స్వెట్ & బర్న్
కార్పొరేట్ ఉద్యోగం. జాలీగా సాగిపోతున్న జీవనం. అయినా ఏదో తెలియని వెలితి. ఇలా రొటీన్ లైఫ్‌కి భిన్నంగా ఏదైనా చేయాలనుకుంది. 18 ఏళ్ల కార్పొరేట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ఫిట్‌నెస్ కోసం స్టెప్స్ వేసింది. శరీరం సహకరించక ఇబ్బందులు ఎదురైనా... అవలీలగా అధిగమించి ఇప్పుడు సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్, ఏరోబిక్స్ అండ్ జుంబా ట్రైనర్‌గా మారింది. ఆమె జాక్వలిన్ బబితా జేవియర్. డిప్రెషన్‌నుంచి బయటపడేందుకు ఈ హైదరాబాదీ మొదలుపెట్టిన పరుగు...
ఎన్నో పతకాలను తెచ్చిపెట్టింది. 44 ఏళ్ల వయసులో అథ్లెట్‌గా మారి, ఇద్దరు పిల్లల తల్లిగా విజయపథంలో దూసుకెళ్తూ మేరీకోమ్‌ను తలపిస్తున్న బబిత పరిచయం...
రెస్టారెంట్ నిర్వహిస్తున్న భర్త. ఇద్దరు పిల్లలు. మంచి ఉద్యోగం. జాబ్ చేసుకుంటూనే పిల్లల ఆలనాపాలన చూస్తున్న బబితకు ఇది రొటీన్ అనిపించింది. వ్యక్తిగతంగా ఏదో సాధించాలన్న ఆలోచన వచ్చింది. అందుకోసం ఫిట్‌నెస్ రంగాన్ని ఎంచుకుంది. అలా 2011లో ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ దినాజ్ దగ్గర ఏరోబిక్ పాఠాలు నేర్చుకున్న ఆమె... రెండేళ్ల పాటు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేసింది.
గతేడాది సైనిక్‌పురిలో ‘స్వెట్ ఎన్ బర్న్ ఫిట్‌నెస్’ స్టూడియోను ప్రారంభించి ఫిట్‌నెస్ గురువుగా మారిపోయింది. అయితే కేవలం ఫిట్‌నెస్ ట్రైనర్‌గానే ఉండిపోతే ఆమె గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయేది. గతేడాది... ఎంతో ప్రీతిపాత్రంగా ఉండే ఓ స్నేహితురాలు ఆమెను అవమానించింది. అది బబితను డిప్రెషన్‌లోకి తీసుకెళ్లింది. ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు రన్నింగ్ మొదలు పెట్టింది. మనస్సు కాస్త కుదుటపడింది. ఒత్తిడికి దూరం అయ్యింది. అలా ప్రారంభించిన రన్ ఈ రోజు ఆమెను జాతీయస్థాయి క్రీడాకారిణిగా నిలబెట్టింది.
కాన్ఫిడెన్స్ పెంచింది...
‘2014 జనవరి 5న శామీర్‌పేట బిట్స్‌పిలానీ దగ్గర హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన అలంకృత బ్రేక్‌ఫాస్ట్ రన్‌కు వెళ్లా. సరదాగా ఐదు కిలోమీటర్లు పరుగెత్తి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంలే అనుకున్నా. అక్కడికెళ్లాక ఏకంగా 21 కిలోమీటర్ల పరుగెత్తా. ఆ ఫిట్‌నెస్ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. నాలో కాన్ఫిడెన్స్ కూడా పెంచింది.
గతేడాది మార్చి 9న హైదరాబాద్ రన్నర్స్ నిర్వహించిన క్లబ్న్‌ల్రో 40 ప్లస్ కేటగిరిలో పరుగెత్తా. రెండు గంటల 14 నిమిషాల్లో 21 కిలోమీటర్లు రన్‌చేసి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నా. ఆ తర్వాత చెన్నై ట్రెయిల్ రన్‌లో సెకండ్ ప్రైజ్, కొచ్చిన్ మారథాన్‌లోనూ రెండో స్థానంలో నిలిచా. బెంగళూరులో జరిగిన రన్‌లోనూ పాల్గొన్నా. హైదరాబాద్ మారథాన్‌లో నా పిల్లలతో కలిసి పార్టిసిపేట్ చేశా’ అని చెబుతుంది బబిత.
గర్వంగా ఉంది...
గతేడాది నవంబర్‌లో కరీంనగర్‌లో డిస్ట్రిక్స్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ జరుగుతుందని తెలిసి బబిత పాల్గొన్నది. 1500 మీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగంలో మూడు బంగారు పతకాలు వచ్చాయి. ఆ ఆత్మవిశ్వాసంతో హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కు వెళ్లింది. అక్కడా 35 ప్లస్ కేటగిరి ఐదు కిలోమీటర్ల విభాగంలో కాంస్యపతకం, పది కిలోమీటర్లు, 1500 మీటర్ల విభాగంలో రజత పతకాలు దక్కించుకుంది.
‘నన్ను కుంగదీసేందుకు అన్న మాటలే నాకు ప్రేరణగా నిలిచాయి. నన్ను జాతీయ స్థాయి క్రీడాకారిణిగా మార్చాయి. వెనక్కి తిరిగి ఈ ప్రయాణాన్ని చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది’ అని ధీమాగా చెబుతుంది బబిత. లేటు వయసులో అథ్లెట్‌గా రాణిస్తూనే, ఫిట్‌నెస్ ట్రైనర్‌గా దూసుకుపోతున్న బబిత భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం!
- వీఎస్