
జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే జేసీ-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ ఒక కేంద్రాన్ని పరిశీలించారు. ఏ ఒక్క విద్యార్థీ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను వారు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య 9 కేంద్రాలు, జిల్లా స్థాయి పరిశీలకులు ప్రేమానందం 6 కేంద్రాలు, స్క్వాడ్ బృందాలు 67 కేంద్రాలు తనిఖీ చేశాయి.