జిమ్..జిమ్..జుంబా
పర్ఫెక్ట్ ఫిగర్.. కాలేజ్ గోయింగ్ నుంచి సెలబ్రిటీస్ వరకు పఠిస్తున్న మంత్రం. అందుకోసం నగరవాసులు పడని పాట్లు లేవు. ఆరోగ్యమే మహాభాగ్యంగా అందరూ ఫిట్‌నెస్ క్లాసుల్లో చేరుతున్నారు. ‘ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్ కావాలంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు జుంబానే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు’ ట్రైనర్స్ బబిత, విజయ తుపురాణి. ప్రపంచ ఆరోగ్యదినం సందర్భంగా మంగళవారం హిమాయత్‌నగర్‌లోని గోల్డ్ జిమ్‌లో ‘ఆరోగ్యవంతమైన జీవనశైలి’ అనే అంశంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఫిట్‌నెస్ ప్రొఫెషనల్ కిరణ్‌డెంబ్లాతో కలిసి పాల్గొన్న వీరిద్దరిని సిటీప్లస్ పలకరించింది.
ఆ ముచ్చట్లు...
..:: వాంకె శ్రీనివాస్
ఫిట్‌నెస్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే జుంబాలో... కిడ్స్, జూనియర్, ఆక్వా జుంబా, జుంబా కోల్డ్, జుంబా సెంటావో, జుంబా స్టెప్స్ వంటి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ వేసవిలో జుంబా కిడ్స్, ఆక్వా జుంబాకు క్రేజ్ పెరుగుతోంది. హాలీడేస్‌లో స్నేహితులతో కలిసి జుంబా కిడ్స్ క్లాస్‌లకు వెళ్లేందుకు పిల్లలు ఇష్టపడుతున్నారు.
ఆక్వా ఫర్ సమ్మర్..
‘ఏకాగ్రత పెంచే ఈ ఎక్సర్‌సైజు మూమెంట్స్ ఫిజికల్‌గా ఫిట్ అయ్యేందుకు చిన్నారులకు ఉపయోగపడుతున్నాయి’ అంటున్నారు ఇన్‌స్ట్రక్టర్ విజయ తుపురాణి. ఇక పెద్దలు.. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నీళ్లలో ఉండి స్టెప్పులేసే ఆక్వా జుంబానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ‘లావు ఎక్కువగా ఉన్నవాళ్లకు నీళ్లలో డ్యాన్స్ చేయడం సులభం. దీనివల్ల వారు మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవచ్చు. 800 నుంచి వెయ్యి కేలరీల శక్తిని ఇవ్వగలిగే ఈ డ్యాన్స్‌తో రోజంతా చాలా చలాకీగా ఉండగలుగుతారు. ఈ జుంబా వల్ల మెటబాలిక్ రేటు బాగుంటుంది’ అని చెబుతున్నారామె.
సీనియర్స్‌కి కోల్డ్ డ్యాన్స్...
‘వాకింగ్ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటాం. ఎస్‌ఎంఎస్‌లు వస్తే చెక్ చేస్తుంటాం. బోర్ కొడితే పాటలు వింటాం. ఇంట్లో ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తూ.. ఎదురుగా ఉండే టీవీని చూస్తుంటాం. ఇవన్నీ మనం చేసే వర్కవుట్‌పై ప్రభావం చూపుతాయి. ఏకాగ్రత తప్పుతుంది. అదే జుంబా విషయానికొస్తే అలాంటి ఇబ్బందేదీ ఉండదు. ఒక్కసారి మ్యూజిక్ స్టార్ట్ అయితే స్టెప్పులేయడంపైనే దృష్టి ఉంటుంది.
ఎక్కువమందితో కలిసి
చేసేది కాబట్టి... అందరికన్నా బాగా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే జుంబా వర్కవుట్ మాత్రమే కాదు... మెడిటేషన్ కూడా’ అని అంటున్నారు సైనిక్‌పురిలోని ‘స్వెట్ ఎన్ బర్న్’ ఫిట్‌నెస్ స్టూడియో జుంబా ఇన్‌స్ట్రక్టర్ బబిత. సీనియర్ సిటిజన్ల కోసం జుంబా కోల్డ్ డ్యాన్స్ నేర్పిస్తానంటున్న ఈమె... దీనివల్ల వారి బోన్స్ బలపడతాయని చెబుతున్నారు.