పెళ్లిళ్ల ఎల్లయ్య
ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటారు. కుల మతాలు వేరుకావడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఆ పెళ్లికి అడ్డు చెబుతారు. ఇది కామన్! దీంతో విడిచి ఉండలేక.. వేరేవాళ్లను పెళ్లి చేసుకోలేక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న జంటలనేకం. ఇలాంటి వారికి పెద్దన్నగా మారాడు రేణుకుంట్ల ఎల్లయ్య. వరకట్న నిషేధం, కుల నిర్మూలన ధ్యేయంగా కొన్ని వేల జంటలకు వివాహాలు చేసిన ఆయన... ఆదివారం మరో వంద జంటలను ఒక్కటి చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
రేణుకుంట్ల ఎల్లయ్య... హిందుస్తాన్ కేబుల్ లిమిటెడ్‌లో కొంతకాలం పనిచేశాడు 2001లో వీఆర్‌ఎస్ తీసుకున్నాడు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్, కాన్షీరాం ఆశయాలను, సిద్ధాంతాలను న మ్మిన ఎల్లయ్య.. కుల నిర్మూలన, వరకట్న నిషేధం లక్ష్యంగా 24 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 1991 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత ఐక్య వేదిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కులాంతర, మతాంతరం వివాహలను ప్రోత్సహిస్తూ వచ్చాడు.
కులాంతర వివాహాలు చేసుకుని పెద్దల నుంచి సహాయ సహకారాలు లేక ఇబ్బంది పడుతున్న జంటలకు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే ఆర్థిక సహాయం అందేలా చేస్తున్నాడు. వారికి ఉపాధి అవకాశాలనూ కల్పించి చేయూతనందిస్తున్నాడు. ఇప్పటివరకు రెండువేలకుపైగా జంటలకు వివాహాలు చేశాడు. అంతేకాదు... తల్లిదండ్రుల్లో ఎవరైనా జైల్లో ఉంటే ప్రభుత్వ అనుమతితో పెరోల్‌పై బయటికి రప్పించి.. వాళ్ల పిల్లలకు వివాహాలు చేయిస్తున్నాడు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కి, అంధులు, అనాథలకు అన్నీ తానై పెళ్లిళ్లు జరిపిస్తున్నాడు.
ఈ నెల 5న..
మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ఈనెల 5న మరో వంద జంటలకు పెళ్లిళ్లు చే యబోతున్నారు. వివాహం చేసుకున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేలు అందచేయనున్నారు. దళితులను వివాహం చేసుకున్నవారికి అంబేద్కర్ ఫౌండేషన్ న్యూ ఢిల్లీ నుంచి రూ.2 లక్షల 50 వేలు అందేలా చేస్తున్నారు. ఇలాంటి వివాహాలకు ప్రభుత్వాల నుంచి మరింత ప్రోత్సాహమందాల్సి ఉందంటున్నాడు ఎల్లయ్య. ‘కులాంతర, మతాంతర పెళ్లిళ్లు చేసుకున్నవారు ఇరు కుటుంబాల నుంచి ఇబ్బందులెదుర్కొంటున్నారు. అలాంటివారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.
..:: కాసుల సాంబశివుడు/మల్లాపూర్