సూపర్ మామ్
మాతృత్వం పేగుబంధానికే పరిమితం కాదని రుజువు చేస్తోంది సూపర్ మామ్. నా అన్న వారు లేని పిల్లలకు.. అక్కున చేర్చుకునే మాతృమూర్తులను పరిచయం చేస్తోందీ కొత్త కాన్సెప్ట్. అనాథఆశ్రమాల్లో అమ్మ లాలన కోసం ఆశగా ఎదురు చూసే చిన్నారులకు ఆత్మీయత చూపి వారి జీవన విధానాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే ‘సూపర్ మామ్’ను ప్రారంభించామని అంటున్నారు మార్గ్ ఫౌండేషన్ ఫౌండర్ నఫీసా ఇస్మాయిల్.
ఎవరూ లేని అనాథలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకమైన ‘అమ్మ’ పాత్రను పోషించడానికి మాతృమూర్తులను స్వాగతిస్తున్నారు. ఈ అమ్మదనం గురించి మరిన్ని విశేషాలు నఫీసా మాటల్లోనే..
- వాంకె శ్రీనివాస్
సిటీవాసులు చాలా మంది బర్త్‌డే సెలబ్రేషన్స్ అని, పెళ్లి రోజు వేడుకలని.. ఇలా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని అనాథ ఆశ్రమాలకు వెళ్లి అక్కడి పిల్లలతో కలసి సంబరాలు చేసుకోవడం పెరిగిపోయింది. వేడుకలు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. మనకు తెలియకుండానే ఆ పిల్లలకు మరింత వేదనను మిగులుస్తున్నామన్నది మరచిపోతున్నాం. మన పిల్లలతో కేక్ కట్ చేసి ప్రేమానురాగాలను వాళ్ల కళ్లకు కడుతుంటే.. నా అనే వాళ్లు లేని పిల్లలకు పేరేంట్స్ గుర్తొస్తుంటారు.
మనకు అలాంటి లైఫ్ ఎందుకు లేదా అని లోలోపలే ఆవేదన చెందుతుంటారు. అనాథాశ్రమాలకు వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్, అన్నదానం, విద్యాదానానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రతి నెలలో వీలైనన్నిసార్లు వాళ్లని కలసి సమస్యలను తెలుసుకొని గైడ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేదాన్ని.
స్నేహితుల ప్రోత్సాహంతో...
నాలుగేళ్ల క్రితం క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు వరకట్న హత్య, అత్యాచారం కేసుల్లో చాలా మంది పిల్లలు పేరేంట్స్‌కు దూరమవుతుండటం చూశా. వీరు జైలులో మగ్గుతుంటే.. అమ్మమ్మ, తాత ఉన్నా పేదరికం అడ్డురావడంతో పిల్లలని అనాథశ్రమాల్లో చేర్పిస్తుండటం చాలా బాధించింది. ఈ విషయాన్ని స్పెయిన్‌లో ఉన్న మా ఫ్రెండ్స్‌తో చర్చించా. ‘సూపర్ మామ్’ ఆలోచనను పంచుకున్నా. వాళ్లు నన్ను ముందుకు వెళ్లమని ప్రోత్సహించడంతో.. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో బిజీగా మారిపోయాను. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాల ద్వారానే సూపర్ మామ్ చేపట్టాలని అధికారులతో చర్చలు జరుపుతున్నా. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నా.
ఇలా చేస్తాం...
ఒక్కో అనాథ ఆశ్రమంలో దాదాపు 60 మంది పిల్లలు ఉండొచ్చు. ఒక్కో పిల్లాడికి సూపర్ మామ్‌గా ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తాం. సామాజిక ఆలోచనతో ముందుకు వచ్చిన వారిని తీసుకొని ఒక్కో పిల్లాడితో అటాచ్ చేస్తాం. ఇలా వారు వీలున్నప్పుడుల్లా మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంటాం. కెరీర్‌పై వాళ్లకు అవగాహన వచ్చే స్థాయి వరకు తీసుకువెళ్తాం. ఆ పిల్లలను ఎవరైనా దత్తత తీసుకునే వరకు అమ్మ లేని లోటు లేకుండా చేస్తాం. వారు భవిష్యత్‌లో పది మందికి సహయపడేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం.
ఇలా చేయడం వల్ల ఆ చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు ఈ పిల్లలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల.. కొందరు వాళ్ల బలహీనతలను ఉపయోగించుకొని నా అన్న ఫీలింగ్‌ను కలిగించి, సంఘ వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నారు. అందుకే ఆ పిల్లల్లో సాఫ్ట్ ఫీలింగ్ కలిగించి మంచి భవిష్యత్‌కు సూపర్ మామ్ ద్వారా బాటలు వేయాలనుకుంటున్నాం.
మదర్ నఫీసా...
ముగ్గురు పిల్లల తల్లి నఫీసా. 2007లో మార్గ్ ఫౌండేషన్ ప్రారంభించి మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్న నఫీసాకు కర్మవీర్ పురస్కార్ దక్కింది. ఈమె పెద్దమ్మాయి సారా మెడిసిన్ చేయగా, కుమారుడు తాసిఫ్ ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న అమ్మాయి సైబ లా ప్రిపేర్ అవుతోంది. ముగ్గురు బిడ్డలను సరైన మార్గంలో పెట్టిన నఫీసా.. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే సూపర్ మామ్‌గా మారుతున్నారు.