మనసును తడిమి.. హృదయాన్ని చేరి | mind and heart are involved | Sakshi
Sakshi News home page

మనసును తడిమి.. హృదయాన్ని చేరి

Published Sat, Apr 4 2015 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

మనసును తడిమి..  హృదయాన్ని చేరి

మనసును తడిమి.. హృదయాన్ని చేరి

కెరీర్ గోల్ చేరే క్రమంలో సొంతూళ్లను వదిలేసి సిటీ బాట పట్టిన యువత... అయినవాళ్ల ‘అటాచ్‌మెంట్’ మిస్సవుతోంది. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, అన్నా, చెల్లి... కుటుంబ సభ్యులతో గడిపిన మధుర క్షణాలు మాయమవుతున్నాయి. తీయని పలుకరింపులు... బంధాలు... అనుబంధాలు... మెట్రో నగరంలో ఎంత బిజీగా గడిపినా ఎక్కడో ఏదో తెలియని వెలితి. ఇంట్లో ఉన్న ప్రతి క్షణం కళ్లల్లో కదలాడుతుంటుంది. గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి కాస్తంత భారం దించుకుంటున్నారు.

జూబ్లీహిల్స్ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్ అండ్ మీడియా విద్యార్థులు జితేంద్ర, వృషబ్, అభిప్స, జాహ్నవి, ఇషా, శికా, తులసి, మహేష్, పృథ్వీ, కుశాల్‌ల పరిస్థితి కూడా ఇదే! ఓ రోజు స్కూల్లో దర్శకుడు ప్రవీణ్ ప్రదర్శించిన ‘బేర్ ఫీట్ టు గోవా’ మూవీ చూసిన వీరి మనసు చలించింది. బంధాలకు అనుసంధానకర్తలను చేసింది. ఇంతకీ ఏముందీ చిత్రంలో! ఏంచేస్తున్నారీ విద్యార్థులు! బంజారాహిల్స్ లామకాన్‌లో  శనివారం ఈ వివరాలను వెల్లడించారు...
 
ముంబైలో ఉండే పేరెంట్స్.. గోవాలో నివాసముంటున్న వారి తల్లిదండ్రులను పట్టించుకోరు. వారికి తమ వద్దకు తెచ్చుకోకపోవడానికి ముంబైలో ఇరికిళ్లని... సాకుగా చూపుతారు. తమ పేరెంట్స్‌కు నానమ్మ దగ్గరి నుంచి లెటర్స్ రావడం గమనిస్తారు సదరు పేరెంట్స్ పిల్లలు. ఓ రోజు లెటర్ ఓపెన్ చేసి చదువుతారు. ‘క్యాన్సర్ వచ్చింది. రండి... ప్లీజ్’ అని లెటర్ ఉంటుంది. అది చూసి మనసు కదిలిన మనవళ్లు వెంటనే ముంబై నుంచి గోవాకు రైలులో బయలుదేరుతారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు మా హృదయాలను తాకాయి. అందుకే మా వంతుగా ఈ సినిమాకు ప్రమోషన్ చేయాలని నిర్ణయించుకున్నాం. కార్పొరేట్ స్కూళ్లకి వెళ్లి అక్కడి విద్యార్థులను కలిశాం. వారి నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో ఉన్న అనురాగాలను పోస్ట్ కార్డులో రాయమని చెప్పాం. అలా వారు రాసిన కార్డులనే పోస్ట్ చేశాం. త్వరలోనే వారి నుంచి సమాధానం వస్తుందనుకుంటున్నాం.

ఇలా చేయడం వల్ల వారికి నానమ్మ, తాతయ్యలతో అనురాగబంధం గుర్తు చేయగలుగుతున్నాం. సీనియర్ సిటిజన్లు అయిన వారి గుండెల్లో మేమున్నామనే ధైర్యాన్ని నింపగలుగుతున్నాం. పదిహేను దేశాల్లోని 238 మంది నుంచి విరాళాలు సేకరించి తీసిన చిత్రం ఇది. తప్పకుండా అదరి హృదయాలను టచ్ చేస్తుంది. ఆత్మీయానురాగాలు అడుగంటుతున్న ఈ రోజుల్లో వాటిని కళ్లకు కట్టించిన తీరు నిజంగా భావోద్వేగాలకు లోను చేస్తుంది. షాపింగ్ మాల్స్‌లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యూసుఫ్‌గూడలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న వారికి ఈ చిత్రం గురించి వివరించాం. ఈ నెల 10న సినిమా రిలీజ్. మేం టచ్ చేసిన వారందరికీ ఈ సినిమా చూపిస్తాం. సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లేందుకు రకరకాల కోర్సులు చేస్తున్నాం. ఓ మంచి సందేశం ఇచ్చే ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ చేయడమంటే అది మాకు దక్కిన  అదృష్టంగా భావిస్తున్నాం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement