
షాన్‌దార్ టూంబ్స్
నాలుగొందల ఏళ్లు పైబడిన హైదరాబాద్ మహానగరంలో ప్రపంచాన్ని ఆకర్షించే చారిత్రక సౌధాలెన్నో.
మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com
చూసొద్దాం రండి
నాలుగొందల ఏళ్లు పైబడిన హైదరాబాద్ మహానగరంలో ప్రపంచాన్ని ఆకర్షించే చారిత్రక సౌధాలెన్నో. చార్మినార్, గోల్కొండ, మక్కా.. చెప్పుకొంటూ పోతే పర్యాటకుల మనసు దోచుకున్న ‘నగ’షీలెన్నో. భాగ్యనగరాన్ని సుసంపన్నం చేసిన రాజుల పరంపరను ప్రపంచానికి చాటిచెప్పేలా లెక్కకు మించిన అందాలిక్కడ కనువిందు చేస్తాయి. అలాంటివే కుతుబ్‌షాహీ టూంబ్స్. ఓ రాజ వంశానికి సంబంధించిన సమాధులన్నీ ఒకేచోట ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.
దేశంలోని అత్యంత పురాతన కట్టడాలలో కుతుబ్‌షాహీ సమాధులు ఒకటి. కులీకుతుబ్ రాజులు ఏడుగురితో పాటు వారి కుటుంబసభ్యులు, వారి ఆస్థానంలో పనిచేసిన ప్రధానులు, సైన్యాధ్యక్షులు, అలాగే, హకీంలు (రాజ వైద్యులు).. ఇలా అందరి సమాధులూ సుమారు 108 ఎకరాల ప్రాంగణంలో ఉన్నాయి. గోల్కొండ కోటకు ఉత్తరాన, కిలోమీటరు దూరంలో ఉన్న ఈ సమాధులు, గత కాలపు కళా వైభవాన్ని గుర్తు చేస్తాయి. వీటి నిర్మాణంలోని శిల్పకళా నైపుణ్యం విశేషంగా ఆకర్షిస్తోంది.
కుతుబ్‌షా రాజులు హైదరాబాద్ కేంద్రంగా సుమారు 170 ఏళ్లు (1518- 1687) పరిపాలించారు. 1687లో మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు గోల్కొండ కోట ఆక్రమణతో ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్య పరిధిలోకి వచ్చింది. కుతుబ్‌లు గొప్ప పరిపాలనాదక్షులే కాదు, గోల్కొండ కోట, చార్మినార్, చార్ కమాన్, మక్కా మసీదు, టోలీ మసీదు వంటి అద్భుత కట్టడాలను నిర్మించిన గొప్ప కళా పోషకులు కూడా. అయితే... కుతుబ్‌షాహీ రాజుల్లో 8వ, ఆఖరివాడైన అబ్దుల్ హసన్ తానాషా సమాధి ఈ ప్రాంగణంలో లేదు. తానాషాని మొఘలులు బందీ చేసి ఔరంగాబాద్ తీసుకువెళ్లారు. అలాగే, భాగ్యనగర నిర్మాత, ఐదో కులీకుతుబ్ భార్యగా చెప్పబడే భాగమతి సమాధికి కూడా ఈ ప్రాంగణంలో చోటు దొరకలేదు. సమకాలీన సమస్యలే ఇందుకు కారణమని చెప్పుకోవాలి.
అత్యద్భుతం...
ఎత్తయిన, విశాలమైన పీఠంపై సుమారు 10 నుంచి 15 మీటర్లు ఎత్తులో హిందూ, పర్షియన్, పఠాన్‌ల శైలిలో ఈ సమాధులు నిర్మించారు. ఎర్రని గ్రానైట్ రాయిని అధికంగా వాడారు. సన్నని చక్కని లతలు, పూలతీగల ఆకృతులు టూంబ్స్ పై చెక్కారు. ప్రతి సమాధి వద్ద ప్రార్థన చేసుకొనేందుకు వీలుగా మసీదు ఏర్పాటు చేశారు. ఐదో కుతుబ్‌షాహీ మహ్మద్ కులీ కుతుబ్‌షా 1612 జనవరి 11న కన్నుమూశాడు. ఆయన సమాధి అత్యద్భుతంగా, అన్నింటికంటే అతి పెద్దదిగా కనిపిస్తుంది. 42 మీటర్లు ఎత్తున 18 మీటర్ల డోమ్‌తో ఉంటుంది. ఆయన కుమార్తె హయత్ భక్షీ బేగం సమాధీ ఇక్కడే ఉంది. సుమారు 300 ఏళ్ల కిందట గోల్కొండ కోటను సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికుడు టావెర్నియిర్ కుతుబ్‌షాహీ సమాధులను అత్యద్భుతమైన, అందమైన, చూసి తీరాల్సిన నిర్మాణాలుగా అభివర్ణించాడు.
మరమ్మతులు..
నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ సమాధుల పైభాగాన పెచ్చులూడి కళతప్పాయి. ఇటీవల ఆఘాఖాన్ ట్రస్టువారు సుమారు రూ.100 కోట్ల అంచనాలతో సమాధులకు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఇది పదేళ్ల ప్రాజెక్టు. కాగా, 2016 నాటికి తొలి దశ పనులు పూర్తవుతాయని అంచనా. కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంగణాన్ని వారసత్వ కట్టడంగా గుర్తిస్తూ తగిన నిధులు విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించింది.