డాక్టర్స్ లేన్... | hospital spot kphb | Sakshi
Sakshi News home page

డాక్టర్స్ లేన్...

Published Thu, Mar 19 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

డాక్టర్స్ లేన్...

డాక్టర్స్ లేన్...

సినిమాలకు క్రాస్‌రోడ్స్.. అమ్మాయిల షాపింగ్‌కు కోటి... ఇలా హైదరాబాద్‌లో కొన్ని అడ్డాలున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి కేపీహెచ్‌బీలోని రోడ్‌నెంబర్ 4 చేరింది. ఆ గల్లీలో వందలాది క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్‌లు, నర్సింగ్ హోంలు, టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్‌లు... ఇలా మనిషికి అవసరమయ్యే ప్రతి స్పెషాలిటీ క్లినిక్ కనబడుతుంటుంది. 2006కు ముందు ఏ మాత్రం చడిచప్పుడు లేని ఆ కాలనీ...

ఇప్పుడు ఎటు చూసినా క్లినిక్‌ల మయమైంది. కొన్ని క్లినిక్‌లు ఆస్పత్రులుగా మారాయి. మెడికల్ షాప్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి.
 
1991లో... మొదటిసారి విఘ్నేశ్ క్లినిక్, ఎస్‌వీఎస్ క్లినిక్ ఏర్పాటయ్యాయా గల్లీలో. అప్పుడు సాయంత్రం ఆరు దాటిందంటే ఎటు చూసినా చీకటే. కేవలం ఈ రెండు క్లినిక్‌లు కరెంట్ వెలుగులతో కనిపించేవి. ఏ రోగమొచ్చినా, ప్రసవాలైనా, రోడ్డు ప్రమాదంలో గాయాలైనా ఈ క్లినిక్‌లకు క్యూ కట్టేవారు. బొల్లారం, బాచుపల్లి, చందానగర్, మూసాపేట, లింగంపల్లి, పటాన్ చెరువు, ఆశోక్ నగర్, జీడిమెట్ల, సూరారం కాలనీవాసులకు ఈ క్లినిక్‌లే దిక్కు.

ఆ రెండు తరువాతి రోజుల్లో విఘ్నేశ్ నర్సింగ్ హోమ్‌గా, ఎస్‌వీఎస్ చిల్డ్రన్ హాస్పిటల్‌గా మారిపోయాయి. కార్పొరేట్ హంగులతో రెడిమేడ్ ఆస్పత్రి రావడంతో కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ 4 దశ తిరిగింది. ఈ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లే పార్ట్‌టైమ్‌గా ఈవెనింగ్ క్లినిక్‌లు ప్రారంభించారు. రోగులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఆ లైన్ కాలక్రమేణా డాక్టర్ లేన్‌గా మారింది. ఇప్పుడు కేపీహెచ్‌బీ రోడ్డు నంబర్ నాలుగు అనేకంటే డాక్టర్స్ గల్లీ అంటేనే సులభంగా గుర్తు పడతారు.
 
ఎందుకీ డిమాండ్...  
ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్లినా కన్సల్టెంట్ ఫీజు... రూ. 500లకు తక్కువ లేదు. కార్పొరేట్ ఆస్పత్రి కన్నా కన్సల్టెంట్ ఫీజు తక్కువ ఉండటం, రీజనబుల్ ధరలకే రూమ్‌లు దొరకడంతో వీటికి రోగుల తాకిడి పెరిగింది. హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు భారీగా వెలవడంతో అందులో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సమీప ప్రాంతాలైన కూకట్‌పల్లి, మియాపూర్‌లో నివాసాలు ఏర్పరుచుకోవడం, ఇతర జిల్లాలనుంచి వచ్చిన మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేట్ ఖర్చులు పెట్టలేక అందుబాటులో ఉన్న ఈ క్లినిక్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రేటులోనే ట్రీట్‌మెంట్ పూర్తవడం, డాక్టర్ల గురించి ఎక్కువ సేపు వేచివుండాల్సిన అవసరం లేకపోవడం... వంటికారణాలన్నీ రోగుల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయి.
 
టెస్టుల కోసం...
ఎంతో దూరంనుంచి హాస్పిటల్‌కు వెళ్తే.. డాక్టర్ టెస్టులు రాస్తాడు. వాటికోసం మళ్లీ ఇంకెక్కడికో పరుగెత్తాల్సి ఉంటుంది. అలాంటి అవసరం లేకుండా... అన్ని పరీక్షలకు అవసరమైన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఈ లేన్‌లో ఉన్నాయి. కార్డియాల జిస్ట్, డెర్మటాల జిస్ట్, గ్యాస్ట్రాంటల జిస్ట్, గైనకాల జిస్ట్, హెమటాల జిస్ట్, నెఫ్రాల జిస్ట్, న్యూరోసర్జన్, అర్థోపెడిస్ట్, సర్జన్, యూరాల జిస్ట్, డెంటిస్ట్, ఐ స్పెషలిస్ట్... ఇలా ఒకటి కాదు... స్పెషలిస్ట్ క్లినిక్‌లు.. ప్రతి ఒక్కటీ కొలువుదీరాయిక్కడ.  
- వీఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement