ఒంటి చేత్తో క్యూ‘ట్రి’క్
రూబిక్ క్యూబ్ అంటే రంగులు కలపడం వూత్రమే కాదు... ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచే పజిల్ కూడా. రూబిక్‌లో రంగులను కలపడం అంటే క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే. ఎన్ని రకాలుగా క్యూబింగ్ చేయగలిగితే ఒకే సమస్యను అన్ని రకాలుగా పరిష్కరించినట్లు. ఇలాంటి రూబిక్ క్యూబ్ అందరూ చేస్తారు. అయితే వేగంగా చేయగలిగినప్పుడే మనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికే ఈ స్పీడ్‌ను అందిపుచ్చుకున్న సిటీజన్ కృష్ణంరాజు గాదిరాజు ఒక చేతితో 24 గంటల పాటు వెయ్యికి పైగా క్యూబ్‌లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా దూసుకెళుతున్నాడు. ప్రసాద్ ఐమాక్స్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు క్యూబింగ్ మొదలెట్టడానికి ముందు ఈ యువకుడు ‘సిటీప్లస్’తో ముచ్చటించాడు.
‘పాఠశాల స్థాయి నుంచే క్యూబిక్ సాల్వర్ ఈవెంట్లలో పాల్గొన్నా. కాళ్లతో కూడా చేశా. కొన్ని రికార్డులు కూడా సాధించా. తొలిసారిగా ఒక్క చేతితోనే వెయ్యికి పైగా క్యూబిక్‌లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని చెప్పాడు. బెంగళూరులోని క్వింటిస్‌లో కెమికల్ రీసెర్చర్‌గా పనిచేస్తున్న కృష్ణమ్ భారత్‌లో స్పీడ్ సాల్వింగ్‌పై అవగాహన తీసుకొచ్చేందుకు ఈ రికార్డుకు శ్రీకారం చుట్టానన్నాడు. కెనడాకు చెందిన ఎరిక్ క్లమ్‌బ్యాక్ రెండు చేతులతో 5,800 క్యూబ్‌లు చేసిన గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్న కృష్ణంరాజుకు ఆల్ ది బెస్ట్. - వీఎస్