
థింక్ బ్రదర్స్.. మిల్క్‌షేక్ కింగ్స్
- స్టార్టప్ సక్సెస్ మంత్ర..
- సిటీవాసులకు యూరప్ రుచులు
అవార్డులు వరించాయి..
‘సాధారణంగా మన నగరంలో మిల్క్‌షేక్‌లు రూ.20లకు లభిస్తాయి. కానీ అది మిల్క్‌షేక్ కాదు. డిఫరెంట్ ఐటమ్స్‌తో వినూత్న ఆలోచనతో మేం రియల్ మిల్క్‌షేక్‌ను సిటీవాసులకు మేం అందిస్తున్నాం.. మంచి సక్సెస్ సాధించాం. ఇందుకు ‘న్యూ కామర్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ మిల్క్ షేక్, బెస్ట్ డిసార్ట్స్ ఇన్ హైదరాబాద్’ అవార్డులు కూడా అందుకున్నాం’ అని గర్వంగా చెబుతున్నారు ఈ ఇద్దరు సోదరులు.
అప్పటికప్పుడు రెడీ..
కస్టమర్లు తమకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ ఇవ్వగానే వీరు రెడీ చేస్తారు. లైవ్‌గా చూడవచ్చు. డిఫరెంట్ ఐటెమ్స్‌కు మిల్క్, ఐస్‌క్రీమ్‌లను మిక్స్ చేసి సిటీవాసులకు యూరప్ తరహా టేస్ట్‌లను చూపెడుతున్నారు వీరు. ‘నెలలో ఒకటి, రెండుసార్లు హైదరాబాద్ ఫుడ్డీస్ లవర్స్ కూడా గ్రూప్‌గా వచ్చి థిక్ షేక్ రుచులను ఆస్వాదిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా ఈ రుచులకు ఫిదా అవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు యశ్వంత్. మిల్క్ షేక్ రుచులను సిటీవాసులకు పరిచయం చేసిన ఈ సోదరులు సామాజిక బాధ్యతగా చిన్నారుల సంక్షేమానికి కృషి చేసే ఓ స్వచ్ఛంద సంస్థకి థిక్ షేక్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కూడా.
ఇవీ మిల్స్‌షేక్ స్పెషల్స్..
అల్ఫాన్సో మ్యాంగ్ మెలడి షేక్, చాక్లెట్ బ్రౌనీ క్రంబుల్ షేక్, సూపర్‌మెన్ సీక్రెట్ షేక్, పీనట్ బట్టర్ ఇండెల్‌జెన్స్ షేక్, వెరీబెర్రీ షేక్, మాల్టో మింట్, టాంజి ఆరంజ్, బ్లూ ఏంజిల్ వంటి ఫ్లషర్స్ ఇక్కడి ప్రత్యేకత. సమ్మర్ సీజన్ స్పెషల్ అయిన అల్ఫాన్సో మ్యాంగ్ మెలడి షేక్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. మిల్క్, చాక్లెట్ ఐస్‌క్రీమ్, బ్రౌనీలతో రెడీ చేసిన చాక్లెట్ బ్రౌనీ క్రంబుల్ షేక్, హనీ, మ్యూజిలి, వెనీలా కాంబినేషన్‌తో తయారుచేసిన సూపర్‌మెన్ సీక్రెట్ షేక్‌లను టేస్ట్ చేసేందుకు పిల్లలు ఎగబడుతున్నారని చెబుతున్నారు థిక్‌షేక్ బ్రదర్స్.
అలా మొదలైంది..
‘భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ చేస్తున్నప్పుడు యూరప్ వెళ్లా. అక్కడి మిల్క్ షేక్‌ను టేస్ట్ చేశా. సూపర్‌గా ఉంది. ఎంబీఏ అయ్యాక హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఏడాదిపాటు జాబ్ చేశా. మరోసారి యూరప్‌కి వెళ్లినప్పుడు మిల్క్‌షేక్ రుచిని మరిచిపోలేకపోయా. ఇదే తరహా ఐటమ్స్‌ను ఇండియాలో పరిచయం చేయాలనుకున్నా. నా ఆలోచనను పేరెంట్స్‌కు చెప్పా. ఎంబీఏ చేసిన తమ్ముడు అశ్విన్ కూడా ‘ఎస్’ అన్నాడు’ అంటూ చెప్పారు యశ్వంత్ నాగ్. ‘తొలినాళ్లలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మిల్క్‌షేక్స్‌తో వ్యాపారం ఏం చేస్తావ్ అన్నవారున్నారు. అయినా అన్నతో కలిసి ముందుకెళ్లా’.. అని చెప్పారు అశ్విన్ అనంత్ నాగ్. మొదట 2013 డిసెంబర్‌లో కూకట్‌పల్లి మంజీర హాల్‌లోని ‘థిక్ షేక్ ఫ్యాక్టరీ’ అవుట్‌లెట్ ప్రారంభించిన వీరు.. వచ్చిన రెస్పాన్స్‌తో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10, సికింద్రాబాద్ సింధు కాలనీలోను అవుట్‌లెట్‌లు తెరిచి విజయవంతంగా రన్ చేస్తున్నారు.