బ్యూటీపూల జడ
లంగాఓణీకి పొడవైన పూలజడ తోడైతే ఏ అమ్మాయైనా కచ్చితంగా బాపు బొమ్మే. అందుకే రోజూ జీన్స్, టీషర్ట్స్‌లో కనిపించే సిటీ అమ్మాయిలు సైతం.. శుభకార్యాల్లో పొడవాటి పూలజడకే ఓటేస్తారు. తమ చిన్నారికి పూలజడ వేసి మురిసిపోని తల్లి ఉండదు! అలా బాల్యంలో అమ్మ తనకు వేయలేదని అలిగి, దెబ్బలు తిని, చివరికి సాధించుకున్న ఆ పూలజడనే... ఇప్పుడు ‘బిజినెస్ ఐటెమ్’గా మారింది. ఆన్‌లైన్‌లో కొత్త ట్రెండ్ అయ్యింది. పెళ్లిళ్లు, పంక్షన్లు, శుభకార్యాలకు కావాల్సిన పూలజడలే కాదు.. పెళ్లికి అవసరమయ్యే అన్ని వస్తువులూ ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి.
..:: వాంకె శ్రీనివాస్
అందమైన పూలజడ వేయడం ఒక ప్రాసెస్! పూల సేకరణ దగ్గరనుంచి ఒద్దికగా పేర్చడం వరకు ఒక ఆర్ట్! బిజీలైఫ్‌లో అంత ఓపిక , తీరిక లేని వాళ్ల కోసం ఏర్పాటయ్యిందే పెళ్లి పూలజడ డాట్‌కామ్! దీని క్రియేటర్ కల్పన. మొదటగా ఎల్‌బీనగర్‌లో ప్రారంభించిన ఆమె ఇప్పడు ఈ సేవలను నగరమంతటా విస్తరించారు. సికింద్రాబాద్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కాచిగూడలలో కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేశారు.
103 రకాలు...
పూలజడల్లో చాలా వెరైటీలున్నాయి. ఎంగేజ్‌మెంట్‌కు లైట్ వెయిట్ జడలు, వలలాగా ఉండే నెట్ పూలజడలంటే ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా ఉంది. లిల్లీ జడలతోపాటు రోస్‌పెటల్స్ వాలుజడలకూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శ్రీమంతానికి గాజుల జడను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మొగలి, సంపంగి పూలజడలకూ మంచి గిరాకీ. ఇలా ఒకటికాదు రెండుకాదు.. 103 రకాల పూలజడలను తయారుచేస్తున్నారు. ఒక్కో జడకు ఒక్కో కోడ్ నంబరు ఇస్తారు. అభిరుచిని బట్టి ఒక్కో పూలజడ ధర వెయ్యి నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఒక్కో పూలజడ అల్లడానికి నాలుగు గంటలు పడుతుంది. వీటి కోసం పూలను గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి తెప్పించుకుంటున్నారు. వేసవి సెలవులకు తోడు పువ్వులు కూడా ఎక్కువగా దొరుకుతుండటంతో పిల్లలకు పూలజడలేయించి ఫొటోలు తీయిస్తున్నారు తల్లులు. తాము దూరమైన ఆ స్వీట్ మెమరీని పిల్లలకు దగ్గర చేస్తున్నారు.
ఆకట్టుకునే అడ్డుతెర...
ఒక్క పూలజడలకే పరిమితం కాకుండా... పెళ్లికి అవసరమయ్యే కొబ్బరిబోండంను డిఫరెంట్ స్టైల్స్‌లో ఆఫర్ చేస్తున్నారు. సీతారాములు తలంబ్రాలు పోసుకున్నట్లుగా, వివిధ డిజైన్స్‌లో వధూవరుల పేర్లు, పీకాక్ డెకరేషన్ ఇలా అనేక రకాలు. అంతేనా.. పెళ్లిలో వాడే అడ్డు తెరనూ అందంగా తయారు చేస్తున్నారు. వధూవరులిద్దరూ హోమం చుట్టూ తిరిగే దృశ్యాన్ని పెయింటింగ్ రూపంలో అడ్డుతెరకు అద్దుతున్నారు. లిల్లీ, మల్లెపూలతో ఆ తెరను సువాసనతో నింపేస్తున్నారు. లిల్లీపూలతో తయారుచేసే అడ్డుతెరకు ఐదు కిలోల పూలు ఉపయోగిస్తారు. ఆరుగురు మహిళలు ఆరు గంటల్లో చేస్తారు. ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది. మల్లెపూలతో తయారుచేసే తెరకు ఎనిమిది గంటలు పడుతుంది. పూలతో అడ్డుతెర తయారుచేయడానికి కనీసం ఒకరోజు పడుతుంది.
అపురూపంగా ఐరేని కుండలు..
తామరపువ్వులాంటి పెళ్లిబుట్టలకు, ముత్యాలు, చిలకలు వేలాడుతున్నట్టుగా ఉండే గంపలకూ మంచి ఆదరణ ఉంది. ఫ్లోరల్ డిజైన్లతో చేసిన ఉంగరాల బిందెలు, కర్పూర దండలు, ఇలాచి దండలు కూడా అందిస్తున్నారు. ఇక ఐరేనీ కుండల ను డెకరేట్ చేయడంలోనూ కొత్త కొత్త పోకడలు చోటుచేసుకుంటున్నాయి. వీటితో పాటు పల్లకీ, తలంబ్రాలు పోసే తట్ట, మెడలో వేసుకునే పూలదండలు, ప్రధాన ఉంగరం ఉంచే కుడుకల వరకు... అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది.
పూల జువెలరీ..
పువ్వులతో నగలను తయారు చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. నగల కోసం ఎక్కువగా మల్లెమొగ్గలనే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే... ‘సువాసన ఇవ్వడమే కాదు... మల్లెలు చూడ్డానికి ముత్యాల్లా ఉంటాయి’ అని చెబుతారు కల్పన. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల తోపాటు తమిళనాడు, ఢిల్లీ ముంబై, యూఎస్‌లలోనూ సేవలందిస్తోంది పూలజడ డాట్ కామ్. పూలజడ, జువెలరీ కావాలనుకునేవారు మీరు వేసుకునే డ్రెస్ కలర్ చెబితే చాలు.. దానికి మ్యాచ్ అయ్యే విధంగా, మీ బడ్జెట్‌లో,
మీకిష్టమైన పూలతో డిజైన్ చేసిస్తారు.